మాటలు కుదిరితే ముహూర్తమే..
నెలాఖరు వరకే సుముహూర్తాలు
* ఆపై ఆగస్టు వరకూ ఆగాల్సిందే..
* జిల్లాలో ఎక్కడ చూసినా పెళ్లి సందడే..
* 21, 22 తేదీల్లో 10 వేలకు పైగా వివాహాలు
అమలాపురం : నెలాఖరు వరకే సుముహూర్తాలు.. అక్కడి నుంచి మూఢం.. ఆ తరువాత ఆషాఢం.. శుభకార్యాలకు అవసరమైన ముహూర్తాలు ఆగస్టులో కానీ లేవు. దీంతో పెళ్లి సంబంధాల సంప్రదింపులు జరుపుతున్న కుటుంబాలు.. మాటలు కుదిరితే తక్షణం ముహూర్తాలు పెట్టిస్తున్నారు. జిల్లాలో ఇప్పుడు ఎటుచూసినా పెళ్లి సందడి కనిపిస్తోంది. ఈనెల 16, 20, 21, 22 తేదీల్లోని ముహూర్తాలకు వేల పెళ్లిళ్లు జరగనున్నా యి. 21, 22 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉండడంతో ఆ రెండు రోజుల్లోనే జిల్లాలో పది వేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా.
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఈ రెండు రోజుల్లో 200కు పైగా వివాహాలు జరగనున్నాయి. ఆ తేదీల్లో ఇక్కడ రూమ్లు, పెళ్లిళ్లు నిర్వహించేందుకు వేసే మండపాలు ఇప్పటికే భర్తీ అయ్యూయి. కాగా ఒకే సమయంలో ఎక్కువ పెళ్లిళ్లు జరగనుండడంతో పురోహితుల నుంచి భజంత్రీల వరకూ, లైటింగ్ వారి నుంచి మండపం డెకరేషన్ చేసేవారి వరకూ గిరాకీ పెరిగింది.
ఇప్పటికిప్పుడు ముహూర్తాలు పెట్టుకున్నవారు పెళ్లికి అవసరమైన వేదిక, వేదమంత్రాలు చదివే పురోహితులు, ఇతర సరంజామా, సాధనాలు దొరక్క హైరానా పడుతున్నారు. కల్యాణమండపాలు దొరక్క అనేకులు కమ్యూనిటీ భవనాలు, పాఠశాలలు, ఇండ్ల వద్దే పెళ్లి వేడుకలకు సన్నాహాలు చేసుకుం టున్నారు. అన్నవరంలో సత్యదేవుడు,అమలాపురంలో శ్రీభూసమేత వెంకటేశ్వరస్వామి ఆలయాలతో జిల్లాలో పలు దేవాలయాలు పెళ్లిళ్లతో హోరెత్తనున్నాయి.