Europeans
-
అమ్మో అందాల రాక్షసి : 650 మందిని చంపి వాళ్ల రక్తంతో
ప్రతి ఒక్కరు స్లిమ్ గా, చక్కటి గ్లోతో మెరిసి పోవాలని అనుకుంటారు. అందుకే తాము అభిమానించే హీరోలు, హీరోయిన్లు అందం కోసం వాడే బ్రాండెడ్ క్రీమ్స్ ను అప్లయ్ చేసి ఎదుటి వారికి తమని తాము అందంగా చూపించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. మరికొంత మంది యూట్యూబ్ వీడియోలు చూసి రకరకాల రెసిపీలను ట్రై చేస్తుంటారు. అది కూడా సాధ్యపడకపోతే చివరికి అరే వాళ్లకంటే మనం బాగున్నాం అంటూ వారికి వారు సర్ధి చెప్పుకుంటుంటారు. ఇప్పుడంటే ఇలా ఉంటే పూర్వం అందం కోసం మనిషి రక్తంలో స్నానం చేసేవారు. ముఖ్యంగా 16వ శతాబ్ధానికి చెందిన రాణులు వారి ఆస్థానంలో పెద్దలు చెప్పినట్లు అందం కోసం చిత్ర విచిత్రమైన పనులు చేసేవారు. అందులో కొన్ని పనులు అత్యంత దారుణంగా ఉండేవి. ఎలిజిబెత్ బాతోరి ప్రపంచంలో అంత్యత ప్రమాదకరమైన రాణి. ప్రస్తుతం యూరప్ దేశాల్లో ఓ భాగమైన హంగేరి దేశంలో హంగేరియన్ రాజకుటుంబానికి చెందిన రాణి ఈ ఎలిజిబెత్ బాతోరి. హంగేరిలో ఓ రాజ్యాన్ని పరిపాలించేది. ఆమెకు అందంగా ఉండడం అంటే మహా పిచ్చి. ఆ అందం కోసం 1585 నుండి 1610 సంవత్సరం మధ్య కాలంలో పెళ్లికాని 650 మంది యువతుల్ని చంపేసింది. రాణి కావడంతో తన రాజభవనంలో పనిచేసేందుకు పెళ్లికాని యువతుల్ని ఆహ్వానించేది. పనిపేరుతో వారిని చంపేసి వారి రక్తంతో స్నానం చేసేది. ఎలిజిబెత్ బాతోరికి తనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఎవరో చెప్పారట. పెళ్లికాని యువతుల రక్తంతో స్నానం చేస్తే అందంగా కనిపిస్తారని. అదిగో అప్పటి నుండి పెళ్లికాని యువతుల్ని పనికి పిలిపించి హత్యలు చేసింది. ఆమెకు మరో ఆరుగురు సహకరించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. అంతమందిని హత్య చేస్తుంటే ఎవరు పట్టించుకోలేదా అంటే ఆమె అసలే రాణి. ఎవరు ప్రశ్నిస్తారు. అయితే చివరికి పాపం పండింది. ఎలిజిబెత్ దగ్గర పనిచేసే సుసన్నా అనే సేవకురాలు బయటపెట్టడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. 1610లో ఆమెకు కోర్ట్ జీవిత ఖైదు విధించింది. రాణి తన పలుకుబడితో ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ బాతోరి పై హంగేరియన్ కు చెందిన డైరక్టర్ జురాజ్ జకుబిస్కో హాలీవుడ్ లో బాతోరి (కౌంట్ నెస్ ఆఫ్ బ్లడ్ ) పేరుతో సినిమా తెరకెక్కించారు. 10మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ చిత్రం 2008 జులై 10న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. -
బతుకే ఒక బదిలీ...
ప్రాణప్రదంగా పెంచుకున్న మొక్కలను వదిలి వెళ్లిపోవాలి. పాశం పెంచుకున్న పరిసరాలను వదిలి వెళ్లిపోవాలి. అక్కా ఎలా ఉన్నావు? అని అడిగే పక్క ఫ్లాట్ ఆత్మీయురాలిని వదిలి వెళ్లిపోవాలి. ఇంతకాలం కలిసి వాకింగ్ చేసిన కింద ఫ్లాట్ బాబాయిని వదిలి వెళ్లిపోవాలి. సెక్షన్లో తోటి ఉద్యోగులను వదిలి వెళ్లిపోవాలి. లంచ్ టైంలో కూరను షేర్ చేసే మిత్రులను వదిలి వెళ్లిపోవాలి. కానీ వెళ్లక తప్పదు. ఎందుకంటే - బతుకంటే బదిలీయే కదా! మహా విజేత చంఘిజ్ ఖాన్ తన వృద్ధాప్యంలో ఆస్థాన వైద్యులందరినీ పిలిచి ఒక కోరిక కోరాడు- ‘నాకు చనిపోవాలని లేదు... చిరంజీవత్వాన్ని ప్రసాదించండి... అందుకు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.’ నిజమే. చంఘిజ్‌ఖాన్ దగ్గర వేల కొలది మైళ్ల భూమి ఉంది. లక్షల కొలది గుర్రాలు ఉన్నాయి. వందల ఐరావతాల ఎత్తు ధనం ఉంది. అతడు ఏం కావాలన్నా అది ఎవరికైనా ఇవ్వగలడు. మృత్యువును దూరం చేస్తే ఏం చేయమన్నా చేయగలడు. కాని మృత్యువును ఆపగలరా ఎవరైనా? ‘చక్రవర్తీ... నువ్వు మా తల ఉత్తరిస్తానన్నా సరే... మేము సత్యం పలుకక తప్పదు... నీ మృత్యువు ఆగదు... శరీరం శైథిల్యం అయ్యాక మరణంలోకి జన్మ బదిలీ కాక తప్పదు’ అని జవాబు చెప్పారు వైద్యులు. అదే సత్యం. జీవితంలో బదిలీయే సత్యం. పురాణాల్లో యయాతీ తన వృద్ధాప్యం తీసుకొని యవ్వనాన్ని ఇవ్వమని కుమారులని కోరాడు. ఇద్దరు కుమారులు ఇవ్వము అని అంటే మూడో కుమారుడు తండ్రి వృద్ధాప్యాన్ని తీసుకుని తన యవ్వనాన్ని ఇచ్చాడు. అయినంత మాత్రాన యయాతీ ఆయుష్మంతుడిగా మిగిలిపోలేదు. బదిలీ లేని బతుకులోని బోర్డమ్ను తట్టుకోలేక తపస్సులో జారుకొని మోక్షం పొందాడు. పూత పిందెలోకి పిందె కాయలోకి కాయ ఫలంలోకి ఫలం ఆకొన్నవాడి జీర్ణాశయంలోకి బదిలీ కావాల్సిందే. ఇది నియమం. భూమి పన్నెండు గంటలు ఇటు పగలు. ఆ తర్వాత రాత్రిలోకి బదిలీ కావాల్సిందే. ఎండలు నాలుగు నెలలు అటూ ఇటూ. ఆ తర్వాత వర్షంలోకి బదిలీ కావాల్సిందే. మేఘం నడినెత్తిన కాసేపు. ఆ తర్వాత దూరతీరాలకు బదిలీ కావాల్సిందే. మానవ నాగరికత అంతా బదిలీ పైనే ఆధారపడి ఉంది. నదులను వెతుక్కుంటూ నిప్పును వెతుక్కుంటూ పంటకు యోగ్యమైన మైదానాలను వెతుక్కుంటూ పశువుల గ్రాసానికి పుష్కలమైన అడవులను వెతుక్కుంటూ మానవజాతి ఒక చోట నుంచి మరోచోటుకు బదిలీ అవుతూ మానవ నాగరికతను నిర్మించింది. పరిణామక్రమాన్ని కొనసాగించింది. కదలికనే పురోగతిగా వ్యాఖ్యానించింది. ప్రపంచాన్ని ఏలాలని బయలుదేరిన అలెగ్జాండర్ ఎంత దూరం ప్రయాణం చేసినా ఆ తర్వాత చివరకు వెనుకకు మరలక తప్పలేదు. దండయాత్రలు సాగించిన యూరోపియన్లు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లక తప్పలేదు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి ఇవాళ ఇంగ్లిష్ వాళ్లు ‘మేము- మా బ్రిటన్’ వరకూ ఆగిపోక తప్పడమూ లేదు. ఈ బదిలీ కొన్నాళ్లు... ఆ బదిలీ కొన్నాళ్లు... ఇంతే చరిత్ర. చిన్నప్పటి స్నేహితులు పై తరగతులకు బదిలీ అవుతున్నప్పుడు చెదిరిపోతారు. కాలేజ్‌లో తోడుగా కూల్‌డ్రింక్ పంచుకున్న మిత్రులు కెరీర్లో బదిలీ అవుతున్నప్పుడు చేయి విడిచేస్తారు. ఉద్యోగాల్లో ఏళ్ల తరబడి పక్క సీట్లో కూర్చున్న కలీగ్స్ ఉద్యోగం బదిలీ అవుతున్నప్పుడు ఏదో ఊళ్లో ఏదో సెక్షన్లో మనల్ని మర్చిపోతారు. ఉంటున్న ఇంటిపై మమకారం, చేస్తున్న ఆఫీస్‌పై మమకారం, వాసం ఉంటున్న ఈ దేహంపై మమకారం మనిషి పెంచుకున్నవే. ప్రకృతి అది శాశ్వతం అని చెప్పలేదు. చెప్పదు. ఈ ఇల్లు కాకపోతే మరో ఇల్లు. ఈ ఆఫీస్ కాకపోతే మరో ఆఫీస్. ఈ దేహం కాకపోతే మరుజన్మలో మరో దేహం. దేవుడే ఒక అవతారం చాలించి మరో అవతారానికి బదిలీ అవుతున్నప్పుడు మనిషి ఎంత? మనిషి కోరుకునే శాశ్వతత్వాల ఉనికి ఎంత? చెన్నై మెరీనా బీచ్ బాగుంటుంది. వదిలేయాల్సి వస్తే వదలాల్సిందే. హైదరాబాద్ హుసేన్ సాగర్ చాలా బాగుంటుంది. వీడ్కోలు పలకాల్సి వస్తే వీడ్కోలు పలకాల్సిందే. ఇవాళ బెజవాడ. సరే. రేపు కాకినాడ.. ఓకే. ఈ సంవత్సరం ఈ పిల్లలకు పాఠాలు. వచ్చే సంవత్సరం మరో బ్యాచ్‌కు బోధనలు. పాలవాడు మారతాడు. పేపర్‌వాడు మారతాడు. పనమ్మాయి మారుతుంది. మన పిల్లలే మనతో ఉండకుండా హాస్టల్స్‌కి అమెరికాకి లేదంటే పెళ్లిళ్లై వేరుకాపురాల్లోకి బదిలీ అయి వెళ్లిపోతూ ఉంటారు. బదిలీయే అందం. అదే చందం. మరి మొగుడూ పెళ్లాలు? కొత్త ఒక అందం. అక్కడి నుంచి అనురాగం పెరగడం ఒక అందం. వయసు పెరిగేకొద్దీ ఒకరికి మరొకరు అలవాటు పడటం ఒక అందం. ముంగురులు తెల్లబడ్డాక ఒకరి తప్పొప్పులతో సహా మరొకరు అంగీకరించే స్థితికి చేరుకోవడం ఒక అందం. చివరి రోజుల్లో జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ పార్క్‌లో వాకింగ్ చేస్తూ ఉండటం అందాతి అందం. కేవలం కొత్త పెళ్లి జంటగా ఉంటే ఎంత బోర్? కొత్త జంట తల్లిదండ్రులుగా బదిలీ కావడమే అందం. భోజనం శక్తిగా శక్తి ఆలోచనగా ఆలోచన ఆచరణగా ఆచరణ ఫలితంగా బదిలీ కావడమే ప్రకృతి.