మార్చిలో నియామకాలు 5 % జంప్
న్యూఢిల్లీ: ఉద్యోగ నియమాకాలు మార్చి నెలలో 5 శాతం పెరిగాయి. దీనికి బీఎఫ్ఎస్ఐ, బీపీవో, ఆటో, నిర్మాణ రంగాలు బాగా దోహదపడ్డాయి. రానున్న నెలల్లో కూడా నియామకాల జోరు కొనసాగవచ్చనే అంచనాలు ‘నౌకరి.కామ్’ నివేదికలో వెల్లడయ్యాయి. ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి నౌకరి జాబ్‌స్పీక్ ఇండెక్స్ 2,073 వద్ద ఉంది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇండెక్స్‌లో 5 శాతం వృద్ధి నమోదయ్యింది.
‘వార్షిక ప్రాతిపదికన చూస్తే జాబ్‌స్పీక్ ఇండెక్స్‌లో 5 శాతం వృద్ధి కనిపిస్తోంది. నిర్మాణ, ఇంజనీరింగ్, బీఎఫ్ఎస్ఐ రంగాల్లోని నియామకాల్లో మంచి వృద్ధి నమోదయ్యింది’ అని నౌకరి డాట్‌కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ చెప్పారు. స్వల్పకాల ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వచ్చే త్రైమాసికాల్లో జాబ్ మార్కెట్ జోరు కొనసాగుతుందన్నారు.
నియామకాల కదలికలను రంగాల వారీగా చూస్తే... బీఎఫ్ఎస్ఐలో 26 శాతం వృద్ధి నమోదయింది. బీపీవో/ఐటీఈఎస్, నిర్మాణ రంగాల్లో 9 శాతం చొప్పున పెరుగుదల కనిపించింది. ఐటీ–సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి పురోగతి లేదు. టెలికం రంగంలో మాత్రం 15% క్షీణత నమోదైంది. ప్రాంతాల వారీగా.. 13 ప్రధాన నగరాలకు గాను ఎనిమిదింటిలో నియామకాలు తగ్గాయి. ఢిల్లీ/ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో నియామకాలు వరుసగా 15%, 12%, 4%, 10% పడ్డాయి. కాగా 13–16 ఏళ్ల అనుభవమున్న వారి కి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభించాయి.