రిషభ్ పంత్‌పైనే అందరి దృష్టి!
నేడు రెండో వార్మప్ మ్యాచ్
ఇంగ్లండ్ ఎలెవన్‌తో భారత్ ‘ఎ’ పోరు
బరిలో రహానే, రైనా
ముంబై: సీనియర్ల వార్మప్ ముగిసిపోయింది. ఇప్పుడు ఫామ్‌లో లేని ఆటగాళ్లతో పాటు కొత్త కుర్రాళ్లు తమ సాధనకు పదును పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇంగ్లండ్ ఎలెవన్‌తో గురువారం భారత్ ‘ఎ’ జట్టు రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. భారత జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, టి20 టీమ్‌కు ఎంపికైన సురేశ్ రైనా కూడా తన సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే వీరికంటే కూడా అందరి చూపూ ఇప్పుడు 19 ఏళ్లు కుర్రాడు రిషభ్ పంత్‌పైనే నిలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనికి వారసుడిగా భావిస్తుండటంతో అతని ఆటతీరుపై ప్రత్యేక దృష్టి ఉండటం ఖాయం. మరోవైపు తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్ మరోసారి తమ ధాటిని ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది.
రహానేకు పరీక్ష...
టి20 జట్టులో స్థానం కోల్పోయి కేవలం వన్డేలకే ఎంపికైన రహానే, ఈ మ్యాచ్‌లో తన సత్తాను ప్రదర్శించాల్సి ఉంది. ఇటీవల టెస్టుల్లోనూ విఫలమైన తర్వాత ఒక రకంగా సెలక్టర్ల హెచ్చరికకు గురైన ఈ ముంబై ఆటగాడు, ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించడం ఎంతో అవసరం. మరోవైపు సురేశ్ రైనా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వన్డే జట్టులో అవకాశం దక్కించుకోలేని అతను, టి20 సిరీస్‌కు ముందు ఆడుతున్న ఈ ఏకైక మ్యాచ్‌లో చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. రంజీ ట్రోఫీలో భీకర ప్రదర్శనతో భారత టి20 టీమ్‌లోకి ఎంపికైన పంత్‌కు ఇది చక్కటి అవకాశం. నాలుగు రోజుల మ్యాచ్‌లే అయినా రంజీల్లో కూడా మెరుపు వేగంతో ఆడిన రెండు ఇన్నింగ్స్‌లు అతడి దూకుడును ప్రపంచానికి చూపించాయి. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ధోని మార్గనిర్దేశనంలో ఎదిగే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే సెలక్టర్లు అతడికి చోటు కల్పించారు. తన ఆటను ప్రదర్శించేందుకు ఈ ఢిల్లీ ఆటగాడికి ఇదే సరైన వేదిక. జట్టులో ఇతర సభ్యులలో షాబాద్ నదీమ్ టీమిండియాలో స్థానాన్ని ఆశిస్తున్నాడు. ఈ రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా (56) నిలిచిన నదీమ్, ఇంగ్లండ్‌ను తన స్పిన్‌తో ఇబ్బంది పెట్టవచ్చు. దీపక్ హుడా, ఇషాన్ కిషన్వంటి కుర్రాళ్లతో పాటు టీమ్‌లో పునరాగమనాన్ని ఆశిస్తున్న వినయ్ కుమార్, అశోక్ దిండా, పర్వేజ్ రసూల్ కూడా ఈ జట్టులో ఉన్నారు.
ఇంగ్లండ్ జోరుగా...
మరోవైపు తొలి వార్మప్ మ్యాచ్ విజయం ఇంగ్లండ్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆశించినట్లుగానే టీమ్ వన్డే స్పెషలిస్ట్‌లు హేల్స్, రాయ్, బట్లర్ గత మ్యాచ్‌లో ఆకట్టుకున్నారు. ఐపీఎల్లో ఢిల్లీ తరఫున ఆడినప్పుడు ద్రవిడ్ సూచనలతో స్పిన్‌ను బాగా ఆడటం నేర్చుకున్నానని చెప్పిన బిల్లింగ్స్ కూడా భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కాబట్టి బ్యాటింగ్ పరంగా టీమ్‌కు సమస్య లేదు. అయితే వార్మప్ మ్యాచ్‌లో బౌలింగ్ పరంగా మాత్రం ఇంగ్లండ్ కాస్త తడబడింది. బాల్ వికెట్లు తీసినా... అతనితో పాటు వోక్స్, విల్లీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక ప్రధాన స్పిన్నర్లు అలీ, రషీద్ కూడా రాణించాల్సి ఉంది. మొదటి మ్యాచ్ ఆడని కీలక ఆటగాడు స్టోక్స్ ఇందులో బరిలోకి దిగే అవకాశం ఉంది.