రేషన్ బియ్యానికీ ఆధార్...
Published Fri, Jan 17 2014 2:08 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
సాక్షి, గుంటూరు :జిల్లాలో ప్రతి నెలా మూడు నుంచి నాలుగు వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలుతోంది. విజిలెన్సు, పౌరసరఫరాల శాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. దీంతో ప్రభుత్వం ‘ఆధార్’ అనుసంధానాన్ని ఎంచుకుంది. రేషన్ కార్డులున్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్ నంబరును రేషన్ డీలర్ దగ్గరున్న ఈపీడీఎస్‌లో అనుసంధానం చేయించాలి. ఇలా ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయని వారికి ఫిబ్రవరి నుంచి రేషన్‌బియ్యం పంపిణీ కష్టమేనని అధికారులు అంటున్నారు. బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెపుతున్నారు. జిల్లాలో మొత్తం 13,63,480 రేషన్ కార్డులున్నాయి.
వీటి ద్వారా 43 లక్షల మంది నెలకు ఒక్కొక్కరూ నాలుగు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని పొందుతున్నారు. ప్రతి నెలా 16 వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు అందుతుంది. ఇందులో సుమారు మూడు నుంచి నాలుగు వేల క్వింటాళ్ల బియ్యం ప్రతి నెలా బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతుంది. అధికారులు దాడులు జరిపి కేసులు నమోదు చేస్తున్నా ఆయా డీలర్లు అక్రమాలను మానుకోవడం లేదు. చనిపోయిన, వలస వెళ్లిన వారి బియ్యాన్ని రేషన్‌డీలర్లు సులభంగా బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆధార్ అనుసంధానం ఒక్కటే సరైన మార్గమని ప్రభుత్వం భావించింది. ఇదే విషయాన్ని అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచించింది.
దీంతో జిల్లా అధికారులు రేషన్ డీలర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆధార్ కార్డుల అనుసంధానం గురించి వివరించారు. ప్రతి కార్డుదారుడూ విధిగా కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లను ఈపీడీఎస్‌లో అనుసంధానం చేయించాల్సిందేనని రేషన్ డీలర్లు స్పష్టం చేస్తున్నారు. ఒక వేళ ఎవరైనా నిర్ణక్ష్యం కనబరిస్తే ఆయా వ్యక్తుల పేర్లు మీద బియ్యం పంపిణీ నిలిచిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు 69 శాతం మంది తమ ఆధార్ నంబరును డీలర్లకు అప్పగించారు. మిగిలిన వారంతా ఈ నెలాఖరులోగా ఆన్‌లైన్ అనుసంధానం చేయించుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రవితేజ నాయక్ సూచిస్తున్నారు.
ఏఏవై, అన్నపూర్ణ
కార్డుదారులు కూడా..
కాగా జిల్లాలోని అంత్యోదయ అన్నయోజన, అన్నపూర్ణ కార్డుదారులు కూడా ఆధార్ నంబరును ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయించుకోవాల్సి ఉంది. ఈ విషయంలో రేషన్‌డీలర్లే కార్డుదారులకు సరైన అవగాహన కలిగించాలని జిల్లా అధికారులు తెలియజేస్తున్నారు. ఆన్‌లైన్ అనుసంధానం జరిగితేనే బయోమెట్రిక్ సిస్టం ద్వారా ముందు ముందు బియ్యం పంపిణీ చేయడం సులభతరమవుతుందని అంటున్నారు.
Advertisement
Advertisement