ప్యానిక్‌ అటాక్‌ వెన్నులో వణుకు.. ఒళ్లంతా భయం | Panic Attack means ? | Sakshi
Sakshi News home page

ప్యానిక్‌ అటాక్‌ వెన్నులో వణుకు.. ఒళ్లంతా భయం

Published Thu, Jul 5 2018 12:25 AM | Last Updated on Thu, Jul 5 2018 12:25 AM

Panic Attack means ? - Sakshi

చీమంత సమస్యను చూసి పామంత భయపడటం....గోరంత కష్టానికి గొడ్డలంత అనుకొని బెంబేలు పడిపోవడం...ఏదో జరిగిపోతుందనే భయం...ఏదో అయిపోతుందనే భయం... సాధారణానికి మించిఅసాధారణంగాపానిక్‌!భయాన్ని అర్థం చేసుకుందాం ధైర్యంగా తరిమికొడదాం...

మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఎగ్జిబిషన్‌కు వెళ్లారు. అక్కడ థ్రిల్‌ కోసం జెయింట్‌వీల్‌ ఎక్కారు. బాగా పైకి వెళ్లాక మీరు ఎక్కిన చైర్‌ స్క్రూ కాస్త లూజ్‌ అయినట్లుగా మీకు అనిపించింది. ‘అమ్మో...!అకస్మాత్తుగా అది ఊడిపోయి అక్కణ్ణుంచి పడిపోతే?’ అని మీకు అనిపించింది. అప్పుడు మీకు కలిగే భావన ఏమిటి? భయమా? ఆందోళనా? అంతకు మించిన స్థాయి.భయాందోళనలతో నిండిన శూన్యస్థితి. దానినే ప్యానిక్‌ అటాక్‌ అంటారు. 

ప్యానిక్‌ అటాక్‌ అంటే...? 
తీవ్రమైన ఉద్విగ్నతకులోనైన పరిస్థితుల్లో వచ్చే ఒక రకం రుగ్మతే ప్యానిక్‌ అటాక్‌. మన సమాజంలోని 20 నుంచి 25 శాతం మందిలో ఏదో ఒక దశలో పానిక్‌ అటాక్‌కు లోనుకావడం మామూలే. మనం ఏదైనా అంశంపై ఆందోళన పడ్డ సమయంలో యాంగై్జటీకి గురవుతాం. అలా చూస్తే దీన్ని కూడా ఒక రకం యాంగై్జటీగానే పరిగణించవచ్చు. అయితే యాంగై్జటీకీ, ప్యానిక్‌ అటాక్‌కీ ఎంతో తేడా ఉంది. యాంగై్జటీ చాలా సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. కానీ ప్యానిక్‌ అటాక్‌ అన్నది అకస్మాత్తుగా వచ్చి కొద్ది వ్యవధిలోనే అంతులేని ఆందోళనకు గురిచేస్తుంది. ఆ సమయంలో అటాక్‌కు గురైనవారు పూర్తిగా అచేతనమైన స్థితికి వెళ్లిపోతారు. కొన్నిసార్లు గుండెపోటు వచ్చిన లక్షణాలూ ఇందులో కనిపిస్తాయి.  అందుకే ప్యానిక్‌ అటాక్‌ను గుండెపోటుగా పరిగణించిన సందర్భాలున్నాయి. కొన్ని రకాల గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు మొదటిసారి ప్యానిక్‌ అటాక్‌ రూపంలో కనిపించవచ్చు. 

ప్యానిక్‌ అటాక్‌... లక్షణాలు
ప్యానిక్‌ అటాక్‌ వచ్చినప్పుడు కనిపించే శారీరక లక్షణాలు ఇవి. ∙చేతులు, కాళ్లు  తీవ్రంగా వణుకుతాయి ∙గుండెదడ. అయితే ఈ గుండెదడ ప్యానిక్‌ అటాక్‌ కారణంగా అకస్మాత్తుగా మొదలవుతుంది. ∙కొందరిలో ఛాతీలో నొప్పి ∙తలలో నొప్పి ∙తలంతా తేలికైపోయినట్లుగా ఉండటం (లైట్‌హెడెడ్‌నెస్‌) ∙వికారం (నాసియా) ∙మూత్రం అర్జెంటుగా వస్తున్నట్లుగా ఉండటం ∙అస్థిమితంగా ఉండటం  ∙అకస్మాత్తుగా చలిజ్వరం వచ్చినట్లుగా అనిపించడం ∙ మత్తుగా, నిద్రవస్తున్నట్లుగా అనిపించడం (డిజ్జీనెస్‌), ఒళ్లంతా మొద్దుబారినట్లుగా  అనిపించడం ∙ఏదో కలలో ఉన్నట్లుగా అనిపించడం ∙ ఎదుట ఉన్న దృశ్యాలనూ స్పష్టంగా చూడలేకపోవడం ∙తీవ్రమైన భయం (టెర్రర్‌) కారణంగా ఆ భయంకరమైన పరిస్థితి నుంచి ఎంతగా తప్పించుకోవాలనుకున్నా తప్పుకోలేనట్లుగా అనిపిస్తుండటం ∙తనకు సంభవిస్తున్న  పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నందుకు లేదా వాటి నుంచి తప్పించుకోలేకపోతున్నందుకు తీవ్రమైన నిరాశగా ఉండటం ∙చనిపోతానేమోననే తీవ్రమైన ఆందోళన. 

ఎందుకు కలుగుతాయి ఈ ప్యానిక్‌ అటాక్స్‌
మన శరీరంలో ప్రకృతి ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏదైన ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు దానితో పోరాడు లేదా దాన్నుంచి పారిపో అనే సంకేతాలను మెదడు ఇస్తుంది. దీన్నే ‘ఫైట్‌ ఫ్లైట్‌ రెస్పాన్స్‌’ అంటారు. ఈ రెస్పాన్స్‌ కనబరచాల్సిన తీవ్ర విపత్కరమైన పరిస్థితుల్లో మన శరీరంలోకి ‘ఎపీనెఫ్రిన్‌’ అనే జీవరసాయనం అకస్మాత్తుగా వెలువడుతుంది. అప్పుడు అంతులేని యాంగై్జటీలో ఒక అచేతన స్థితిలో ప్యానిక్‌ అటాక్‌ కండిషన్‌ నెలకొంటుంది. 

కారణాలు: చాలా రకాల కారణాలు ప్యానిక్‌ అటాక్స్‌ వచ్చేందుకు దోహదం చేస్తాయి. మానసికమైన కారణాలతో పాటు భౌతికపరమైన జబ్బులు కూడా పానిక్‌ అటాక్స్‌ను కలిగిస్తాయి. ఉదాహరణకు ∙హైపర్‌ థైరాయిడిజమ్, హైపర్‌ పారా థైరాయిడిజమ్‌ వంటి సమస్యలు ఉన్నప్పుడు ∙ఒంట్లో చక్కెర పాళ్లు తగ్గడం (హైపోగ్లైసీమియా) నెలకొన్నప్పుడు ∙గుండెకు సంబంధించిన రుగ్మతలైన లాంగ్‌ క్యూటీ సిండ్రోమ్, కేటకొలమినెర్జిక్‌ పాలీమార్ఫిక్‌ వెంట్రిక్యులార్‌ టాకికార్డియా, వూల్ఫ్‌– పార్కిన్‌సన్‌– వైట్‌ సిండ్రోమ్‌ వంటి జబ్బులు ఉన్నవారికి కూడా ప్యానిక్‌ అటాక్స్‌ చాలా సాధారణం.కొందరిలో కొన్ని మందులు వాడుతున్నప్పుడు కూడా పానిక్‌ అటాక్స్‌ కనిపించవచ్చు. ఉదాహరణకు ∙డయాబెటిస్‌ మందులైన మెట్‌ఫార్మిన్, ఇన్సులిన్‌ వంటివి వాడేవారిలో ∙యాంటీ మలేరియా మందులు వాడే వారిలోనూ పానిక్‌ అటాక్స్‌ కనిపించవచ్చు. 

మరికొందరిలో ఎలాంటి భౌతిక, మానసిక, భావోద్వేగ కారణాలు లేకపోయినా అకస్మాత్తుగా యాంగై్జటీ కలిగి ప్యానిక్‌ అటాక్‌ రావచ్చు. కొందరిలో తీవ్రంగా బాధించే ఏదైనా సంఘటన తర్వాత కలిగే రుగ్మతగా (పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ తర్వాత) గానీ, స్కీజోఫ్రీనియా తర్వాతగానీ ఇలాంటి ప్యానిక్‌ అటాక్స్‌ కనిపించవచ్చు. మరికొందరిలో చాలా ఎక్కువగా మద్యం తీసుకున్న తర్వాత ఇవి కనిపించవచ్చు. ఇంకొందరిలో తమకు ఉన్న చెడు అలవాట్లు వదిలేస్తున్నప్పుడు విత్‌డ్రావల్‌ సింప్టమ్స్‌ ప్యానిక్‌ అటాక్స్‌ రూపంలోనూ కనిపించవచ్చు.  

రిస్క్‌ ఫ్యాక్టర్లు: మానసికమైన కారణాలైన తీవ్రమైన ఒత్తిడి (స్ట్రెస్‌)తో పాటు కొన్ని రకాల మత్తుమందులు విచ్చలవిడిగా వాడటం, మాదకద్రవ్యాల తీసుకుంటుండటం, పొగతాగడం, మద్యం వంటి అంశాలు యాంగై్జటీని పెంచి ప్యానిక్‌ అటాక్స్‌కు ముప్పు (రిస్క్‌)ను పెంచుతాయి. 

ఎవరెవరిలో...? 
ప్యానిక్‌ అటాక్స్‌ రావడం సమాజంలోని ప్రజలందరిలోనూ కనిపించవచ్చు. అయితే ముఖ్యంగా పిల్లల్లో, టీనేజీవారిలో మరీ ముఖ్యంగా లేట్‌ టీన్స్‌లో ఉన్నవారు, అర్లీ అడల్ట్‌ దశలో ఉన్నవారిలో ఇవి ఎక్కువగా వ్యక్తమవుతుంటాయి. 

ఫోబియాగా మారే  ప్యానిక్‌ అటాక్‌... 
పైన పేర్కొన్న శారీరక కారణాలతో పాటు కొన్ని మానసిక పరిస్థితులూ ప్యానిక్‌ అటాక్స్‌ను కలగజేస్తాయి. ఉదాహరణకు బాగా ఎత్తులకు ఎక్కినప్పుడు ప్యానిక్‌ అటాక్‌ కలిగితే... ఎత్తుల పట్ల భయం (ఫోబియా) వస్తుంది. అలాగే ఎప్పుడైనా డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు లిఫ్ట్‌లో, ఆటలాడుతున్నప్పుడు.... ఇలాంటి మరే సందర్భాల్లోనైనా ప్యానిక్‌ అయినప్పుడు... మనసులో దానికి సంబంధించిన ఫోబియా డెవలప్‌ అవుతుంది. ఇలా మనం మామూలుగా భయపడటానికి ఆస్కారం లేని సందర్భాల్లోనూ భయాలను కలిగించేలా ప్యానిక్‌ అటాక్స్‌ రావడాన్ని ఫోబియా అంటారు. 

ప్యానిక్‌ అటాక్స్‌లో రకాలు... 
ప్యానిక్‌ అటాక్స్‌ రెండు రకాలు. అవి... 
∙ఫోబియాతో కూడిన ప్యానిక్‌ అటాక్‌. 
∙ఫోబియా ఏదీ లేకుండానే కలిగే ప్యానిక్‌ అటాక్‌. 

ఫోబియాతో వచ్చే ప్యానిక్‌ అటాక్స్‌ ఎలా ఉంటాయంటే...? 
ఫోబియా అనే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సందర్భాన్ని రోగి ఎంతగా అవాయిడ్‌ చేద్దామన్నా చేయలేని పరిస్థితి అది. ఉదాహరణకు ఒక రోగి చాలా ఎల్తైన భవనంలోని నలభైరెండో అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడ చాలామందే ఉన్నారు. వాళ్లంతా సురక్షితంగా ఫీలవుతున్నా అంత ఎత్తు మీద రోగి తాను సురక్షితంగా లేనని భావిస్తుంటాడు. అక్కణ్ణుంచి పడిపోతానేమో అని ఆందోళన పడతాడు. నిజానికి అది పేషెంట్‌ అభిప్రాయమే తప్ప... అలాంటి ఆందోళనకు కారణమైన పరిస్థితులేమీ అక్కడ ఉండవు. దాంతో అతడిలో చెలరేగే తీవ్రమైన భయాందోళనలతో అక్కడ నుంచి తప్పించుకుని దూరంగా వెళ్లిపోవాలన్న ఆలోచన అతడిలో బలంగా వస్తుంది. ఈ అలోచనను ఎంతగా అవాయిడ్‌ చేద్దామన్నా అతడికి సాధ్యం కాదు. ఇలాంటివే రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి. ఉదాహరణకు గుంపులుగా జనం ఉన్నచోట ఉండాలన్నా, ఆరుబయల్లా అనిపించే ప్రదేశాల పట్ల, ఎల్తైన ప్రదేశాల పట్ల... ఇలా అనేక భయాలు ఉంటాయన్నమాట. ఇక ఇలాంటి పరిస్థితులేమీ లేకుండానే ఏర్పడే భయాందోళనతో కూడిన మామూలు పానిక్‌ అటాక్స్‌ కూడా చాలామందిలో వస్తుంటాయి. అంతేకాదు... ప్యానిక్‌ అటాక్స్‌ అనేవి... కొన్నిసార్లు కొంతమందిలో సోషల్‌ యాంగై్జటీ డిజార్డర్, ప్యానిక్‌ డిజార్డర్‌ డిప్రెషన్, పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ వంటి మానసిక సమస్యలనూ తెచ్చిపెడుతుంది. 

ఎంత సేపు కలుగుతుందీ ప్యానిక్‌ అటాక్‌...? 
ప్యానిక్‌ అటాక్‌తో బాధపడే వ్యవధి ఒక్కొక్కొరిలో ఒకలా ఉంటుంది. కొందరిలో దాదాపు 10 నిమిషాల కంటే ఎక్కువసేపే ఈ ప్యానిక్‌ అటాక్‌ కొనసాగుతుంది. ఆ సమయంలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ కలగవచ్చు. 

చికిత్స
ప్యానిక్‌ అటాక్స్‌కు కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ (సీబీటీ) బాగా ఉపయోగపడుతుంది. దీనితో పాటు బెంజోడయజపైన్స్‌ ఉండే మందులు కూడా మానసిక నిపుణులు ఇస్తుంటారు. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ఆర్‌ఐ మెడికేషన్స్‌ వంటి కొత్త మందులు ఈ సమస్య నుంచి బయటపడటానికి బాగా పనిచేస్తాయి. మందులతో పాటు కౌన్సెలింగ్‌ కూడా ప్యానిక్‌ అటాక్స్‌ నుంచి కొంతవరకు ప్రయోజనాన్ని ఇస్తాయి.

అధిగమించడం ఎలా? 
ప్యానిక్‌ అటాక్స్‌ను అధిగమించడం ఒకింత సులువే. తమకు ఆత్మవిశ్వాసం పెరిగేందుకు చేసే చర్యలతోనూ, మంచి జీవనశైలితో వీటిని అధిగమించవచ్చు. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం ప్యానిక్‌ అటాక్స్‌ను నివారిస్తుంది. రోజూ ఎక్సర్‌సైజ్‌ చేసేవారిలో ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా  యాంగై్జటీ కూడా తగ్గడం వల్ల ప్యానిక్‌ అటాక్స్‌/ ఒళ్లు బిర్ర బిగుసుకుపోయే పరిస్థితి నివారితమవుతాయి. కృత్రిమ రంగులు, అడెటివ్స్‌ కలిపిన ఆహారాలు తీసుకునే వారు తేలిగ్గా ప్యానిక్‌ అటాక్స్‌కు గురవుతారు. అలా కాకుండా స్వాభావికమైన సమతులాహారం తీసుకునేవారిలో ప్యానిక్‌ అటాక్స్‌ తక్కువ. పొగతాగే అలవాటు, మద్యం, కెఫిన్‌ వంటివి ప్యానిక్‌ అటాక్స్‌ను ప్రేరేపిస్తాయి కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండటం అవసరం. ఒత్తిడిని తగ్గించే మార్గాలైన యోగా, ధ్యానం, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజెస్‌ వంటి రిలాక్సేషన్‌ టెక్నిక్స్, కండరాలను హాయిగా ఉంచే మజిల్‌ రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ వంటివి అన్నీ ప్యానిక్‌ అటాక్స్‌ను తగ్గిస్తాయి. 
డాక్టర్‌ ఐ. భరత్‌ కుమార్‌ రెడ్డి
సీనియర్‌ కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్, 
అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement