మంచి అద్దంలో మాత్రమేముఖం చూసుకోవాలని చాలాదేశాల్లో నమ్ముతారు...
విశ్వాసం
లోకంలో సత్యాలు, అసత్యాలు మాత్రమే కాదు, నమ్మకాలు కూడా ఉంటాయి. అసలు సత్యాన్ని బహువచనంలో చెప్పడమే పొరపాటని, దేశ కాలాలకు అతీతంగా సత్యం ఒకటే ఉంటుందనీ, అదే అంతిమమైనదనిన్నీ సత్యాన్వేషకులు ప్రవచిస్తుంటారు. అదేమిటో పూర్తిగా అర్థమై చావదు కాబట్టి, దానినలా వదిలేద్దాం. ఇక అసత్యాల గురించి చెప్పాలంటే ఒక జన్మ సరిపోదు. సగటు మనిషికి సత్యాసత్యాలతో పెద్దగా నిమిత్తం లేదు. నడిసంద్రమున నావ లాంటి జీవితాలు గడిపే వారికి నమ్మకాలే పెద్ద ఆధారం.
⇒ మేధావులు వాటికి ముద్దుగా ‘మూఢ’ విశేషణాన్ని చేర్చినప్పటికీ, సామాన్యుల జీవనాన్ని ప్రభావితం చేసేవి నమ్మకాలే! ప్రపంచవ్యాప్తంగా అనాదిగా కొనసాగుతున్న కొన్ని సుప్రసిద్ధ నమ్మకాల గురించి ముచ్చటించుకుందాం...
⇒ ఆదివారం అమావాస్య చాలా అరుదుగా వస్తుంది. ఆ రోజు పిశాచాలు నిద్రలేస్తాయని నమ్ముతారు. ఆదివారం అమావాస్య అర్ధరాత్రి క్షుద్రపూజలు చేసేవారికి పండగేనని మన దేశంలో వ్యవహారంలో ఉన్న అభిప్రాయం.
⇒ ఏ నెలలోనైనా శుక్రవారం 13వ తేదీన వస్తే క్రైస్తవులు దానిని దురదృష్టకరమైన రోజుగా భావిస్తారు. ఏసుక్రీస్తును శిలువ వేయడానికి ముందు రోజు రాత్రి విందులో (లాస్ట్ సప్పర్) పదమూడు మంది పాల్గొనడమే దీనికి కారణమని చెబుతారు.
⇒ పాశ్చాత్యులకు బ్రెడ్ ప్రధానమైన ఆహారం. బ్రెడ్‌ను తిరగేసి పట్టుకుంటే దురదృష్టం తప్పదని ఫ్రెంచి ప్రజలు నమ్ముతారు. తిరగేసి పట్టుకున్న బ్రెడ్‌ను ఇచ్చినా, పుచ్చుకున్నా అరిష్టమేనని వారి నమ్మకం.
⇒ పెళ్లి వేడుకల్లో పెళ్లికొడుకుకైనా, పెళ్లికూతురుకైనా కానుకలు చదివించేటప్పుడు జతగా ఉండే వస్తువులనే చదివించడం వియత్నాంలో ఆనవాయితీ. నవదంపతులలో ఎవరికి కానుకలు చదివించినా, దుప్పట్లయినా, కంచాలైనా... ఏవైనా జతగా ఉండే వస్తువులనే చదివించాలని, లేకుంటే అరిష్టమని వియత్నాం ప్రజల నమ్మకం.
⇒ ఈలవేసి గోల చేయడాన్ని మనం మామూలుగా ఆకతాయి చేష్టగా కొట్టి పారేస్తాం. అయితే, రాత్రివేళ ఈలవేస్తే దయ్యాలను పిలుస్తున్నట్లు చైనా ప్రజలు, పాములను రప్పించే ప్రయత్నంగా జపనీయులు భావిస్తారు.
⇒ మన జీవితంలో దాదాపు మూడోవంతు కాలాన్ని నిద్రలోనే గడిపేస్తాం. నిద్రపోయేటప్పుడు పడుకునే తీరుపై కూడా ప్రపంచంలో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఉత్తరదిశగా తలపెట్టి నిద్రించరాదనే నమ్మకం భారత్‌లోనే కాదు, జపాన్‌లోనూ చిరకాలంగా ఉంది. దీనికి శాస్త్రీయమైన వివరణ కూడా ఉంది.
⇒ నల్లపిల్లి చుట్టూ అల్లుకున్న నమ్మకాలు చాలానే ఉన్నాయి. పైగా అవి ఒకదానికొకటి భిన్నమైనవి. బ్రిటన్ సహా పలు యూరోపియన్ దేశాల్లో నల్లపిల్లిని శుభశకునంగా పరిగణిస్తే, భారత్ వంటి ఆసియన్ దేశాల్లో దుశ్శకునంగా పరిగణిస్తారు.
⇒ దారిలో గుర్రపు నాడా దొరికితే అదృష్టంగా భావిస్తారు. గుర్రపు నాడాను కొనుక్కొని అయినా, దానితో ఉంగరం తయారు చేయించుకుని, వేలికి తొడుక్కుంటే దురదృష్టం తొలగిపోతుందని, శనిదోష నివారణ జరుగుతుందని మన దేశంలో చాలామంది నమ్ముతారు.
⇒ నిచ్చెన కింద నుంచి నడిచి వెళితే దురదృష్టం తప్పదని యూరోపియన్లు నమ్ముతారు. నిచ్చెనను గోడకు చేరవేసి, నిలబెట్టినప్పుడు ఆ ఆకారం పిరమిడ్‌ను తలపిస్తుంది. అలాగే నిచ్చెన కింద నిలుచుంటే ప్రేతాత్మలు మేలుకుంటాయని ఈజిప్షియన్లు భావిస్తారు.
⇒ పగిలిన అద్దంలో ముఖాన్ని చూసుకుంటే దురదృష్టం వెంటాడుతుందనే నమ్మకం మనదేశంలోనే కాదు, చాలా చోట్ల ఉంది. ఇంట్లో ఉన్న అద్దం అనుకోకుండా పగిలిపోతే, అప్పటి నుంచి దుర్దినాలు ప్రారంభమైనట్లేనని కొన్ని దేశాల్లో భావిస్తారు. ఆర్థిక నష్టాలు కలుగుతాయని, దరిద్రం వెంటాడుతుందని నమ్ముతారు.
⇒ పీడకలలు వెంటాడుతుంటే, దిండుకింద చాకు లేదా కత్తెర ఉంచుకుంటారు. ఈ నమ్మకం మన దేశంలో కొన్నిచోట్ల ఇప్పటికీ ఉంది.
⇒ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఎవరైనా తుమ్మితే దురదృష్టంగా భావిస్తారు. అలాగే, ఏదైనా పని మీద బయటకు బయలు దేరుతుంటే, ఎవరైనా వెనక్కు పిలిచినా దురదృష్టం తప్పని నమ్ముతారు. ఇంటి నుంచి బయలుదేరాక తిరిగి వెనక్కు వెళ్తే, ఆ పని జరగదంటారు.
⇒ చైనాలో ‘4’ అంకెను దురదృష్ట కరమైనదిగా భావిస్తారు. చివరకు ‘4’తో ఏర్పడే 14, 24 వంటి సంఖ్యలను కూడా. చైనా భాషలో నాలుగు, చావు పదాలు దాదాపు ఒకేలా వినిపించడమే ఈ నమ్మకానికి కారణం.