Emulsion
-
ఈ పూవుతో కేన్సర్ మందు!
ఫొటోలో ఉన్న పువ్వును మీరెప్పుడైనా చూశారా? చూసే ఉంటారులెండి. ఈ పూల నుంచి సేకరించిన ఒక రసాయనం కేన్సర్‌కు విరుగుడుగా పనిచేస్తుందని అంటున్నారు బర్మింగ్‌హామ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఫీవర్‌ఫ్యూ అని పిలిచే ఈ పువ్వును కొన్నిచోట్ల చాలాకాలంగా తలనొప్పి నివారణకు వాడుతూంటారు. కానీ పువ్వులోని పార్థీనియోలైడ్ అనే రసాయనం క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా కణాలపై ప్రభావం చూపుతున్నట్లు బర్మింగ్‌హామ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కేన్సర్ కణాల్లోని రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ (రాస్) మోతాదులను పెంచడం ద్వారా ఈ రసాయనం పనిచేస్తున్నట్లు తెలిసింది. కేన్సర్ కణాల్లో సహజంగానే ఎక్కువగా ఉండే రాస్‌ను మరింత పెంచడం ద్వారా ఈ రసాయనం కణాలను నాశనం చేస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జాన్ ఫోసే తెలిపారు. మెడ్‌కెమ్ కామ్ జర్నల్ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. మరిన్ని జంతు, మానవ ప్రయోగాలు జరిగితే పార్ఠీనియోలైడ్కున్న లక్షణాలు నిర్ధారణ అవుతాయని తద్వారా దీన్ని కేన్సర్ చికిత్సకు మరో మందుగా వాడుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. -
దోమలకు చెక్ పెట్టే బ్యాక్టీరియా..
ఎన్ని రకాల కాయిల్స్, లిక్విడ్స్ వాడినా దోమల బెడద తప్పడం లేదా? మీ సమస్యకు విస్కాన్సిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరిష్కారాన్ని కనుక్కున్నారు. మట్టిలో ఉండే ఓ బ్యాక్టీరియా అత్యంత సమర్థంగా దోమలు దూరంగా పారిపోయేలా చేయగల రసాయనాన్ని సృష్టిస్తోందని వీరు గుర్తించారు. ఈ రసాయనం డీడీటీ కంటే చాలా శక్తిమంతమైందని అంచనా. డీడీటీతో దోమల నివారణ జరుగుతున్న కొన్ని ఇతర సమస్యల కారణంగా ఈ రసాయనంపై చాలా దేశాల్లో నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సహజసిద్ధమైన ప్రత్యామ్నాయం కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీనోరాబ్డస్ బుడపెస్టెనిసిస్ అనే బ్యాక్టీరియా కీటకాలను ఎలా చంపగలుగుతోందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో బ్యాక్టీరియా విడుదల చేసే రసాయనం దోమలు దూరంగా పారిపోయేలా చేస్తున్నట్లు గుర్తించారు. బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తున్న రసాయనం డీడీటీ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ప్రభావశీలి అని కూడా ఈ పరిశోధనల ద్వారా తెలిసింది. అంతేకాకుండా... ఈ రసాయనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు దోమలు రక్తం పీల్చకుండా మాత్రమే నిరోధిస్తోందని.. ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే దోమలు పారిపోయేలా చేస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. -
బీపీఏ రసాయనంతో మధుమేహం?
మధుమేహం వచ్చేందుకు మన జీవనశైలి కారణమని కొందరంటారు.. ఊబకాయమని ఇంకొందరు.. వారసత్వమని మరికొందరు అంటూంటారు. ఇవన్నీ నిజమే. కాకపోతే యూనివర్సిటీ ఆఫ్ మిసోరీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన పుణ్యమా అని ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు చాలా క్షేమకరం అని చెప్పిన ‘బిస్ఫెనాల్ – ఏ’ (బీపీఏ) అనే రసాయనం ఇన్సులిన్ విడుదలను నియంత్రిస్తూంటుందని వీరు అంటున్నారు. ప్లాస్టిక్‌తోపాటు కొన్ని ఇతర పదార్థాల్లోనూ వాడే ఈ రసాయనం జీర్ణక్రియలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఫెడ్రిక్ వోమ్ సాల్ తెలిపారు. ఎలుకలతోపాటు, మనుషుల కాలేయ కణాలపై తాము ప్రయోగాలు చేశామని, గ్లూకోజ్ సమక్షంలో బీపీఏ రసాయనం తక్కువ స్థాయిలో ఉన్నా కూడా ఇన్సులిన్ మోతాదుల్లో తేడాలు వచ్చినట్లు గుర్తించామని వివరించారు. ఇన్సులిన్ తగ్గిపోతే.. రక్తంలోని గ్లూకోజ్ బయటకు వెళ్లిపోదు. దీర్ఘకాలంలో ఈ పరిస్థితి మధుమేహానికి దారితీస్తుందన్నది తెలిసిందే. మధుమేహం విషయంలో బీపీఏ ప్రభావంపై ఒక అధ్యయనం జరగడం ఇదే తొలిసారి అని.. మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా ఫలితాలను రూఢీ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. -
ప్యానిక్ అటాక్ వెన్నులో వణుకు.. ఒళ్లంతా భయం
చీమంత సమస్యను చూసి పామంత భయపడటం....గోరంత కష్టానికి గొడ్డలంత అనుకొని బెంబేలు పడిపోవడం...ఏదో జరిగిపోతుందనే భయం...ఏదో అయిపోతుందనే భయం... సాధారణానికి మించిఅసాధారణంగాపానిక్!భయాన్ని అర్థం చేసుకుందాం ధైర్యంగా తరిమికొడదాం... మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఎగ్జిబిషన్‌కు వెళ్లారు. అక్కడ థ్రిల్ కోసం జెయింట్‌వీల్ ఎక్కారు. బాగా పైకి వెళ్లాక మీరు ఎక్కిన చైర్ స్క్రూ కాస్త లూజ్ అయినట్లుగా మీకు అనిపించింది. ‘అమ్మో...!అకస్మాత్తుగా అది ఊడిపోయి అక్కణ్ణుంచి పడిపోతే?’ అని మీకు అనిపించింది. అప్పుడు మీకు కలిగే భావన ఏమిటి? భయమా? ఆందోళనా? అంతకు మించిన స్థాయి.భయాందోళనలతో నిండిన శూన్యస్థితి. దానినే ప్యానిక్ అటాక్ అంటారు. ప్యానిక్ అటాక్ అంటే...? తీవ్రమైన ఉద్విగ్నతకులోనైన పరిస్థితుల్లో వచ్చే ఒక రకం రుగ్మతే ప్యానిక్ అటాక్. మన సమాజంలోని 20 నుంచి 25 శాతం మందిలో ఏదో ఒక దశలో పానిక్ అటాక్‌కు లోనుకావడం మామూలే. మనం ఏదైనా అంశంపై ఆందోళన పడ్డ సమయంలో యాంగై్జటీకి గురవుతాం. అలా చూస్తే దీన్ని కూడా ఒక రకం యాంగై్జటీగానే పరిగణించవచ్చు. అయితే యాంగై్జటీకీ, ప్యానిక్ అటాక్కీ ఎంతో తేడా ఉంది. యాంగై్జటీ చాలా సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. కానీ ప్యానిక్ అటాక్ అన్నది అకస్మాత్తుగా వచ్చి కొద్ది వ్యవధిలోనే అంతులేని ఆందోళనకు గురిచేస్తుంది. ఆ సమయంలో అటాక్‌కు గురైనవారు పూర్తిగా అచేతనమైన స్థితికి వెళ్లిపోతారు. కొన్నిసార్లు గుండెపోటు వచ్చిన లక్షణాలూ ఇందులో కనిపిస్తాయి. అందుకే ప్యానిక్ అటాక్‌ను గుండెపోటుగా పరిగణించిన సందర్భాలున్నాయి. కొన్ని రకాల గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు మొదటిసారి ప్యానిక్ అటాక్ రూపంలో కనిపించవచ్చు. ప్యానిక్ అటాక్... లక్షణాలు ప్యానిక్ అటాక్ వచ్చినప్పుడు కనిపించే శారీరక లక్షణాలు ఇవి. ∙చేతులు, కాళ్లు తీవ్రంగా వణుకుతాయి ∙గుండెదడ. అయితే ఈ గుండెదడ ప్యానిక్ అటాక్ కారణంగా అకస్మాత్తుగా మొదలవుతుంది. ∙కొందరిలో ఛాతీలో నొప్పి ∙తలలో నొప్పి ∙తలంతా తేలికైపోయినట్లుగా ఉండటం (లైట్‌హెడెడ్‌నెస్) ∙వికారం (నాసియా) ∙మూత్రం అర్జెంటుగా వస్తున్నట్లుగా ఉండటం ∙అస్థిమితంగా ఉండటం ∙అకస్మాత్తుగా చలిజ్వరం వచ్చినట్లుగా అనిపించడం ∙ మత్తుగా, నిద్రవస్తున్నట్లుగా అనిపించడం (డిజ్జీనెస్), ఒళ్లంతా మొద్దుబారినట్లుగా అనిపించడం ∙ఏదో కలలో ఉన్నట్లుగా అనిపించడం ∙ ఎదుట ఉన్న దృశ్యాలనూ స్పష్టంగా చూడలేకపోవడం ∙తీవ్రమైన భయం (టెర్రర్) కారణంగా ఆ భయంకరమైన పరిస్థితి నుంచి ఎంతగా తప్పించుకోవాలనుకున్నా తప్పుకోలేనట్లుగా అనిపిస్తుండటం ∙తనకు సంభవిస్తున్న పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నందుకు లేదా వాటి నుంచి తప్పించుకోలేకపోతున్నందుకు తీవ్రమైన నిరాశగా ఉండటం ∙చనిపోతానేమోననే తీవ్రమైన ఆందోళన. ఎందుకు కలుగుతాయి ఈ ప్యానిక్ అటాక్స్ మన శరీరంలో ప్రకృతి ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏదైన ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు దానితో పోరాడు లేదా దాన్నుంచి పారిపో అనే సంకేతాలను మెదడు ఇస్తుంది. దీన్నే ‘ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్’ అంటారు. ఈ రెస్పాన్స్ కనబరచాల్సిన తీవ్ర విపత్కరమైన పరిస్థితుల్లో మన శరీరంలోకి ‘ఎపీనెఫ్రిన్’ అనే జీవరసాయనం అకస్మాత్తుగా వెలువడుతుంది. అప్పుడు అంతులేని యాంగై్జటీలో ఒక అచేతన స్థితిలో ప్యానిక్ అటాక్ కండిషన్ నెలకొంటుంది. కారణాలు: చాలా రకాల కారణాలు ప్యానిక్ అటాక్స్ వచ్చేందుకు దోహదం చేస్తాయి. మానసికమైన కారణాలతో పాటు భౌతికపరమైన జబ్బులు కూడా పానిక్ అటాక్స్‌ను కలిగిస్తాయి. ఉదాహరణకు ∙హైపర్ థైరాయిడిజమ్, హైపర్ పారా థైరాయిడిజమ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ∙ఒంట్లో చక్కెర పాళ్లు తగ్గడం (హైపోగ్లైసీమియా) నెలకొన్నప్పుడు ∙గుండెకు సంబంధించిన రుగ్మతలైన లాంగ్ క్యూటీ సిండ్రోమ్, కేటకొలమినెర్జిక్ పాలీమార్ఫిక్ వెంట్రిక్యులార్ టాకికార్డియా, వూల్ఫ్– పార్కిన్సన్– వైట్ సిండ్రోమ్ వంటి జబ్బులు ఉన్నవారికి కూడా ప్యానిక్ అటాక్స్ చాలా సాధారణం.కొందరిలో కొన్ని మందులు వాడుతున్నప్పుడు కూడా పానిక్ అటాక్స్ కనిపించవచ్చు. ఉదాహరణకు ∙డయాబెటిస్ మందులైన మెట్ఫార్మిన్, ఇన్సులిన్ వంటివి వాడేవారిలో ∙యాంటీ మలేరియా మందులు వాడే వారిలోనూ పానిక్ అటాక్స్ కనిపించవచ్చు. మరికొందరిలో ఎలాంటి భౌతిక, మానసిక, భావోద్వేగ కారణాలు లేకపోయినా అకస్మాత్తుగా యాంగై్జటీ కలిగి ప్యానిక్ అటాక్ రావచ్చు. కొందరిలో తీవ్రంగా బాధించే ఏదైనా సంఘటన తర్వాత కలిగే రుగ్మతగా (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తర్వాత) గానీ, స్కీజోఫ్రీనియా తర్వాతగానీ ఇలాంటి ప్యానిక్ అటాక్స్ కనిపించవచ్చు. మరికొందరిలో చాలా ఎక్కువగా మద్యం తీసుకున్న తర్వాత ఇవి కనిపించవచ్చు. ఇంకొందరిలో తమకు ఉన్న చెడు అలవాట్లు వదిలేస్తున్నప్పుడు విత్‌డ్రావల్ సింప్టమ్స్ ప్యానిక్ అటాక్స్ రూపంలోనూ కనిపించవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్లు: మానసికమైన కారణాలైన తీవ్రమైన ఒత్తిడి (స్ట్రెస్)తో పాటు కొన్ని రకాల మత్తుమందులు విచ్చలవిడిగా వాడటం, మాదకద్రవ్యాల తీసుకుంటుండటం, పొగతాగడం, మద్యం వంటి అంశాలు యాంగై్జటీని పెంచి ప్యానిక్ అటాక్స్కు ముప్పు (రిస్క్)ను పెంచుతాయి. ఎవరెవరిలో...? ప్యానిక్ అటాక్స్ రావడం సమాజంలోని ప్రజలందరిలోనూ కనిపించవచ్చు. అయితే ముఖ్యంగా పిల్లల్లో, టీనేజీవారిలో మరీ ముఖ్యంగా లేట్ టీన్స్‌లో ఉన్నవారు, అర్లీ అడల్ట్ దశలో ఉన్నవారిలో ఇవి ఎక్కువగా వ్యక్తమవుతుంటాయి. ఫోబియాగా మారే ప్యానిక్ అటాక్... పైన పేర్కొన్న శారీరక కారణాలతో పాటు కొన్ని మానసిక పరిస్థితులూ ప్యానిక్ అటాక్స్‌ను కలగజేస్తాయి. ఉదాహరణకు బాగా ఎత్తులకు ఎక్కినప్పుడు ప్యానిక్ అటాక్ కలిగితే... ఎత్తుల పట్ల భయం (ఫోబియా) వస్తుంది. అలాగే ఎప్పుడైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లిఫ్ట్‌లో, ఆటలాడుతున్నప్పుడు.... ఇలాంటి మరే సందర్భాల్లోనైనా ప్యానిక్ అయినప్పుడు... మనసులో దానికి సంబంధించిన ఫోబియా డెవలప్ అవుతుంది. ఇలా మనం మామూలుగా భయపడటానికి ఆస్కారం లేని సందర్భాల్లోనూ భయాలను కలిగించేలా ప్యానిక్ అటాక్స్ రావడాన్ని ఫోబియా అంటారు. ప్యానిక్ అటాక్స్‌లో రకాలు... ప్యానిక్ అటాక్స్ రెండు రకాలు. అవి... ∙ఫోబియాతో కూడిన ప్యానిక్ అటాక్. ∙ఫోబియా ఏదీ లేకుండానే కలిగే ప్యానిక్ అటాక్. ఫోబియాతో వచ్చే ప్యానిక్ అటాక్స్ ఎలా ఉంటాయంటే...? ఫోబియా అనే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సందర్భాన్ని రోగి ఎంతగా అవాయిడ్ చేద్దామన్నా చేయలేని పరిస్థితి అది. ఉదాహరణకు ఒక రోగి చాలా ఎల్తైన భవనంలోని నలభైరెండో అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడ చాలామందే ఉన్నారు. వాళ్లంతా సురక్షితంగా ఫీలవుతున్నా అంత ఎత్తు మీద రోగి తాను సురక్షితంగా లేనని భావిస్తుంటాడు. అక్కణ్ణుంచి పడిపోతానేమో అని ఆందోళన పడతాడు. నిజానికి అది పేషెంట్ అభిప్రాయమే తప్ప... అలాంటి ఆందోళనకు కారణమైన పరిస్థితులేమీ అక్కడ ఉండవు. దాంతో అతడిలో చెలరేగే తీవ్రమైన భయాందోళనలతో అక్కడ నుంచి తప్పించుకుని దూరంగా వెళ్లిపోవాలన్న ఆలోచన అతడిలో బలంగా వస్తుంది. ఈ అలోచనను ఎంతగా అవాయిడ్ చేద్దామన్నా అతడికి సాధ్యం కాదు. ఇలాంటివే రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి. ఉదాహరణకు గుంపులుగా జనం ఉన్నచోట ఉండాలన్నా, ఆరుబయల్లా అనిపించే ప్రదేశాల పట్ల, ఎల్తైన ప్రదేశాల పట్ల... ఇలా అనేక భయాలు ఉంటాయన్నమాట. ఇక ఇలాంటి పరిస్థితులేమీ లేకుండానే ఏర్పడే భయాందోళనతో కూడిన మామూలు పానిక్ అటాక్స్ కూడా చాలామందిలో వస్తుంటాయి. అంతేకాదు... ప్యానిక్ అటాక్స్ అనేవి... కొన్నిసార్లు కొంతమందిలో సోషల్ యాంగై్జటీ డిజార్డర్, ప్యానిక్ డిజార్డర్ డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలనూ తెచ్చిపెడుతుంది. ఎంత సేపు కలుగుతుందీ ప్యానిక్ అటాక్...? ప్యానిక్ అటాక్‌తో బాధపడే వ్యవధి ఒక్కొక్కొరిలో ఒకలా ఉంటుంది. కొందరిలో దాదాపు 10 నిమిషాల కంటే ఎక్కువసేపే ఈ ప్యానిక్ అటాక్ కొనసాగుతుంది. ఆ సమయంలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ కలగవచ్చు. చికిత్స ప్యానిక్ అటాక్స్కు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) బాగా ఉపయోగపడుతుంది. దీనితో పాటు బెంజోడయజపైన్స్ ఉండే మందులు కూడా మానసిక నిపుణులు ఇస్తుంటారు. ప్రస్తుతం ఎస్ఎస్ఆర్ఐ మెడికేషన్స్ వంటి కొత్త మందులు ఈ సమస్య నుంచి బయటపడటానికి బాగా పనిచేస్తాయి. మందులతో పాటు కౌన్సెలింగ్ కూడా ప్యానిక్ అటాక్స్ నుంచి కొంతవరకు ప్రయోజనాన్ని ఇస్తాయి. అధిగమించడం ఎలా? ప్యానిక్ అటాక్స్‌ను అధిగమించడం ఒకింత సులువే. తమకు ఆత్మవిశ్వాసం పెరిగేందుకు చేసే చర్యలతోనూ, మంచి జీవనశైలితో వీటిని అధిగమించవచ్చు. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం ప్యానిక్ అటాక్స్‌ను నివారిస్తుంది. రోజూ ఎక్సర్సైజ్ చేసేవారిలో ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా యాంగై్జటీ కూడా తగ్గడం వల్ల ప్యానిక్ అటాక్స్/ ఒళ్లు బిర్ర బిగుసుకుపోయే పరిస్థితి నివారితమవుతాయి. కృత్రిమ రంగులు, అడెటివ్స్ కలిపిన ఆహారాలు తీసుకునే వారు తేలిగ్గా ప్యానిక్ అటాక్స్కు గురవుతారు. అలా కాకుండా స్వాభావికమైన సమతులాహారం తీసుకునేవారిలో ప్యానిక్ అటాక్స్ తక్కువ. పొగతాగే అలవాటు, మద్యం, కెఫిన్ వంటివి ప్యానిక్ అటాక్స్‌ను ప్రేరేపిస్తాయి కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండటం అవసరం. ఒత్తిడిని తగ్గించే మార్గాలైన యోగా, ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్, కండరాలను హాయిగా ఉంచే మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటివి అన్నీ ప్యానిక్ అటాక్స్‌ను తగ్గిస్తాయి. డాక్టర్ ఐ. భరత్ కుమార్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్ -
ఒక్క మందుతో మారే కేన్సర్ కణాలు!
కేన్సర్ కణాల ప్రత్యేకత ఏమిటి? అడ్డుఅదుపు లేకుండా విభజితమవుతూ పోవడం. ఈ విచ్చలవిడి విభజనకు అడ్డు కట్ట వేస్తే..? కేన్సర్ ముదరదు. మరి.. ఒక్క మందు వేసి కేన్సర్ కణాలన్నింటినీ సాధారణ కణాలుగా మార్చేస్తే...? రోగమన్నది ఉండదు! ఓ వినూత్నమైన రసాయనంతో తాము అచ్చంగా ఇదే సాధించామంటున్నారు బీజీఎన్ టెక్నాలజీస్ శాస్త్రవేత్తలు! ఇప్పటికైతే ఈ పరిశోధన ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటికీ ఆ రసాయనం తాలూకు లక్షణాలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ సోశన్ బర్మాటాజ్ అంటున్నారు. మన డీఎన్ఏలో ఉండే రెండు పోగుల్లో ఒకదాన్ని వేరు చేస్తే వచ్చే ఆర్ఎన్ఏ ఆధారంగా ఈ చికిత్స జరుగుతుంది. కణాల్లోని మైటోకాండ్రియాను రక్షించే ప్రొటీన్ వీడీఏసీ1 పనితీరును ఈ సై ఆర్ఎన్ఏ ప్రభావితం చేస్తుందని, కణుతులతో కూడిన, కణుతులు లేని కేన్సర్లలో ఈ ప్రొటీన్ చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని ప్రొఫెసర్ సోశన్ తెలిపారు. కేన్సర్ కణాలకు అవసరమైన ఎక్కువ శక్తిని ఈ ప్రొటీన్ అందిస్తుందని వివరించారు. వీడీఏసీ1 ప్రొటీన్ ఉత్పత్తిని నిలిపివేయడంతో కేన్సర్ కణాల పెరుగుదల కూడా ఆగిపోయిందని, అదే సమయంలో ఇతర కణాలకు ఎలాంటి హానీ జరగలేదు. గ్లియోబాస్టోమా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఎలుకల్లో ఈ పద్ధతి బాగా పనిచేసినట్లు సోశాన్ తెలిపారు. ఈ క్రమంలో కేన్సర్ కణాలు తమ లక్షణాలను కోల్పోయి సాధారణ కణాలుగా మారినట్లు గుర్తించామని వివరించారు. -
టచ్ రచ్చ
కవర్ చెయ్యాల్సిన బట్టలే కేక పెట్టిస్తే? అందం తెచ్చేవే.. అల్లాడిస్తే?! ఇక ఏం వేసుకుంటాం? ఏం పూసుకుంటాం? అన్నీ స్కిన్‌కి ప్రాబ్లమే. ఎలర్జీ... అమ్మో... టచ్ చేస్తే రచ్చ చేసే స్కిన్ ఎలర్జీలు ఇవి! మనం రోజూ వాడే వస్తువులే కొందరికి ఏ మాత్రం సరిపడకుండా చర్మానికి చేటు తెస్తుంటాయి. మనకు సరిపడని వస్తువు తెచ్చే అనర్థాన్ని అలర్జీలుగా పేర్కొంటాం. తినడం ద్వారా వచ్చే అలర్జీలను పక్కన పెడితే... ఇక్కడ చెప్పుకునేవన్నీ చర్మాన్ని ఏదో అంటుకోవడం వల్ల వచ్చే అలర్జీలు. ఇలా వచ్చే సమస్యను ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ అంటారు. వీటిలో కొన్ని చిత్ర విచిత్రంగా అనిపిస్తాయి. ఆందోళన కలిగిస్తాయి. అలాంటి కొన్ని అలర్జీల గురించి తెలుసుకొంటే, వాటితో బాధపడేవారు, దాన్ని పెద్ద సమస్యగా పరిగణించకుండా... అవగాహన పెంచుకొని, తగిన చికిత్స తీసుకోవడానికి ఉపయోగపడేదే ఈ కథనం. రకరకాల డర్మటైటిస్లు (చర్మ అలర్జీలు) సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్స్‌తో కొందరిలో సబ్బులు, షాంపూలు, డిటర్జెంట్స్‌లో ఉండే రసాయనాల కారణంగా అలర్జీలు వస్తుంటాయి.గాజులు, గొలుసులు, ఆభరణాలతో : తయారైన పదార్థాన్ని బట్టి కొందరు మహిళలకు గాజులు కూడా సరిపడవు. అవి అంటి ఉండే ప్రాంతం సాధారణంగా మణికట్టు. కానీ అది గాజు కావడంతో... మణికట్టు నుంచి ముంజేతి వరకూ కదులుతూ ఉండటం వల్ల ఆ మొత్తం ప్రాంతం ప్రభావితమవుతుంది. అలాగే మెడలో వేసుకొనే గొలుసులు, చైన్లు, నెక్లేస్లతోనూ ఇదే ప్రభావం ఉంటుంది. కొందరిలో ఇయర్ రింగ్స్‌కు ఉపయోగించే లోహం కారణంగానో డర్మటైటిస్ వస్తుంటుంది. వృత్తులతో : మన వృత్తుల్లో ఉపయోగించే రకరకాల పదార్థాలతో అలర్జీలతో తమ జీవనోపాధి సైతం ప్రభావితమయ్యేలా సమస్య రావచ్చు. ఉదాహరణకు సిమెంట్, పెయింట్స్ వంటి వాటిలో ఉండే రసాయనాలతో ఒంటికి అలర్జీ ఏర్పడితే ఆ వ్యక్తి ఆరోగ్య జీవితమే గాక... కుటుంబ సభ్యుల ఆర్థిక జీవనమూ ప్రభావితమవుతుంది. అలాగే కొందరికి ఫొటోగ్రాఫిక్ రసాయాలు, వారి వృత్తిలో భాగంగా ఉపయోగించే పదార్థాలతోనూ రావచ్చు. ఇక లోహాలతో నికెల్‌తో చేసిన ఉత్పాదనలు హెయిర్డ్రస్సింగ్, నర్సింగ్, కేటరింగ్, నికెల్ ప్లేటింగ్, వస్త్ర పరిశ్రమలో ఎక్కువ. కాబట్టి ఈ లోహపు ఉత్పాదనలతో వ్యవహరించే వృత్తుల్లో ఉన్నవారికి ‘నికెల్ డర్మటైటిస్’ ఎక్కువ. రైతులకు : కొందరు రైతులకు తాము ఉపయోగించే ఎరువులు, పురుగుమందులలోని రసాయనాలతో అలర్జీలు వస్తే అది కూడా వారి జీవితాన్ని దుర్భరం చేస్తుంది. సౌందర్య సాధనాలతో : ఇది చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. కొందరికి బొట్టుబిళ్లలతో అలర్జీ రావడం కనిపిస్తుంది. దీనికి కారణం బొట్టు బిళ్ల వెనక అంటించేందుకు ఉపయోగించే గమ్‌లోని రసాయనం సరిపడకపోవచ్చు. చాలామందిలో హెయిర్‌డై సరిపడదు. దానిలో ఉండే పారాఫినైల్యెనిడయామైన్ వంటి రసాయనాలు అటు వాసన పరంగానూ, ఇటు తమ స్వభావపరంగానూ చాలా ఘాటుగా ఉండటమే కారణం. కొందరిలో షేవింగ్ క్రీమ్స్, షేవింగ్ లోషన్స్లోని రసాయనాల వల్ల చెంపలు, గదమ (చుబుకం) దెబ్బతింటాయి. సౌందర్యసాధానాలలోని రెసార్సిన్, బాల్సమ్ ఆఫ్ పెరూ, పర్ఫ్యూమ్స్లో వాడే రసాయనాలు, వాటిలో స్వల్పంగా ఉండిపోయే తారు వంటి పెట్రోలియమ్ వ్యర్థాలతో అలర్జీ కలిగి కాంటాక్ట్ డర్మటైటిస్ వస్తుంటుంది. కంటి సౌందర్యసాధనాలతో : కొందరికి ఐ–షాడోస్, మస్కారా వంటి వాటితో అలర్జీలు వస్తాయి. ఇక కంటికి ఉపయోగించే మందులైన నియోమైసిన్, క్లోరాంఫెనికాల్, సల్ఫోనమైడ్స్తో పాటు అవి దీర్ఘకాలం నిల్వ ఉంచడానికి ఉపయోగించే పారాబెన్స్ వంటి సరాయనాలు కనురెప్పకు అలర్జీ కలిగించి ‘ఐలిడ్ డర్మటైటిస్’కు దారితీయవచ్చు. ఉల్లి, వెల్లుల్లి, వంటింటి దినుసులతో : వెల్లుల్లి రెబ్బలు ఒలుస్తుండటం, ఉల్లి తగలడం వంటివి జరిగినప్పుడు కూడా అలర్జీలు వస్తుంటాయి. ముఖ్యంగా వెల్లుల్లి ఒలిచే వారిలో గోరు మూలం లేదా వేలికీ, గోటికీ మధ్యనున్న చర్మం త్వరగా ప్రభావితమై మంట రావడం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. వెల్లుల్లి లేదా ఉల్లిలోని అలిసిన్ అనే రసాయనం సరిపడకపోవడమే ఇందుకు కారణం. కొన్ని కూరగాయలు కోస్తున్నప్పుడు లేదా వాటిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు సరిపడకపోవడంతో వచ్చే అలర్జీలను అందరికీ తెలిసే సాధారణ పరిభాషలో ‘వెజిటబుల్ డర్మటైటిస్’ అంటారు. లక్షణాలు ఎగ్జిమాగా పేర్కొనే అలర్జీలు దురదతో కనిపిస్తాయి. కొన్ని అలర్జీతో ప్రభావితమైన ప్రాంతం నుంచి నీళ్లలా స్రవిస్తుండటం, ఆకృతిలో చర్మం పగుళ్లు బారడం, పొట్టు రాలుతున్నట్లుగా ఉండటం, గాయం విస్తరిస్తుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక దీర్ఘకాలికంగా ఉండే అలర్జీలలో అర్టికేరియా (చర్మంపై ర్యాష్‌లా) వస్తుంది. ఆ ప్రాంతంలో చర్మం రంగు కూడా మారవచ్చు. ఇవన్నీ అలర్జిక్ రియాక్షన్ తీవ్రతను బట్టి ఉంటాయి. కాంటాక్ట్ డర్మటైటిస్లోని లక్షణాలు అన్నీ ఒకేలా ఉండవు. తీవ్రతను బట్టి, అలర్జీ కలిగించే పదార్థాన్ని బట్టి వేర్వేరుగా ఉంటాయి. ప్రభావితమైన చర్మం ప్రాంతంలో కొందరికి ఏదో కుట్టిన ఫీలింగ్ ఉంటుంది. మరికొందరికి దురద, తరచూ నొప్పి ఉంటాయి. ఇక చర్మంపై ఏర్పడే మచ్చలు ఎర్రబారడం మొదలుకొని చిన్న పగుళ్లు, గుల్లలు, దద్దుర్లు, తీవ్రమైన గాయాల్లా కనిపించే పగుళ్ల వరకు కనిపిస్తాయి. మరికొందరిలో చర్మం కాలినట్లుగా కావచ్చు. నివారణ మనకు ఏదైనా అలర్జిక్ రియాక్షన్ కనిపించగానే దానికి నిర్దిష్టంగా ఫలానా వస్తువు వల్లనే అనే నిర్ధారణకు వచ్చేయడం సరికాదు. చాలా సునిశితంగా కారణాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. సమస్యకు అసలు కారణాన్ని తెలుసుకోవడం కోసం రోగి ఇంటి దగ్గర ఉపయోగించే వస్తువుల జాబితాను డాక్టర్లు పరిశీలించాల్సి ఉంటుంది. అలర్జీకి గురైన వ్యక్తి పనిచేసే చోట ఉన్న వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఉపయోగించే సౌందర్యసాధనాలు, రెజిన్ ఉత్పాదనల గురించి ఆరాతీయాల్సి ఉంటుంది. కొన్ని సూచనలు... మనకు ఏ పదార్థంతో అలర్జీ వస్తుందో దాని నుంచి దూరంగా ఉండటం అన్నిటికంటే ఉత్తమమైన ప్రక్రియ. ఉదాహరణకు డిటర్జెంట్స్‌తో అలర్జీ ఉన్నప్పుడు చేతులు కేవలం నీళ్లతో మాత్రమే శుభ్రంగా కడుక్కోవాలి. ఒకవేళ దాని అవసరం ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలతో దాన్ని వాడాలి. ఉదాహరణకు హెయిర్–డై తో చేతులకు అలర్జీ వస్తుంటే మంచి గ్లౌస్ ధరించి దాన్ని వాడుకోవాలి. ఇలా అవసరాన్ని బట్టి మనం తగిన మెళకువలను అనుసరిస్తూ ఈ సమస్యను అధిగమించాలి. సమస్య వచ్చిన చోట తక్కువ మోతాదులో లేదా ఓ మోస్తరు మోతాదులో (మైల్డ్–మాడరేట్) కార్టికోస్టెరాయిడ్ ఉన్న మోమ్యాటోసోన్ ఫ్యూరోయేట్ వంటి క్రీమ్స్ రాస్తుండాలి. అయితే దీని మోతాదును కేవలం చర్మవైద్య నిపుణుల సిఫార్సు మేరకే వాడాలి. చేతులకు డర్మటైటిస్ వచ్చినప్పుడు నాన్–పర్ఫ్యూమ్ హ్యాండ్ క్రీమ్ వాడవచ్చు. చేతులను శుభ్రపరచడానికి చర్మాన్ని పొడిబార్చని మైల్డ్ సోప్ వాడటం మేలు. తీవ్రమైన, శక్తిమంతమైన డిటర్జెంట్లు వాడటం మానేస్తే మంచిది. మనకు సరిపడని వస్తువులతో పనిచేయాల్సి వచ్చినప్పుడు డబుల్ గ్లౌజ్ వేసుకోవడం ఒక మంచి నివారణ ప్రక్రియ. షాంపూ, హెయిర్ డై వంటివి ఉపయోగించే సమయంలోనూ డబుల్ గ్లౌజ్ వాడటం మంచిదే. హెయిర్ ఆయిల్స్, స్టైలింగ్ జెల్స్ వంటివి రాసుకునేప్పుడు నేరుగా ఉత్తిచేతులతోనే రాసుకోవడం అంత సరికాదు. బత్తాయిలు, నారింజపండ్లు ఒలుస్తున్నప్పుడు, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటి పొట్టు తీసుకున్నప్పుడు అది మనకు సరిపడకపోతే చాలాసేపు ఆ పనిని చేయడం సరికాదు. చికిత్స లక్షణాలను, వాటి తీవ్రతను బట్టి దాన్ని తగ్గించే చికిత్స అందించాల్సి ఉంటుంది. స్థూలంగా అలర్జీ వస్తువుల నుంచి దూరంగా ఉండటం, స్టెరాయిడ్స్, లక్షణాలను బట్టి చికిత్స అనే మూడు అంశాల మీదే ఈ సమస్యకు చికిత్స ఉంటుంది. తక్షణం కనిపించే డర్మటైటిస్లకు క్రీములు, దీర్ఘకాలిక సమస్యలకు ఆయింట్మెంట్స్ ఉపయోగించాల్సి రావచ్చు. మందుల ఎంపిక ప్రక్రియలో అలర్జీ ఏ మేరకు వచ్చిందన్న అంశంతో పాటు, ఏ ప్రదేశంలో వచ్చింది, తీవ్రత ఎంత అన్నది కూడా పరిగణనలోకి తీసుకుంటారు. తీవ్రతను బట్టి కొన్నిసార్లు ఒకింత ఆధునిక చికిత్సలైన పూవా, గ్రెంజ్ రేస్, ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్, కొన్ని సందర్భాల్లో యాంటీబయాటిక్స్‌ను కూడా డాక్టర్లు వాడుతుంటారు. డాక్టర్ స్వప్న ప్రియ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ మెటల్ అలర్జీలు బటన్స్, నాణేలు, బకిల్స్ వంటి వాటితో : మన జేబులో ఉండే చిల్లర నాణేలతో కూడా కొందరికి అలర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరికి ప్యాంట్ బటన్ / బెల్ట్ బకిల్‌లో ఉండే నికెల్ లోహం తాకి ఉండే పొట్ట భాగంలోనూ అలర్జీ రావచ్చు. అది బటన్ / బెల్ట్బకిల్ ఒరుసుకుపోవడం వల్ల వచ్చే సమస్యగా భావిస్తారు. కానీ సాధారణంగా నాణేలు లేదా బటన్స్ లేదా బకిల్‌లో ఉండే నికెల్ లోహం వల్ల ఆ అలర్జీ వస్తుంది. ఈ లోహం ఉండే రిస్ట్‌వాచీలు, కళ్లజోళ్ల ఫ్రేమ్లతోనూ అవి తగిలే ప్రాంతంలో డర్మటైటిస్ వచ్చే అవకాశం ఉంది. మిగతా అన్ని లోహాలతో పోలిస్తే కాంటాక్ట్ డర్మటైటిస్‌ను ప్రేరేపించే శక్తి నికెల్ లోహానికి చాలా ఎక్కువ. మహిళలు చెవి కమ్మలు, చెవి దుద్దులు, ఇతర ఇయర్ రింగ్స్ ధరిస్తారు కాబట్టి పురుషులతో పోలిస్తే ‘నికెల్ డర్మటైటిస్’ ప్రమాదం వారికే ఎక్కువ. క్రోమియం లోహంతో : మన భూమి ఉపరితలం (క్రస్ట్)లో అత్యధికంగా లభ్యమయ్యే లోహాలలో అత్యంత ముఖ్యమైనది క్రోమియం. సాధారణంగా ఏదైనా సరిపడకపోవడం వల్ల కనిపించే డర్మటైటిస్లలో ‘క్రోమియం సెన్సిటివిటీ’ కేసులు ప్రపంచవ్యాప్తంగా 6 శాతం ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మనం వాడే డిటర్జెంట్స్, బ్లీచింగ్ ఏజెంట్లు, షేవింగ్ క్రీములు, షేవింగ్ లోషన్లలో క్రోమియం ఎక్కువ. కొన్ని చర్మపు ఉత్పాదనల (ముఖ్యంగా షూస్) ప్రాసెసింగ్‌లో దీన్ని వాడతారు. అలాగే పసుపుపచ్చ, నారింజ రంగులో ఉండే ఇంటి పెయింట్స్‌లో, ప్రింటింగ్ పరిశ్రమలో, ఫొటోగ్రఫీలో, ఏదైనా లోహం తుప్పు పట్టకుండా వాడేందుకు ఉపయోగించే పూతల్లో (యాంటీ రస్టింగ్ ఏజెంట్స్)లో క్రోమియం ఎక్కువ. పై ఉత్పాదనలను వాడే వారు తమకు ఏదైనా సమస్య వస్తే అది క్రోమియంతో కావచ్చని భావించి జాగ్రత్తగా ఉండాలి. కోబాల్ట్ లోహంతో : దీన్ని సాధారణంగా నికెల్‌తో కలిపి తయారు చేసే చాలా ఉత్పాదనల్లో ఉపయోగిస్తారు. లోహాలన్నింటిలో నికెల్ చాలా ఎక్కువగా అలర్జీలను కలగజేస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే నికెల్‌తో పాటు కోబాల్ట్ కలిసే ఉత్పాదనలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోబాల్ట్ కారణంగా హెయిర్ డైలు ఉపయోగించేవారిలో, చాలా కఠినమైన లోహాలతో తయారయ్యే డ్రిల్లింగ్ టూల్స్ ఉపయోగించేవారిలో, సెరామిక్ పరిశ్రమలోని వారిలో, గ్లాస్, మెటల్ అల్లాయ్స్, పింగాణీ వంటి పాత్రల తయారీ రంగాలలో ఉన్నవారికి అలర్జీలు వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువ. అల్యూమినియంతో : ఈ లోహం చాలావరకు సురక్షితం. అయితే కొన్ని సందర్భాల్లో అల్యూమినియం ఉన్న కొన్ని పూత మందులు వాడినప్పుడు చాలా అరుదుగా డర్మటైటిస్ రావచ్చు. పాదరసంతో : ఇది జింక్, తగరం, వంటి లోహాలతో ఎక్కువగా కలుస్తుంది. ఆ ఉత్పాదనలను పంటికి వేసే సిమెంట్ తయారీలో ఉపయోగిస్తారు. అది కొందరికి అలర్జీక్ రియాక్షన్‌ను కలిగించవచ్చు. బంగారంతో : ఈ లోహం చాలా మందికి ప్రియమైనది. దాదాపు ఆభరణాల్లో చాలావరకు దీనితోనే తయారవుతాయి. దీనితో వచ్చే అలర్జిక్ రియాక్షన్ చాలా అరుదే అయినా... కొందరిలో బంగారం కూడా అలర్జీక్ రియాక్షన్‌ను కలిగించవచ్చు. ఆభరణాలతో పాటు దీన్ని పంటిపైన వాడే తొడుగులు (క్రౌన్స్), డెంటల్ ఫిల్లింగులు, దంత చికిత్సలో వాడే చాలా వస్తువుల్లో కూడా బంగారాన్ని వాడుతుంటారు. వాటి వల్ల కొందరిలో అలర్జిక్ రియాక్షన్ కనిపిస్తుండవచ్చు. ఇక్కడ పైర్కొన్న లోహాలతో పాటు ప్లాటినమ్, జింక్, రాగి వంటి వాటితోనూ కొన్ని సందర్భాల్లో అలర్జీలు కనిపిస్తాయి. రబ్బర్ డర్మటైటిస్ : మనం వాడే చాలా ఉత్పాదనల్లో రబ్బర్ ఉంటుంది. చేతి తొడుగులు (గ్లౌవ్స్), షూస్, మాస్కులు, స్లిప్పర్లు ఇంకా ఎన్నెన్నో రబ్బర్‌తో తయారవుతాయి. రబ్బర్‌తో అలర్జీ ఉన్నప్పుడు సాధారణంగా చర్మం ఎర్రబారడం మొదలుకొని చిన్న చిన్న గుల్లలు, దద్దుర్లు, ర్యాష్ మొదలుకొని తీవ్రంగా పగుళ్ల వరకు ఈ అలర్జిక్ రియాక్షన్ తీవ్రత ఉంటుంది. రబ్బర్‌తో వచ్చే రియాక్షన్లో చేతులు లేదా కాళ్లు నల్లబారడం లేదా రంగుమారడం వంటి లక్షణాన్ని గమనించనప్పుడు అది వచ్చిన ప్రాంతాన్ని బట్టి దాన్ని ‘బ్లాక్ రబ్బర్ హ్యాండ్ / ఫీట్’ అని వ్యవహరిస్తారు.