అవినీతి నిగ్గు తేలేనా..?
= నేడు కలెక్టర్‌కు నివేదిక
= 120 పనుల వివరాలు గోప్యం
= అభివృద్ధి పనుల్లో రూ.కోట్లలో అవినీతి!
అనంతపురం న్యూసిటీ: నగరపాలక సంస్థ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి చోటు చేసుకుంది. దీనిపై సమగ్ర విచారణ జరిపిన పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనాథ్‌రెడ్డి నివేదికను సోమవారం కలెక్టర్ శశిధర్‌కు నివేదించనున్నారు. నివేదికలో అవినీతి అక్రమాలు నిగ్గు తేలేనా అన్నది చర్చనీయాంశంగా మారింది. కార్పొరేష¯ŒS పరిధిలో రూ.10 కోట్లతో చేపట్టిన దాదాపు 320 అభివృద్ధి పనులపై విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు ఎస్ఈ శ్రీనాథ్‌రెడ్డి ఆరుగురు డీఈలతో మూడు బృందాలుగా ఏర్పడి గత నెలలో విచారణ చేపట్టారు. నగరపాలక సంస్థ అధికారులు 172 పనులకు సంబంధించి ఎం బుక్కులు, రికార్డులను మాత్రమే విచారణ బృందాలకు ఇచ్చారు. 120 అభివృద్ధి పనులను గోప్యంగా ఉంచినట్లు సమాచారం. వీటిలో ఓ ఏఈ రూ.15 లక్షలతో చేసిన పనులు, రాంనగర్లో రూ.16 లక్షలతో మార్కెట్ ఏర్పాటు చేసినట్లు నమోదు చేసిన రికార్డులు, అలాగే నగరంలో కొన్ని డివిజన్లలో తీసిన పూడికతీత పనులు, రూ. కోటి వరకు చేపట్టిన మట్టిరోడ్డు పనులు, మట్టిదిబ్బల తొలగింపు పనుల రికార్డులు ఇవ్వలేదని విశ్వసనీయంగా తెలిసింది. దాదాపు రూ. 2 కోట్ల నుంచి రూ.3 కోట్ల పనుల బిల్లుల వివరాలను పూర్తిగా సమర్పించలేదు. పదుల సంఖ్యలో ఎం బుక్కులు, రికార్డులు అధికార పార్టీకి చెందిన కొందరు నేతల వద్ద ఉండడంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా అభివృద్ధి పనుల వివరాలు ఇవ్వలేదని కమిషనర్ సత్యనారాయణ ఇద్దరు ఏఈలకు మెమోలు సైతం జారీ చేశారు. అయిన వాటి వివరాలను ఇంత వరకు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సోమవారం పబ్లిక్‌హెల్త్ ఎస్ఈ సమర్పించే నివేదికతో పలువురి భవితవ్యం తేలనుంది.
కమిషనర్‌కు కలెక్టర్ భరోసా..!
నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ ఆదివారం కలెక్టర్‌ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. కాంట్రాక్టర్స్ అసోసియేషన్, పాలకుల గ్రూపు రాజకీయాలు, కొందరు అధికారుల ప్రవర్తనపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, సెలవుపై వెళ్తానని చెప్పడంతో అందుకు కలెక్టర్ ఒప్పుకోలేదు. ఎటువంటి ఇబ్బందీ ఉండదని, కొత్త కమిషనర్ వచ్చే వరకు పని చేయాలని ఆదేశించారు. ఆరోగ్యం బాగలేని పక్షంలో అప్పుడప్పుడు క్యాజువల్ లీవ్ తీసుకుని అందుబాటులో ఉండాలని సూచించారు.