జీవితం ఘట్టాలుగా ఘట్టాలు దశలుగా దశలు చరమాంకంగా బదిలీ కావడమే ప్రకృతి. మనిషి ప్రకృతిలో భాగం. మనిషి బదిలీలో భాగం. బదిలీని స్వీకరించి ముందుకు సాగడమే మనిషి కర్తవ్యం. మనం చాలాకాలంగా పని చేస్తున్న ప్రదేశంతో, ఉద్యోగంతో ఒక బంధం ఏర్పడుతుంది. అది చాలా సహజం. అయితే కర్తవ్యం మనల్ని ఎటు తీసుకెళితే అటు వెళ్లాలి అని గుర్తు పెట్టుకోవాలి. మనం వెళ్లిన ప్రదేశంలో కూడా కొత్త జ్ఞాపకాలు ఏర్పడతాయి. వాటి నేపథ్యంలో వాటంతట అవే క్రమేణా పలచబారతాయి. మన జ్ఞాపకాలను బలవంతంగా మరచిపోవడానికి ప్రయత్నించకూడదు. దానివల్ల వాటిని మరచిపోవడం సాధ్యం కాదు. అయినా ఇవేమీ భయంకరమైన చేదు జ్ఞాపకాలేమీ కాదు కదా... బలవంతంగా మరచిపోవడానికి! దానికి బదులుగా మనం కొత్తగా మారిన చోటులో ఉండి కూడా గతంలో మనం కలిసి టీ తాగిన చోటు, స్నేహితులతో కబుర్లు చెప్పుకున్న ప్రదేశం, ఠ ంఛనుగా టిఫిన్ చేసే చోటు... వీటన్నింటినీ నెమరు వేసుకుంటూ ఉండాలి. వీలైతే డైరీలో రాసుకుని, వాటిని తరచు చదువుకుంటూ ఉండాలి. మన స్నేహితులతో ఫోన్ కాంటాక్ట్‌లో ఉంటూ ఉండాలి. ఇవేమీ అంతంత దూరాలు కూడా కావు కాబట్టి, వీలయినప్పుడల్లా కలుస్తూ ఉండాలి. అది ఎలా ఉండాలంటే మనం చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మలు, మేనత్తల ఊళ్లకు వెళ్లి, అక్కడ వేసవి సెలవులో, దసరా సెలవులో, సంక్రాంతి సెలవులో గడిపి వచ్చిన తర్వాత ఎలా నెమరు వేసుకుంటూ ఉంటామో, అలా ఉండాలన్నమాట. చాలాకాలం తర్వాత వాళ్లను తిరిగి కలిసినప్పుడు వాళ్లతో ఎలా ఉంటామో స్నేహితులను అలా కలవాలి, వారితో అలా గడపాలి. - కె. సువర్చల -
అద్దం పగిలితే... పాకెట్ చిరిగినట్టే... అట!
విశ్వాసం లోకంలో సత్యాలు, అసత్యాలు మాత్రమే కాదు, నమ్మకాలు కూడా ఉంటాయి. అసలు సత్యాన్ని బహువచనంలో చెప్పడమే పొరపాటని, దేశ కాలాలకు అతీతంగా సత్యం ఒకటే ఉంటుందనీ, అదే అంతిమమైనదనిన్నీ సత్యాన్వేషకులు ప్రవచిస్తుంటారు. అదేమిటో పూర్తిగా అర్థమై చావదు కాబట్టి, దానినలా వదిలేద్దాం. ఇక అసత్యాల గురించి చెప్పాలంటే ఒక జన్మ సరిపోదు. సగటు మనిషికి సత్యాసత్యాలతో పెద్దగా నిమిత్తం లేదు. నడిసంద్రమున నావ లాంటి జీవితాలు గడిపే వారికి నమ్మకాలే పెద్ద ఆధారం. ⇒ మేధావులు వాటికి ముద్దుగా ‘మూఢ’ విశేషణాన్ని చేర్చినప్పటికీ, సామాన్యుల జీవనాన్ని ప్రభావితం చేసేవి నమ్మకాలే! ప్రపంచవ్యాప్తంగా అనాదిగా కొనసాగుతున్న కొన్ని సుప్రసిద్ధ నమ్మకాల గురించి ముచ్చటించుకుందాం... ⇒ ఆదివారం అమావాస్య చాలా అరుదుగా వస్తుంది. ఆ రోజు పిశాచాలు నిద్రలేస్తాయని నమ్ముతారు. ఆదివారం అమావాస్య అర్ధరాత్రి క్షుద్రపూజలు చేసేవారికి పండగేనని మన దేశంలో వ్యవహారంలో ఉన్న అభిప్రాయం. ⇒ ఏ నెలలోనైనా శుక్రవారం 13వ తేదీన వస్తే క్రైస్తవులు దానిని దురదృష్టకరమైన రోజుగా భావిస్తారు. ఏసుక్రీస్తును శిలువ వేయడానికి ముందు రోజు రాత్రి విందులో (లాస్ట్ సప్పర్) పదమూడు మంది పాల్గొనడమే దీనికి కారణమని చెబుతారు. ⇒ పాశ్చాత్యులకు బ్రెడ్ ప్రధానమైన ఆహారం. బ్రెడ్‌ను తిరగేసి పట్టుకుంటే దురదృష్టం తప్పదని ఫ్రెంచి ప్రజలు నమ్ముతారు. తిరగేసి పట్టుకున్న బ్రెడ్‌ను ఇచ్చినా, పుచ్చుకున్నా అరిష్టమేనని వారి నమ్మకం. ⇒ పెళ్లి వేడుకల్లో పెళ్లికొడుకుకైనా, పెళ్లికూతురుకైనా కానుకలు చదివించేటప్పుడు జతగా ఉండే వస్తువులనే చదివించడం వియత్నాంలో ఆనవాయితీ. నవదంపతులలో ఎవరికి కానుకలు చదివించినా, దుప్పట్లయినా, కంచాలైనా... ఏవైనా జతగా ఉండే వస్తువులనే చదివించాలని, లేకుంటే అరిష్టమని వియత్నాం ప్రజల నమ్మకం. ⇒ ఈలవేసి గోల చేయడాన్ని మనం మామూలుగా ఆకతాయి చేష్టగా కొట్టి పారేస్తాం. అయితే, రాత్రివేళ ఈలవేస్తే దయ్యాలను పిలుస్తున్నట్లు చైనా ప్రజలు, పాములను రప్పించే ప్రయత్నంగా జపనీయులు భావిస్తారు. ⇒ మన జీవితంలో దాదాపు మూడోవంతు కాలాన్ని నిద్రలోనే గడిపేస్తాం. నిద్రపోయేటప్పుడు పడుకునే తీరుపై కూడా ప్రపంచంలో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఉత్తరదిశగా తలపెట్టి నిద్రించరాదనే నమ్మకం భారత్‌లోనే కాదు, జపాన్‌లోనూ చిరకాలంగా ఉంది. దీనికి శాస్త్రీయమైన వివరణ కూడా ఉంది. ⇒ నల్లపిల్లి చుట్టూ అల్లుకున్న నమ్మకాలు చాలానే ఉన్నాయి. పైగా అవి ఒకదానికొకటి భిన్నమైనవి. బ్రిటన్ సహా పలు యూరోపియన్ దేశాల్లో నల్లపిల్లిని శుభశకునంగా పరిగణిస్తే, భారత్ వంటి ఆసియన్ దేశాల్లో దుశ్శకునంగా పరిగణిస్తారు. ⇒ దారిలో గుర్రపు నాడా దొరికితే అదృష్టంగా భావిస్తారు. గుర్రపు నాడాను కొనుక్కొని అయినా, దానితో ఉంగరం తయారు చేయించుకుని, వేలికి తొడుక్కుంటే దురదృష్టం తొలగిపోతుందని, శనిదోష నివారణ జరుగుతుందని మన దేశంలో చాలామంది నమ్ముతారు. ⇒ నిచ్చెన కింద నుంచి నడిచి వెళితే దురదృష్టం తప్పదని యూరోపియన్లు నమ్ముతారు. నిచ్చెనను గోడకు చేరవేసి, నిలబెట్టినప్పుడు ఆ ఆకారం పిరమిడ్‌ను తలపిస్తుంది. అలాగే నిచ్చెన కింద నిలుచుంటే ప్రేతాత్మలు మేలుకుంటాయని ఈజిప్షియన్లు భావిస్తారు. ⇒ పగిలిన అద్దంలో ముఖాన్ని చూసుకుంటే దురదృష్టం వెంటాడుతుందనే నమ్మకం మనదేశంలోనే కాదు, చాలా చోట్ల ఉంది. ఇంట్లో ఉన్న అద్దం అనుకోకుండా పగిలిపోతే, అప్పటి నుంచి దుర్దినాలు ప్రారంభమైనట్లేనని కొన్ని దేశాల్లో భావిస్తారు. ఆర్థిక నష్టాలు కలుగుతాయని, దరిద్రం వెంటాడుతుందని నమ్ముతారు. ⇒ పీడకలలు వెంటాడుతుంటే, దిండుకింద చాకు లేదా కత్తెర ఉంచుకుంటారు. ఈ నమ్మకం మన దేశంలో కొన్నిచోట్ల ఇప్పటికీ ఉంది. ⇒ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఎవరైనా తుమ్మితే దురదృష్టంగా భావిస్తారు. అలాగే, ఏదైనా పని మీద బయటకు బయలు దేరుతుంటే, ఎవరైనా వెనక్కు పిలిచినా దురదృష్టం తప్పని నమ్ముతారు. ఇంటి నుంచి బయలుదేరాక తిరిగి వెనక్కు వెళ్తే, ఆ పని జరగదంటారు. ⇒ చైనాలో ‘4’ అంకెను దురదృష్ట కరమైనదిగా భావిస్తారు. చివరకు ‘4’తో ఏర్పడే 14, 24 వంటి సంఖ్యలను కూడా. చైనా భాషలో నాలుగు, చావు పదాలు దాదాపు ఒకేలా వినిపించడమే ఈ నమ్మకానికి కారణం. -
ఆర్ట్ ప్రపంచాన్ని రక్షిస్తుంది!
- బోస్ కృష్ణమాచారి, చిత్రకారుడు ‘బినాలే’ అంటారు యూరోపియన్స్. ‘బైఏన్యువల్’ అంటారు అమెరికన్స్. ‘బినాలే’ ఒక మొక్కపేరు. విత్తిన రోజు నుంచి రెండేళ్లలోపు పుష్పించి ఫలించి అంతరిస్తుంది. అదేరోజున మళ్లీ మొలకెత్తడం ప్రారంభమవుతుంది. బినాలే అంటే రెండోళ్లకోసారి జరిగే కళల ఉత్సవం కూడా! ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 బినాలేలు సుప్రసిద్ధం. మన దేశంలో 2012లో కేరళలోని సముద్రతీర పట్టణం కోచిలో తొలి బినాలే ప్రారంభమై మూడు నెలలపాటు వైభవోజ్వలంగా జరిగింది. ‘కోచి ముజ్రిస్ బినాలే’ (కెఎంబి)గా విఖ్యాతమైంది. ఈ ‘కెఎంబి’ ఆర్ట్ డెరైక్టర్ బోస్ కృష్ణమాచారి ఇటీవల నగరానికి విచ్చేశారు. భారతదేశానికి తొలిసారిగా బినాలేను విజయవంతంగా పరిచయం చేసిన బోస్ కృష్ణమాచారితో ఇంటర్వ్యూ సారాంశం... మీ గురించి చెప్పండి... మాది కార్పెంటర్ కుటుంబం. చిన్నప్పటి నుంచి ‘రేఖ’ తెలుసు. చెక్కడం తెలుసు. డాక్టర్‌ను కావాలనుకున్నాను. టీనేజ్‌లో తీవ్రమైన జబ్బు చేసింది. కుటుంబం ఆర్థికంగా చితికి పోయింది. చచ్చిబతికిన మనిషిని కదా, కొత్తగా జీవించాలనుకున్నాను. ముంబై జేజే స్కూల్లో చేరాను. నైరూప్య చిత్రాలు, రూప చిత్రాలు, శిల్పాలు, ఇన్స్టలేషన్స్, భవనాల కళాకృతులు, డిజిటల్ ఇమేజెస్, డాక్యుమెంటరీలు... ఇష్టం వచ్చిన పని చేస్తుంటాను. ముంబైలో నివసిస్తున్నాను. ప్రపంచంలో ముఖ్యమైన మ్యూజియంలు, గ్యాలరీలు నా ఆర్ట్‌ను ఆదరిస్తున్నాయి. ఉపన్యాసాలకు ఆహ్వానిస్తుంటాయి. మీరు ఆర్ట్ కలెక్టర్ కూడా కదా... రియల్ ఎస్టేట్, బంగారం, షేర్లలో ఒడిదుడుకులను ఎవరూ అంచనా వేయలేరు. తెలివైన వారు ఆర్ట్‌లో పెట్టుబడి పెట్టి (ఆర్ట్ కలెక్టర్స్‌గా) బాగానే సంపాదిస్తున్నారు. సంపాదనలో అదొక ఉత్తమాభిరుచికి సంబంధించిన మార్గం. నా ధోరణి వేరు. నేను రెండు కారణాలతో కొంటాను. ఎదిగివస్తోన్న ఆర్టిస్ట్‌లను ప్రోత్సహించేందుకు కొంటాను. నాకు నచ్చిన ఆర్ట్ వర్క్‌ను కొంటాను. కానీ, అమ్మను. అవి అలానే ఉంటాయి, మంచి జ్ఞాపకాలను ఇస్తూ! ‘బినాలే’కు ముందూ వెనుకా చెప్పండి... మహారాష్ట్ర కల్చరల్ మినిస్టర్ నన్ను, కొందరు స్నేహితులను పిలిచి రాష్ట్రంలో విద్యావ్యాప్తికి కళాకారుల సహకారాన్ని కోరారు. నా మిత్రుల్లో కొందరు హిందీ సినీనటుల కంటే ఎక్కువగానే సంపాదిస్తారు. వారి పద్ధతుల్లో వారు సమాజానికి తిరిగి ఇస్తూనే ఉంటారు. వాస్తవానికి బిలియనీర్ కంటే పేద కళాకారుడే సమాజానికి ఎక్కువగా సహాయం చేస్తాడు. కళ ద్వారా కళాకారుడికి ఆదరణ, సమాజవికాసం, ఆర్ధికాభివృద్ధి పొందేందుకు బినాలేలు మార్గమని సూచించాం. 1895లో వెనిస్లో ప్రారంభమైన బినాలే దాదాపు 15 దేశాలను కళాత్మకంగా మార్చివేయడం గురించి వివరించాం. ఆ ఆలోచన కోచిలో బినాలేగా ఆచరణకు వచ్చింది. మిత్రులం ప్రపంచ దేశాల బినాలే నిర్వాహకులను, మ్యూజియం క్యూరేటర్లను సంప్రదించాం. స్థానిక, జిల్లా, రాష్ట్ర,కేంద్ర సాంస్కృతిక విభాగాలను కదిలించాం. ‘సెలబ్రిటీలతో విందుకు ఇరవై ఐదువేలరూపాయలు’ ద్వారా కొన్ని లక్షల ఆదాయాన్ని సమకూర్చాం. టాటా, జిందాల్, గూగుల్‌వంటి సంస్థల ద్వారా వారికీ లాభదాయకమైన రీతిలో నిధులు పొందాం. కోచిలోని ప్రతి వ్యక్తీ తన వంతు సేవలు అందించారు. ఫలితంగా భారతదేశంలో తొలి బినాలే సాధ్యమైంది. 23 దేశాలనుంచి 89 మంది ఆర్టిస్ట్‌లు వచ్చారు. చిత్రకారులు, శిల్పులు, ఇన్స్టలేటర్స్, ఫొటోగ్రాఫర్లు, డాక్యుమెంటరీ మేకర్స్ తమ కళారూపాలను ప్రదర్శించారు. నృత్యగీతాలు, నాటకాలతో సాయంకాలాలు ఆహ్లాదంగా మారాయి. కోచి కోట, ఎర్నాకుళం చుట్టుపక్కల 14 స్థలాలు సందర్శనీయాలయ్యాయి. 60 గ్యాలరీలు ఏర్పాటయ్యాయి. రోజూ 500 మంది ఇతర రాష్ట్రాల, విదేశీ టూరిస్ట్‌లు వచ్చారు. మొత్తం సందర్శకులు నాలుగు లక్షల మంది. బినాలే ముందు కోచీ వేరు తర్వాత వేరు. డిసెంబర్ 2014లో రెండవ బినాలేకు ‘కోచీ’ ముస్తాబవుతోంది! ఆర్టిస్ట్‌లకు మీ సలహా... ఎవ్వర్నీ అనుకరించకండి. వర్క్- వర్క్-వర్క్! నిరాశకు లోనుకాకండి. ఆర్ట్‌ను మీరు రక్షిస్తే అది మిమ్ములను, సమాజాన్నీ రక్షిస్తుంది! -పున్నా కృష్ణమూర్తి