Empowered Committee
-
నేడు ఆర్థిక మంత్రుల భేటీ
జీఎస్టీ అమలుపై జైట్లీ సమీక్ష హైదరాబాద్: అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో ఢిల్లీలో బుధవారం జరుగనున్న ఎంపవర్డ్ కమిటీ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరవనున్నారు. జీఎస్టీ అమలుకు సంబంధించి అన్ని రాష్ట్రాల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి ఈటలతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవనున్నారు. అమ్మకపు పన్ను వాటాకు సంబంధించిన సుమారు రూ.5,600 కోట్ల బకాయిలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికీ కేంద్రం నుంచి రావాల్సి ఉంది. పునర్విభజన చట్టం ప్రకారం అందులో 42 శాతం నిధులు తెలంగాణకు దక్కుతాయి. 2007 నుంచి బకాయి ఉన్న ఈ నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు ఆర్థిక సాయం కోరటంతోపాటు.. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని సడలించాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో పాటు 13వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. -
జీఎస్టీ సాధికార కమిటీ కొత్త చైర్మన్ మణి
న్యూఢిల్లీ: వస్తు సేవ ల పన్ను (జీఎస్టీ) వ్యవహా రాల రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ చైర్మన్‌గా కేఎం మణి నియమితులయ్యారు. కేరళ ఆర్థికశాఖ సహా న్యాయ, గృహ వ్యవహారాల శాఖల మంత్రిగా కూడా మణి విధులు నిర్వహిస్తున్నారు. కొత్త పరోక్ష పన్ను వ్యవస్థగా ఆవిర్భవిస్తున్న జీఎస్టీ ‘అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే’ 2016 ఏప్రిల్ నుంచి దేశంలో అమల్లోకి వస్తుందని అంచనా. ఈ పన్ను విధానాల కు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలను, ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేయడానికి రాష్ట్ర ఆర్థిక మంత్రులతో ఏర్పాటయ్యిందే జీఎస్టీ సాధికార కమిటీ. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో విస్తృత చర్చల తర్వాత ఈ నియామకం జరిగిందనిఆర్థిక శాఖ తెలిపింది. నేపథ్యం: జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వ కాలంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అబ్దుల్ రహీమ్ రత్తేర్ జీఎస్టీ చైర్మన్‌గా ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఎన్సీ ఓటమి నేపథ్యంలో కొత్త చైర్మన్ ఎంపిక అవసరం ఏర్పడింది. చైర్మన్ పదవికి సాధారణంగా ప్రతిపక్ష పాలక రాష్ట్ర ఆర్థికమంత్రి నియమితులవుతుంటారు. మణి కేరళకాంగ్రెస్ (ఎం)కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్థిక అంశాల్లో సైతం ఆయనకు అపార అనుభవం ఉంది. -
జీఎస్టీ కనీస పరిమితి రూ.10 లక్షలు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కనీస పరిమితిని (థ్రెషోల్డ్ లిమిట్) రూ.25 లక్షల నుంచి రూ.10 లక్షలకు తగ్గించాలని వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పట్టుబట్టారు. ఐదేళ్ల జీఎస్టీ పరిహార వ్యవస్థను రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చాలని కేంద్రాన్ని కోరారు. జీఎస్టీ అమలుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. కొత్త పన్నుల వ్యవస్థ నిర్మాణంపై తాము గత సమావేశంలో చేసిన ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా స్పందించనేలేదని కమిటీ చైర్మన్ అబ్దుల్ రహీం రాథర్ చెప్పారు. పెట్రోలియం, పొగాకు, ఆల్కహాల్ వంటి ఉత్పత్తులను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని మంత్రులు ప్రతిపాదించారు. మినహాయింపుల జాబితాను రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లు అమల్లో ఉండే పరిహార వ్యవస్థ ఉండాలనీ, దాన్ని కూడా బిల్లులో చేర్చాలనీ కోరారు. రూ.1.50 కోట్ల లోపు టర్నోవర్ ఉండే వ్యాపారాల నుంచి పన్నుల వసూలుకు పాలనాధికారాలే కాకుండా చట్టపరమైన అధికారాలు కూడా ఉండాలని డిమాండ్ చేశారు. రూ.కోటిన్నర లోపు వ్యాపారాలపై పన్ను మదింపు, ఆడిట్, ఇతర అంశాల్లో జోక్యం వద్దని కేంద్రానికి సిఫార్సు చేశారు. ద్వంద్వ నియంత్రణ విధానం ప్రకారం రూ.1.50 కోట్లకు మించిన వార్షిక టర్నోవర్ ఉండే వ్యాపారుల నుంచి పన్నులను కేంద్రం వసూలు చేస్తుంది. తర్వాత, ఆయా రాష్ట్రాలకు వాటి వాటాలను చెల్లిస్తుంది. కోటిన్నర లోపు టర్నోవర్ ఉండే కంపెనీల నుంచి ట్యాక్సులను రాష్ట్రాలు వసూలు చేసి, కేంద్రానికి దాని వాటాను చెల్లిస్తాయి. కమిటీ సిఫార్సుల ప్రకారం రూ.10 లక్షల్లోపు వార్షిక టర్నోవర్ ఉండే వ్యాపారాలపై జీఎస్టీ విధించరు. ఈ పరిమితి సాధారణ కేటగిరీ రాష్ట్రాల్లో రూ.10 లక్షలు, ప్రత్యేక కేటగిరీ, ఈశాన్య రాష్ట్రాల్లో రూ.5 లక్షలుగా ఉండాలని నిర్ణయించినట్లు రాథర్ వివరించారు. అనేక రాష్ట్రాల్లో వ్యాట్ కనీస పరిమితి రూ.10 లక్షలుగా ఉండడం గమనార్హం.