Endoscopy Method
-
మృత్యువుతో 108 గంటల పోరాటం
బ్యాంకాక్: భారీ భూకంపం మయన్మార్‌ను అతలాకుతలం చేసింది. వేలాది మంది మరణించారు. మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. వందలాదిగా భారీ భవనాలు, వంతెనలు, రహదారులు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా విధ్వంసమే కనిపిస్తోంది. శిథిలాల నుంచి తవ్వినకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. అదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలతో మిగిలి ఉంటున్నారు. హోటల్లో కార్మికుడిగా పని చేస్తున్న 26 ఏళ్ల నాయింగ్ లిన్ టున్ అదృష్టం కూడా బాగున్నట్లుంది. 108 గంటలపాటు మృత్యువుతో పోరాడి ఎట్టకేలకు ప్రాణాలతో బయటకు వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున రెస్క్యూ సిబ్బంది అతడిని కాపాడారు. ఇందుకోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. నాయింగ్ లిన్ టున్ మయన్మార్ రాజధాని నేపడాలోని క్యాపిటల్ సిటీ హోటల్లో పని చేస్తున్నాడు. గత శుక్రవారం సంభవించిన భూకంపం ధాటికి ఈ హోటల్ కుప్పకూలింది. శిథిలాలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఇక్కడ గత ఐదు రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో కేవలం మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. శిథిలాల కింద ఎవరైనా బతికి ఉండొచ్చన్న అంచనాతో ఎండోస్కోపిక్ కెమెరాతో గాలించారు. శిథిలాల కింద చిక్కుకున్న నాయింగ్ లిన్ టున్ ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. యంత్రాల సాయంతో కాంక్రీట్ దిమ్మెలకు భారీ రంధ్రం చేసి అతడిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్ పూర్తికావడానికి 9 గంటలకు పైగా సమయం పట్టింది. ఆహారం, నీరు లేక పూర్తిగా నీరసించిపోయినప్పటికీ స్పృహలోనే ఉన్న నాయింగ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు ప్రకటించారు. 3,000 దాటిన మృతుల సంఖ్య ఇదిలా ఉండగా, మయన్మార్ భూకంపంలో మృతుల సంఖ్య 3,000కు చేరుకున్నట్లు స్థానిక మీడియా ప్రకటించింది. మరో 4,639 మంది గాయపడ్డారని తెలియజేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు బ్యాంకాక్‌లో భూకంపం మృతుల సంఖ్య 22కు చేరుకుంది. 34 మంది క్షతగాత్రులయ్యారు. బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న భారీ భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇక్కడ బుధవారం మరో మృతదేహాన్ని వెలికితీశారు. భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌కు మానవతా సాయం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఆ్రస్టేలియా ప్రభుత్వం ఇప్పటికే 1.25 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించగా, అదనంగా మరో 4.5 మిలియన్ డాలర్లు అందజేస్తామని బుధవారం ప్రకటించారు. సహాయక చర్యల కోసం భారత ప్రభుత్వం 200 మందిని పంపించింది. చైనా 270 మందిని, రష్యా 212 మందిని, యూఏఈ 122 మందిని పంపించాయి. మయన్మార్‌లో ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా నిర్ధారించలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, సెల్‌ఫోన్ సేవలను ఇంకా పునరుద్ధరించలేదు. రోడ్లు చాలావరకు దెబ్బతినడంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. మాండలే నగరానికి 65 కిలోమీటర్ల దూరంలోని సింగు టౌన్షిప్లో ఓ బంగారు గని భూకంపం వల్ల కుప్పకూలడంతో అందులో ఉన్న 27 మంది కార్మికులు మృత్యువాత పడినట్లు తాజాగా వెల్లడయ్యింది. -
ఆధునిక ఎండోస్కోపితో మధుమేహానికి చెక్
సాక్షి, హైదరాబాద్: ఎండోస్కోపి విధానంతో టైప్-2 డయాబెటిక్‌ను పూర్తిస్థాయిలో నయం చేయవచ్చని, అటువంటి ఆధునిక చికిత్సా పద్ధతులు కొన్ని దేశాల్లో అమల్లోకి వచ్చాయని అంతర్జాతీయ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మధుమేహంతో ఇబ్బందిపడాల్సిన అవసరం లేదని, ఎండోస్కోపిలో ప్రత్యేక విధానం ద్వారా పూర్తిగా నయం చేయొచ్చని స్పష్టంచేశారు. ముందస్తుగా కేన్సర్‌ను గుర్తించే ఆధునిక ఎండోస్కోపిక్ విధానం కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. అలాగే అల్సర్స్ వచ్చి రక్తస్రావమైతే నయం చేసే పద్ధతులూ ఉన్నాయన్నారు. జీఐ ఎండోస్కోపిపై వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఎండో-2017 ప్రపంచ సదస్సు సన్నాహక సమావేశం శనివారమిక్కడ జరిగింది. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, జపాన్, కొరియా, హాంకాంగ్ తదితర దేశాల వైద్య నిపుణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ‘సైంటిఫిక్ చైర్’గా నియమితులైన, ప్రపంచ ఎండోస్కోపి సంస్థకు అధ్యక్షులుగా ఎంపికైన డాక్టర్ జీన్ ఫ్రాంకోయిస్ రే, ప్రపంచ సదస్సు అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డితోపాటు ఆయా దేశాల గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు మాట్లాడారు. మొదటిసారిగా భారత్‌లో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు వారు చెప్పారు. 80 దేశాల నుంచి 5 వేల మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు. అల్సర్లు, కేన్సర్ల వ్యాధి నిర్ధారణకు మొదట్లో ఎండోస్కోపిని ఉపయోగించేవారని, గత దశాబ్ద కాలంలో వ్యాధి నిర్ధారణ ప్రక్రియ నుంచి చికిత్సా విధానంగా రూపాంతరం చెందిందన్నారు. గ్యాస్ట్రోఇంటైస్టైనల్ రుగ్మతలకు అందించే చికిత్సా విధానంలో జీఐ ఎండోస్కోపి విప్లవాత్మక మార్పులను తెచ్చిందన్నారు. ప్రత్యేకమైన క్యాప్సుల్స్‌ను కూడా ఎండోస్కోపి నిపుణులు కనుగొన్నారని, వాటిద్వారా శరీరంలో ఏ భాగంలో దేన్ని నయం చేయాలో బయటనుంచే నియంత్రించవచ్చని తెలిపారు. ఈజిప్టులో రక్తంతో కూడిన వాంతులు అధికమని, హెపటైటిస్-బితో ఆ దేశంలో 10 శాతం మంది బాధపడుతున్నారన్నారు. కేన్సర్లను, ట్యూమర్లను గుర్తించి ఆపరేషన్ లేకుండా వైద్య చికిత్స చేయవచ్చన్నారు. హైదరాబాద్‌లోని తమ ఆసుపత్రిలోనూ టైప్-2 డయాబెటిక్‌ను నయం చేయడానికి శ్రీకారం చుడుతున్నామని, త్వరలోనే వివరాలను వెల్లడిస్తామని నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు.