తెట్టు తిప్పలు!
► నేతల పడగ
► వంద టన్నులు తొలగింపు
► పీఆర్కే పరిశీలన
► కెప్టెన్ల వద్ద విచారణ
సాక్షి, చెన్నై: ఆయిల్ తెట్టు అధికార వర్గాల్ని ముప్పుతిప్పలు పెడుతోంది. క్రమంగా చెన్నై సముద్ర తీరం తెట్టుతో కలుషితం అవుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి, వీసీకే నేత తిరుమావళవన్ నేతలు తీరం వెంబడి పర్యటించారు. పనుల వేగం పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఎన్నూరు పరిసరాల్లో పర్యటించారు. ఎన్నూర్ కామరాజర్ హార్బర్‌కు కూత వేటు దూరంలో సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్న విషయం తెలిసిందే. క్రూడాయిల్‌తో వచ్చిన నౌకలో ఏర్పడ్డ లీకేజీ చెన్నై సముద్ర తీరాన్ని కలుషితం చేసింది.
క్రూడాయిల్ సముద్రంలో కలవడంతో తీరం రంగు మారింది. జల సంపద మీద ప్రభావం, తీరం కలుషిత ప్రభావం రోజురోజుకు పెరుగుతుండడంతో ఆందోళన బయలు దేరింది. ఎనిమిదో రోజుగా సముద్రం నుంచి ఆయిల్ తెట్టును తొలగించే పనులు శర వేగంగా శనివారం కూడా సాగాయి. తొలగించే కొద్దీ తెట్టు తీవ్రత పెరుగుతుండడంతో ఈ కలుషితం ఎలాంటి కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతుందో అన్న ఆందోళన తీరవాసుల్లో, జాలర్ల కుటుంబాల్లో బయలుదేరింది. కోస్టుగార్డు, రెవెన్యూ, కేంద్ర ప్రభుత్వ, హార్బర్వర్గాలు ఈ తెట్టుతో ముప్పుతిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వంద టన్నులు : శనివారం నాటికి వంద టన్నుల మేరకు తెట్టును తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బకెట్లతో సిబ్బంది, సూపర్ సక్కింగ్ పరికరంతో శరవేగంగా తెట్టు తొలగింపు సాగుతున్నట్టు వివరించారు. సూపర్ సక్కింగ్ పరికరంతో రెండు రోజుల్లో 54 టన్నుల మేరకు తెట్టును తొలగించినట్టు, ఇందులో నీళ్లు సైతం కలిసి ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఎన్నూర్ పరిసరాల్లో 21 టన్నులు, ఆర్కే నగర్లో 3.4 టన్నులు, మెరీనాతీరంలో ఏడు టన్నులు, శక్తి నగర్, గాంధీనగర్‌లలో ఐదు టన్నుల మేరకు అత్యధికంగా తెట్టు తొలగింపు సాగింది.
కెప్టెన్ల వద్ద విచారణ : కామరాజర్ హార్బర్ అధికారి గుప్తా ఇచ్చిన ఫిర్యాదుతో మీంజూరు పోలీసులు రంగంలోకి దిగారు. 336, 427, 431, 250, 285 సెక్షన్ల కింద కేసుల నమోదుతో హార్బర్లో ఉన్న రెండు నౌకల కెప్టెన్ల వద్ద తీవ్రంగా విచారణ సాగిస్తున్నారు. రెండు నౌకలు ఢీకొనాల్సినంత పరిస్థితి ఎందుకు ఏర్పడిందో తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణ సాగుతోంది.
పీఆర్కే పరిశీలన : కేంద్ర రహదారులు, రోడ్డు , రవాణా శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తిరువొత్తియూరు, ఎన్నూరు పరిసరాల్లో తీరం వెంబడి సాగుతున్న తెట్టు తొలగింపు పనుల్ని పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలను సేకరించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు నౌకలు ఢీకొన్న సమాచారంతో తక్షణ పరిశీలన సాగిందని, అయితే, ఎలాంటి లీకేజీ తొలుత కనిపించక పోవడంతో పెద్దగా ముప్పు ఉండదని భావించామన్నారు. ఆ నౌకలో 58 వేల టన్నుల మేరకు చమురు ఉన్నట్టు, దానిని దిగుమతి చేసే పనుల వేగం శరవేగంగా సాగుతోందన్నారు. నౌక ఇంజిన్ ఆగడంతోనే లీకేజీని గుర్తించామని, ఒక వేళ నౌకలో చీలిక ఏర్పడి ఉంటే, భారీ ముప్పును చవి చూసి ఉండాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెట్టు తొలగింపునకు తగ్గ అత్యాధునిక పరికరాలు ఉన్నాయి, త్వరితగతిన తొలగిస్తామన్నారు. హార్బర్లో ఉన్న నౌకలను పరిశీలించినానంతరం నష్టం తీవ్రతను ప్రకటిస్తామని పేర్కొన్నారు. తమకు నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల తీరంలోని జాలర్ల కుటుంబాలు ఆందోళనకు దిగాయి.
స్టాలిన్, కనిమొళిల పరిశీలన : డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్, డీఎంకే ఎంపీ కనిమొళి, వీసీకే నేత తిరుమావళవన్ నాయకులు సముద్ర తీరంలో పర్యటించారు. తెట్టు తొలగింపు పనుల్ని పరిశీలించారు. తిరువొత్తియూరు, భారతీనగర్ పరిసరాల్లో స్టాలిన్ పర్యటించి, అక్కడి జాలర్లతో సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ 32 కిమీ మేరకు తెట్టు విస్తరించే వరకు అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండడం శోచనీయమన్నారు. సంబంధిత మంత్రి ఆలస్యంగా తీరానికి పరుగులు పెట్టారని పేర్కొంటూ, ఇకనైనా పనుల్నిమరింత వేగవంతం చేయించాలన్నారు.
ఈ తెట్టు రూపంలో చెన్నైకు నీటిని అందిస్తున్న మీంజూరు నిర్లవణీకరణ పథకంకు ఎలాంటి ఇబ్బందులు నెలకొననున్నాయోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం నిపుణుల్ని రంగంలోకి దించాలని, అత్యాధునిక పరికరాలను మరింతగా ఉపయోగించాలని, లేని పక్షంలో మరింత ఆందోళన తప్పదేమోనని పేర్కొన్నారు. ఇక, డీఎంకే ఎంపీ కనిమొళి ఎన్నూరు పరిసరాల్లో పర్యటించి, అధికారుల మధ్య సమన్వయం కొరవడినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక నిపుణులు లేకుండా, సాధారణ సిబ్బందితో పనులు సాగుతున్నాయన్నారు. వీసీకే నేత తిరుమావళవన్ జాలర్ల గ్రామాల్లో పర్యటించి, తెట్టు రూపంలో పడుతున్న ఇబ్బందుల్ని తెలుసుకున్నారు.