పాలమూరు ప్రతిభ
► జాతీయసైన్స్ ప్రదర్శనకు ఎన్మన్గండ్ల విద్యార్థి లక్ష్మి
► మార్చి 3న రాష్ట్రపతి భవన్లో ప్రదర్శనకు పిలుపు
► మూగ, చెవిటి వినికిడి యంత్రం ఆవిష్కరణ
► పరికరంపై పేటెంట్ హక్కుకోసం దరఖాస్తు
► ఢిల్లీకి వెళ్లేందుకు సాయం కోసం ఎదురుచూపు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: పట్టుదల ఉంటే పేదరికం అడ్డురాదని నిరూపించింది మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎన్మన్‌గండ్లకు చెందిన పేద విద్యార్థిని లక్ష్మి.. చెవి, మూగ వినికిడి యంత్రాన్ని ఆవిష్కరించి అందరిచేత భళా! అనిపించుకుంది. మార్చిలో ఢిల్లీని రాష్ట్రపతి భవన్లో జరిగే సైన్స్ ఇన్స్పైర్ ప్రదర్శనకు హాజరుకావాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి పిలుపు అందుకుంది.
రంగారెడ్డి జిల్లా మహ్మదాబాద్‌కు చెందిన లక్ష్మయ్య, బాలమణి దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా, లక్ష్మి మొదటి సంతానం. తండ్రి లక్ష్మయ్య చనిపోవడంతో ఆమె తల్లి కూలీనాలి పనులు చేస్తూ తన ఇద్దరు కుమార్తెలను చదివిస్తోంది. లక్ష్మి నవాబ్‌పేట మండలం ఎన్మన్గండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. యంత్రపరికరాల తయారీలో ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించిన ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. గత సంవత్సరం ఎన్మన్గండ్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుండగా నాగర్‌కర్నూల్‌లో జరిగిన సైన్స్ ప్రదర్శనలో లక్ష్మి తయారుచేసిన వినికిడి యంత్రాన్ని ప్రదర్శించింది. ఈ పరికరమే నవంబర్‌లో రాష్ట్రస్థాయికి ఎంపికకాగా, లక్ష్మి తయారుచేసిన యంత్రానికి రెండవస్థానం దక్కింది. ఈ క్రమంలో గత డిసెంబర్ 10, 11వ తేదీల్లో ఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి వై/ê్ఞనిక ప్రదర్శనలో విద్యార్థిని లక్ష్మి అత్యంత సృజనాత్మకతతో వ్యవహరించింది.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 650ప్రయోగాలు పోటీపడగా అందులో ఆమె తయారుచేసిన మూగ, చెవిటి వినికిడి యంత్రం ఉత్తమప్రదర్శనగా ఎంపికైంది. ఉత్తమ ప్రతిభచాటినందుకు కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చేతులమీదుగా అవార్డును అందుకుంది. ఈ క్రమంలో మార్చి 3న రాష్ట్రపతి భవన్లో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనకు రావాల్సిందిగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదివారం పిలుపు అందింది. మేలో లక్ష్మిని జపాన్ తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.