ఆధార్ లేకుంటే బియ్యం కట్ | with out aadhar card Rice cut | Sakshi
Sakshi News home page

ఆధార్ లేకుంటే బియ్యం కట్

Published Thu, Jan 16 2014 3:45 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM

with out aadhar card Rice cut

రేషన్ బియ్యం దొడ్డిదారి పట్టకుండా సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా రేషన్‌కార్డులకు ఆధార్ నంబర్ అనుసంధానం ప్రక్రియ మొదలు పెట్టింది. రేషన్ కార్డులో నమోదైన వారి ఆధార్ నంబర్లు ఈనెలాఖరు లోగా అధికారులకు అందజేయాల్సిందే. లేకుంటే వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రేషన్ బియ్యం పంపిణీలో కోత పెడతారు. ఈ పీడీఎస్ (ఎలక్ట్రానిక్
 ప్రజా పంపిణీ వ్యవస్థ)లో ఆధార్ నంబర్ సీడింగ్ అయిన వ్యక్తులకే బియ్యం అందజేస్తారు.
 
 సాక్షి, నల్లగొండ: కిలో బియ్యంపై సర్కారు రూ.20 నుంచి రూ.25వరకు సబ్సిడీ భరిస్తోంది. వీటిని నిరుపేదలకు రేషన్ ద్వారా రూపాయికి కిలో చొప్పున అందజేస్తున్న విషయం తెలిసిందే. త ద్వారా కిలో బియ్యం అమ్మకం ద్వారా సర్కారుపై రూ.20కు పైబడి భారం పడుతోంది. జిల్లాలో 9లక్షలకు పైచిలుకు రేషన్‌కార్డులు ఉన్నాయి.
 
 ఈ కార్డుల్లో నమోదైన ప్రతి లబ్దిదారుడూ తమ ఆధార్ నంబర్‌ను రేషన్ డీలర్‌కు అందజేయాలి. దాదాపు నెలన్నరగా ఈ ప్రక్రియ సాగుతోంది. ఆయా కార్డుల్లో 30.90లక్షల మంది సభ్యులు నమోదయ్యారు. ఇందులో ఇప్పటివరకు 23.27లక్షల మంది తమ ఆధార్ నంబర్‌ను రేషన్ డీలర్‌కు అందజేశారు. తిరస్కరణకు గురైన 48వేలతోపాటు ఇంకా అనుసంధానం చేయాల్సిన వారు ఏడు లక్షల పైబడి ఉన్నారు. వీరంతా ఈ నెలాఖరులోగా తమ ఆధార్ నంబర్‌ను రేషన్ డీలర్లకు అప్పగించాలి.
 
 ఎందుకిలా....?
 జిల్లాలో మొత్తం 9లక్షల93వేల 572 రేషన్‌కార్డులున్నాయి. ఇందులో తెల్లవి 9లక్షల 21వేల572, గులాబీవి 72వేలు. తెల్లకార్డు ఉన్న కుటుంబాలన్నింటికీ ప్రతినెలా 14వేల టన్నుల బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేస్తున్నారు. ఇందులో దాదాపు 3వేల టన్నుల బియ్యం పక్కదారి పడుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో కుటుంబం వేర్వేరుచోట్ల కార్డులు కలిగి ఉండడం, చనిపోయిన వ్యక్తుల పేర్లు కార్డు నుంచి తొలగించకపోవడం, వలస వెళ్లడం, పెళ్లి తర్వాత మరో కార్డు పొందడం తదితర కారణాల వల్లే ఒకే లబ్ధిదారునికి రెండుసార్లు బియ్యం అందజేస్తున్నారు.
 
 అంతేగాక కొందరి కార్డులు డీలర్ల వద్దే ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ బియ్యాన్ని డీలర్లే కాజేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క కార్డుదారులు సైతం తమకిచ్చిన బియ్యాన్ని అధిక ధరకు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. పేద ల కడుపు నింపాల్సిన బియ్యంతో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది. ఫలితంగా కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది. దీనికి చెక్ పెట్టడానికి ఈ విధానాన్ని ప్రభుత్వం ఎంచుకుంది.
 
 ఈపీడీఎస్‌లో నమోైదె తేనే..
 రేషన్ డీలర్లకు అందజేసిన ఆధార్ నంబర్‌తో పాటు ప్రతికార్డులో నమోదైన వ్యక్తి వివరాలు సమగ్రంగా ఈపీడీఎస్‌లో నమోదు చేస్తారు. ఈపీడీఎస్‌లో నమోదైన వ్యక్తులకు మాత్రమే వచ్చేనెల నుంచి రేషన్ పంపిణీ చేస్తారు. లేకుంటే ఎట్టిపరిస్థితుల్లో బియ్యానికి కార్డుదారులు నోచుకోనట్లే. ఇప్పటివరకు 75శాతం మంది ఆధార్ నంబర్‌ను డీలర్లకు అప్పగించారు. మిగిలిన 25 శాతం మంది నుంచి సేకరించడానికి అధికారులు కసరత్తు చే స్తున్నారు. మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే జిల్లా కాస్త మెరుగ్గా ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలు వరుస మూడు స్థానాల్లో ఉండగా.. జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది.
 
 బియ్యంలో కోత ఇలా...
 ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నారనుకుంటే. ఇందులో నలుగురు సభ్యుల ఆధార్ నంబర్లు మాత్రమే రేషన్ డీలర్లకు అందజేస్తే.. వీరి వివరాలు అధికారులు ఈపీడీఎస్‌లో నమోదు చేస్తారు. ఒక్కో వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున నమోదైన నలుగురు వ్యక్తులకు 16 కిలోలు మాత్రమే ఆ కార్డుదారునికి అందజేశారు. ఆధార్ కార్డు వివరాలు అందజేయని మరో వ్యక్తికి నాలుగు కిలోల బియ్యం కోత పెడతారు. ఇలా ఆధార్ నంబర్ అందజేయని ప్రతి ఒక్కరికీ ఫిబ్రవరి నుంచి బియ్యం పంపిణీ నిలిపివేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement