అడవిబిడ్డల ఆకలి కేకలు
ఆత్మకూరు : అడవిని నమ్ముకుని జీవిస్తున్న అడవి బిడ్డలు కడుపులు మాడ్చుకుని ఆకలితో తల్లడిల్లుతున్నారు. ప్రభుత్వం ప్రతి పథకానికి ఆధార్ కార్డు నమోదును ప్రవేశపెట్టడంతో ఈ కార్డు అంటేనే తెలియని గిరిజనులకు రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు కట్ అయ్యాయి. జిల్లాలోని దాదాపు 40 చెంచుగూడాలకు చెందిన 850 కుటుంబాలకు చెందిన గిరిజనులకు ఆధార్ లింక్ పుణ్యమా అని చౌకదుకాణాలలో సరుకులు నిలిచిపోయాయి. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఐదు నెలలు గడుస్తున్నా వీరికి ఆధార్ గాని, బియ్యం పంపిణీ చేసే నాథుడు గాని లేడు.
చౌక డిపోల ద్వారా ప్రభుత్వం పేదలకు అందించే నిత్యావసర సరుకులు గిరిజన గూడెంలో కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రతి గిరిజన కుటుం బానికి 35 కిలోల బియ్యం ఇచ్చేవారు. దీంతో గిరి జనులు మూడు పూటలా వండుకుని కొంత కడుపును నింపుకునే వారు. అయితే అధార్ అందించలేదని వీరికి బియ్యంతోపాటు సరుకులు ఇవ్వడం మానేశారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే చెంచులు ఆత్మకూరు పట్టణానికి చేరుకుని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ‘‘అయ్యా, దొర... మాకు బియ్యం లేవు. కిరోసిన్ లేదు. చక్కర అంటే అసలు మాకు తెలియదు.
మాకు పూట గడవడం లేదు కాస్త బియ్యం ఇచ్చి పుణ్యం కట్టుకోండి’’ అంటూ వేడుకున్నారు. అయినా అధికారులు స్పందించలేదు. దీంతో అడవికి వెళ్లి ఫలసేకరణ చేసి వాటిని విక్రయించి వచ్చిన సొమ్ముతో ఆత్మకూరు తదితర పట్టణాలలో నిత్యావసర వస్తువులైన బియ్యం, ఉప్పు, కారం, పప్పులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయితే అడవిలో ఫల సేకరణకూ అటవీశాఖ అధికారులు పలు ఆంక్షలు విధిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా అడవిలోనే సంచరిస్తున్న వీరు.. జిగురు, ఫలసేకరణతో పాటు షర్బత్ గడ్డలు, ఇతర వనమూలికలను సేకరించి వాటిని విక్రయించేవారు. అయితే ఇటీవల ఫారెస్ట్ అధికారులు అడవిలోకి వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో వీరు జీవనోపాధిని కోల్పోతున్నారు.
పస్తులుంటున్నాం
రేషన్ బియ్యం వేయడం లేదు. దీంతో అడవిలో లభించే కందగడ్డలు తింటూ జీవనం సాగిస్తున్నాం. అవీ దొరకని పక్షంలో పస్తులుంటున్నాం. మాకు కడుపు నిండా అన్నం పెట్టేందుకు ఎవరూ సాయం చేయడం లేదు. వచ్చే బియ్యాన్ని రాకుండా చేశారు. మాకు వెంటనే బియ్యం పంపిణీ చేయాలి.
ఉత్తలూరి ఈదన్న
అధికారులు స్పందించాలి
బియ్యం కావాలని అధికారుల చుట్టూ పదిసార్లు తిరిగినా స్పందించ లేదు. నెలల తరబడి బియ్యం లేకపోవడంతో పిల్లాజల్లా అంతా ఆకలితో బాధపడుతున్నాం. అధికారులు స్పందించి వెంటనే బియ్యం పంపిణీ చేయాలి.
లింగమ్మ