EPDS
-
నిలిచిన ఆహార భద్రత కార్డుల జారీ!
సాక్షి, మెదక్: కొత్తగా ఆహార భద్రత కార్డుల(ఎఫ్ఎస్సీ) జారీకి బ్రేక్ పడింది. దరఖాస్తు చేసుకున్న వేలాది మందికి సుమారు రెండు నెలలుగా ఎదురుచూపులే మిగిలాయి. సివిల్ సప్లయ్ కమిషనర్ ఇటీవల అన్ని జిల్లాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రస్తుతానికి కొత్త రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు దరఖాస్తుల పరిశీలనను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా కార్డులందక నిరుపేద కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురుచూపులే మిగిలాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అర్జీలను రెండు నెలల క్రితం వరకు యుద్ధప్రాతిపదికన క్లియర్ చేసిన జిల్లా యంత్రాంగం ప్రస్తుతం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దరఖాస్తుల పరిశీలనపై ఏ ఒక్క అధికారి దృష్టిసారించడం లేదు. ఆరోగ్యశ్రీ, కుటుంబ వార్షిక ఆదాయ నిర్ధారణ, సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఉపకార వేతనాల జారీలో ఆహార భద్రత కార్డులు ప్రామాణికంగా నిలుస్తాయి. ఈ క్రమంలో సివిల్ సప్లయ్ కమిషనర్ కొత్తగా ఆహార భద్రత కార్డులను జారీ చేయొద్దని ఆదేశించడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకటిన్నర నెలలుగా జిల్లాలో సుమారు వేలాదిగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. పలువురు నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు. పెండింగ్‌లో 2,658 దరఖాస్తులు ఆహారభద్రత కార్డుల జారీకి సంబంధించి అధికారులు మూడంచెలుగా పరిశీలన చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను ముందుగా మండలాల వారీగా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు(ఆర్ఐ), ఆ తర్వాత ఎమ్మార్వో, అనంతరం జిల్లా స్థాయిలో డీసీఎస్ఓ పరిశీలించి రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లోని కమిషనర్‌కు పంపుతారు. అక్కడ పరిశీలించి అప్రూవల్ ఇస్తే.. ఆహార భద్రత కార్డులు జారీ అవుతున్నాయి. ప్రస్తుతం జూన్ నెల నుంచి ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ మేరకు ఆర్ఐల వద్ద 1290, ఎమ్మార్వోల వద్ద 213, డీసీఎస్ఓ వద్ద 1,155.. మొత్తం 2,658 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మార్పు చేర్పుల అర్జీలు సైతం జిల్లాలో రేషన్ షాపులు 521 ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఆహార భద్రత కార్డులు 2,14,165 ఉండగా.. ఇందులో అంత్యోదయ కార్డులు 13018, అన్నపూర్ణ కార్డులు 88, ఎఫ్ఎస్సీ కార్డులు 2,01,059 ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అయితే ఇదివరకు ఆహార భద్రత కార్డులు జారీ అయి కుటుంబ సభ్యులను అందులో చేర్చాల్సి(మెంబర్ అడిషన్) ఉన్న వారికీ ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఇలాంటి మార్పుచేర్పుల దరఖాస్తులను కూడా మూడంచెలుగా పరిశీలన చేయాల్సి ఉండగా.. ప్రక్రియ నిలిచిపోయింది. మెంబర్ అడిషన్‌కు సంబంధించి ఆర్ఐల వద్ద 1,765, ఎమ్మార్వో వద్ద 555, డీసీఎస్ఓ వద్ద 2,104.. మొత్తం 4,424 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అర్ధాకలితో అలమటిస్తున్న నిరుపేదలు కొత్తగా ఆహార భద్రత కార్డుల జారీ నిలిచిపోవడంతో జిల్లాలో నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. జిల్లాలో మొత్తం 2,658 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. ఇందులో 20 శాతం మేర కుటుంబాలు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నట్లు తెలుస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి ఆదేశాలు ఇవ్వాలని నిరుపేదలు కోరుతున్నారు. ఆదేశాలు రాగానే ప్రారంభిస్తాం రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఆహార భద్రత కార్డుల జారీని నిలిపివేశాం. మళ్లీ మొదలు పెట్టాలని ఆదేశాలు వస్తే.. వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తాం. రెండు నెలల క్రితం వరకు ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో లేవు. ఒక్క మెదక్ జిల్లాలోనే క్లియర్‌గా ఉన్నాయి. ఇతర జిల్లాల్లో పది వేలు, అంతకు మించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. – సాధిక్, డీటీసీఎస్ -
రేషన్ బియ్యానికీ ఆధార్...
సాక్షి, గుంటూరు :జిల్లాలో ప్రతి నెలా మూడు నుంచి నాలుగు వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలుతోంది. విజిలెన్సు, పౌరసరఫరాల శాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. దీంతో ప్రభుత్వం ‘ఆధార్’ అనుసంధానాన్ని ఎంచుకుంది. రేషన్ కార్డులున్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్ నంబరును రేషన్ డీలర్ దగ్గరున్న ఈపీడీఎస్‌లో అనుసంధానం చేయించాలి. ఇలా ఆన్లైన్లో అనుసంధానం చేయని వారికి ఫిబ్రవరి నుంచి రేషన్‌బియ్యం పంపిణీ కష్టమేనని అధికారులు అంటున్నారు. బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెపుతున్నారు. జిల్లాలో మొత్తం 13,63,480 రేషన్ కార్డులున్నాయి. వీటి ద్వారా 43 లక్షల మంది నెలకు ఒక్కొక్కరూ నాలుగు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని పొందుతున్నారు. ప్రతి నెలా 16 వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు అందుతుంది. ఇందులో సుమారు మూడు నుంచి నాలుగు వేల క్వింటాళ్ల బియ్యం ప్రతి నెలా బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతుంది. అధికారులు దాడులు జరిపి కేసులు నమోదు చేస్తున్నా ఆయా డీలర్లు అక్రమాలను మానుకోవడం లేదు. చనిపోయిన, వలస వెళ్లిన వారి బియ్యాన్ని రేషన్‌డీలర్లు సులభంగా బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆధార్ అనుసంధానం ఒక్కటే సరైన మార్గమని ప్రభుత్వం భావించింది. ఇదే విషయాన్ని అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచించింది. దీంతో జిల్లా అధికారులు రేషన్ డీలర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆధార్ కార్డుల అనుసంధానం గురించి వివరించారు. ప్రతి కార్డుదారుడూ విధిగా కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లను ఈపీడీఎస్‌లో అనుసంధానం చేయించాల్సిందేనని రేషన్ డీలర్లు స్పష్టం చేస్తున్నారు. ఒక వేళ ఎవరైనా నిర్ణక్ష్యం కనబరిస్తే ఆయా వ్యక్తుల పేర్లు మీద బియ్యం పంపిణీ నిలిచిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు 69 శాతం మంది తమ ఆధార్ నంబరును డీలర్లకు అప్పగించారు. మిగిలిన వారంతా ఈ నెలాఖరులోగా ఆన్లైన్ అనుసంధానం చేయించుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రవితేజ నాయక్ సూచిస్తున్నారు. ఏఏవై, అన్నపూర్ణ కార్డుదారులు కూడా.. కాగా జిల్లాలోని అంత్యోదయ అన్నయోజన, అన్నపూర్ణ కార్డుదారులు కూడా ఆధార్ నంబరును ఆన్లైన్లో అనుసంధానం చేయించుకోవాల్సి ఉంది. ఈ విషయంలో రేషన్డీలర్లే కార్డుదారులకు సరైన అవగాహన కలిగించాలని జిల్లా అధికారులు తెలియజేస్తున్నారు. ఆన్లైన్ అనుసంధానం జరిగితేనే బయోమెట్రిక్ సిస్టం ద్వారా ముందు ముందు బియ్యం పంపిణీ చేయడం సులభతరమవుతుందని అంటున్నారు. -
ఆధార్‌ను ఈపీడీఎస్‌కు అనుసంధానం చేయండి
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, న్యూస్‌లైన్: ఆధార్ కార్డు నెంబర్‌ను వారంలోగా ఈపీడీఎస్ (ఎలక్ట్రానిక్ పబ్లిక్ డెలివరీ సిస్టం)కు అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లయి డిప్యూటీ డెరైక్టర్ రాథోడ్ ఆదేశించారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈపీడీఎస్పై డిప్యూటీ తహశీల్దార్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. సివిల్ సప్లయ్ శాఖ ద్వారా లబ్ధిదారులకు అం దుతున్న రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ విధానం ప్రవేశపెట్టిందన్నారు. ఈపీడీఎస్‌కు ఆధార్ కా ర్డు నెంబర్‌ను అనుసంధానం చేయడం ద్వారా ప్రతి లబ్ధిదారుడికి సరుకులు అందుతాయన్నారు. సరుకుల పంపిణీ, లబ్ధిదారులు, స్టాకు వివరాలు ఎప్పటికప్పుడు ఈ విధానం ద్వారా తెలుస్తాయన్నారు. ఈపీడీఎస్ విధానాన్ని మొ దట ప్రయోగాత్మకంగా తూర్పుగోదావరి, హైదరాబాద్ జిల్లాల్లోని 45 రేషన్ దుకాణాల్లో అమలు చేసినట్లు వివరించారు. ఆయా జిల్లా ల్లో విజయవంతమైనందున రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆధార్ కార్డు నెంబర్‌ను ఈపీడీఎస్‌కు అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని కోరారు. కొన్ని జిల్లా లో చాలా మంది ఆధార్ కార్డులు దిగలేదని, వారి కోసం నెల 19 నుంచి ప్రత్యేకంగా కేంద్రా లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు ఆధార్ నెంబర్‌ను ఈపీడీఎస్‌కు అనుసంధానం చేసే విధానంపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ట్రైనింగ్ అధికారి డి.శ్రీనివాస్, సివిల్ సప్లయి అధికారి సయ్యద్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు.