ఓ గుమాస్తా దందాగిరి!
* గుంటూరు నగరపాలక సంస్థ
ఇంజనీరింగ్ సెక్షన్లో అధికారి హవా
గుంటూరు (నెహ్రూనగర్) : నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ సెక్షన్లో ఓ గుమాస్తా తన చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రతి పనికి ఎంతో కొంత ముట్టచెప్పనిదే ఫైలు కదలనివ్వడని సిబ్బంది ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ ఇంక్రిమెంట్లు వేయాలంటే రూ.500 దాకా, పీఆర్సీ బకాయిలు వేయాలంటే రూ.10 వేలు నుంచి రూ.15 వేలు, సరెండర్ లీవ్‌లకు రూ.3 వేలు, కొత్తగా ఎస్సార్ ఓపెన్ చేయాలంటే ఒక రేటు, ఇక కారుణ్య నియమకాలకు ఒక రేటు చొప్పున వసూలు చేస్తున్నారంటూ సిబ్బంది ఆరోపిస్తున్నారు. దీనిపై ఎస్ఈకి ఫిర్యాదు చేయడంతో ఆయన సదరు గుమాస్తాను తన చాంబర్‌కు పిలిపించి మాట్లాడారు. ఎందుకు ఇలా వసూలు చేస్తున్నావని అడగడంతో తాను తీసుకుంటే వేలల్లో.. మీరు తీసుకుంటే లక్షల్లోనే కదా అనడంతో ఎస్ఈ సైతం నోరు మెదపలేదని తెలిసింది. అతనిని సెక్షన్ నుంచి మార్చాలని కమిషనర్‌కు ఎస్ఈ నోట్ పెట్టినట్లు సమాచారం.
గతంలో ప్రవీణ్ ప్రకాష్ కమిషనర్‌గా ఉన్న సమయంలో సదరు గుమాస్తా అటెండర్‌గా పనిచేసి జూనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ సంపాదించాడు. అయితే అతని పనితీరు నచ్చని కమిషనర్ తిరిగి అటెండర్‌గా డిమోట్ చేశారు. చివరికి కమిషనర్ బదిలీ కావడంతో కోర్టును ఆశ్రయించి తిరిగి ప్రమోషన్ సంపాదించాడు. కార్పొరేషన్లో సదరు గుమాస్తాకి అధికారులంటే లెక్కే లేదనే ఆరోపణలున్నాయి. దీనిపై ఎస్ఈ గోపాలకృష్ణారెడ్డిని వివరణ కొరగా సదరు గుమాస్తాపై వస్తున్న ఆరోపణలు నిజమేనని చెప్పారు. తన దగ్గరకు చాలా ఫిర్యాదులు అందాయన్నారు. తాను పిలిచినా రాలేదని తెలి పారు. విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.