English vinglis
-
గుర్తుకొస్తున్నాయి
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అంటున్నారు ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి. ఈ బహుభాషా నటి బాలతారగా అరంగేట్రం చేసింది మద్రాసులోనే. నాటి నుంచి నేటి వరకు ఆమెది ప్రత్యేక శైలినే. హీరోయిన్గా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ ప్రముఖ నటిగా వెలుగొందుతుండగానే బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను వివాహమాడి ఆ తరువాత కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు. ఇటీవల ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో తెరపైకివచ్చి మరోసారి నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. దాదాపు 28 ఏళ్ల తరువాత శ్రీదేవి తమిళ చిత్రంలో నటిస్తుండడం విశేషం. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మారిశన్ అనే పేరును నిర్ణయించినట్లు సమాచారం. సోషియా ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒక ముఖ్యపాత్రలో శ్రీదేవి నటిస్తున్నారు. శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ చిత్రంలో పాల్గొనడానికి చెన్నైకి వచ్చిన శ్రీదేవి చిత్ర యూనిట్ ఆదరాభిమానాలకు సంతోషంతో తబ్బిబ్బైపోతున్నారు. దీనిగురించి ఆమె తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఒక కొత్తతమిళ చిత్రం కోసం చెన్నై షూటింగ్ పాల్గొంటున్నాను. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని ముఖ్యంగా బాలతారగా తొలి చిత్ర షూటింగ్ సంఘటనలు గుర్తుకొస్తున్నాయని పేర్కొన్నారు. చిత్ర యూనిట్ తనపై చాలా ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారని తెలిపారు. ఈ తరహా నటీనటులు, సాంకేతిక వర్గం ఎంతో ప్రతిభను ప్రదర్శిస్తున్నారని కితాబిచ్చారు. వారితో కలిసి పని చేస్తున్నట్లు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని అన్నారు. ఎప్పటిలాగే తనపై అభిమానం చూపుతున్న చెన్నై ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని శ్రీదేవి ట్విట్టర్లో పోస్టు చేశారు. -
మళ్లీ బుల్లితెరకు?
శ్రీదేవి మళ్లీ నటిస్తే? బాగుంటుందని కోరుకున్నవారందరినీ ఆనందపరుస్తూ ఆమె ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. దాదాపు పధ్నాలుగేళ్ల తర్వాత వెండితెరపై ఆమె కనిపించిన చిత్రం ఇది. అదే నటన, అదే అందం.. శ్రీదేవిలో ఏ మాత్రం మార్పు లేదని ఆ సినిమా చూసినవాళ్లు కితాబులిచ్చేశారు. ఓ విజయవంతమైన చిత్రం ద్వారా రీ-ఎంట్రీ అయిన శ్రీదేవి మళ్లీ అదే స్థాయి చిత్రంలో నటించాలని తదుపరి చిత్రం ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నారు. ఇప్పటికే తమిళంలో ఓ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారామె. ఇటీవల శ్రీదేవికి బుల్లితెర నుంచి ఓ ఆఫర్ అందిందట. ‘మై లక్ష్మీ తేరీ ఆంగన్ కీ’ అనే ధారావాహికకు సంబంధించిన రెండో సీజన్లో ఓ కీలక పాత్రను శ్రీదేవితో చేయించాలని నిర్మాతలు అనుకున్నారని సమాచారం. ఇటీవల శ్రీదేవితో చర్చించారని భోగట్టా. అయితే, ఇంకా ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకోలేదట. ఇదిలా ఉంటే.. గతంలో ‘మాలిని అయ్యర్’ అనే కామెడీ షో ద్వారా బుల్లితెరపై మెరిశారు శ్రీదేవి. ఆ తర్వాత ఓ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఇది జరిగి దాదాపు పదేళ్లయ్యింది. ఒకవేళ తాజా ప్రతిపాదనను ఆమె అంగీకరిస్తే... ఇంటిల్లిపాదీ ఆనందపడతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
సవతి తల్లిగా..!
ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవి దాదాపు పధ్నాలుగేళ్ల విరామం తర్వాత ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ చిత్రం ద్వారా వెండితెరపై మెరిసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత హిందీలో వేరే ఏ సినిమా అంగీకరించలేదామె. తమిళంలో విజయ్ హీరోగా రూపొందనున్న చిత్రంలో కీలక పాత్ర చేయడానికి ఇటీవలే పచ్చజెండా ఊపారు. ఈ సినిమా అంగీకరించిన కొన్ని రోజులకే హిందీలో ఆమె ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని శ్రీదేవి భర్త బోనీకపూర్ స్వయంగా చెప్పారు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. కథ బాగా నచ్చడంవల్ల తానే నిర్మించాలనుకున్నానని బోనీ తెలిపారు. ఈ చిత్రంలో పద్ధెనిమిదేళ్ల కూతురికి శ్రీదేవి సవతి తల్లిగా నటించనుంది’’ అని బోనీ పేర్కొన్నారు. ఇందులో శ్రీదేవి కూతురిగా కొత్తమ్మాయిని తీసుకోవాలనుకుంటున్నారు. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తర్వాత మళ్లీ ఆ స్థాయికథ దొరికితేనే శ్రీదేవి నటించాలనుకుందని, ఈ చిత్రకథ ఆమెకు పూర్తి సంతృప్తినిచ్చిందని బోనీ కపూర్ తెలియజేశారు. -
నైట్ పార్టీలకు వెళ్లను
నైట్ పార్టీలకు వెళ్లే అలవాటు లేదు. ప్రేమకు పచ్చజెండా ఊపను వంటి ప్రకటనలు గుప్పిస్తోంది నటి ప్రియా ఆనంద్. తొలి రోజుల్లో వామనన్, నూట్రెంబదు చిత్రాల్లో నటించి ఐరన్ లెగ్ ముద్రకు గురైన ఈ బ్యూటీ ఆ తరువాత నటించిన ఇంగ్లిష్ వింగ్ల్లిష్, ఎదిర్ నీచ్చల్, వణక్కం చెన్నై వంటి చిత్రాల విజయాలతో ప్రైమ్ టైమ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో అరిమానంబి, వై రాజా వై, ఇరుంబు కదిరై, ఒరు ఊరుల రెండు రాజా తదితర ఐదు చిత్రాలు ఉన్నాయి. ప్రియా ఆనంద్ మాట్లాడుతూ నటి శ్రీదేవితో కలసి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం తన కెరీర్‌ను పెద్ద మలుపు తిప్పిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. యువ నటుడు గౌతమ్ కార్తీక్ తనకు నచ్చిన నటుడని బదులిచ్చింది. అలాగే తాను జత కడుతున్న హీరోల్లో అధికశాతం పెళ్లి అయిన వారేనని అంది. తాను నైట్ పార్టీలకు వెళ్లింది లేదని ఎవరినీ ప్రేమించింది లేదని చెప్పింది. తనకు వరుడిని తెచ్చిపెట్టే బాధ్యతను తన తల్లిదండ్రులకు అప్పగించానని ప్రియా ఆనంద్ చెప్పడం విశేషం.