లక్నో: రాముడు ఆదర్శపురుషుడు. సర్వవ్యాప్తమైన రాముని జీవన విధానం ఆచరణీయం. రామునిపై విశ్వాసం అందరిసొంతం అని నిరూపిస్తోంది ఓ ముస్లిం మహిళ. అయోధ్య రామున్ని దర్శించుకోవడానికి ముంబయి నుంచి కాలినడకన బయలు దేరింది. ఆమె సహచరులతో కలిసి ఏకంగా 1,425 కిలోమీటర్ల దూరం కాలినడకనే ప్రయాణిస్తోంది.
ముంబయికి చెందిన షబ్నమ్‌కు రాముడంటే ఎంతో ఇష్టం. అయోధ్యలో కొలువుదీరనున్న రామున్ని దర్శించుకోవడానికి కాలినడకనే వెళ్లాలని నిర్ణయించుకుంది. తన సహచరులు రామన్ రాజ్ శర్మ, వినీత్ పాండేలతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించింది. ముస్లిం మహిళను అయినప్పటికీ రామున్ని పూజించడానికి అచంచలమైన భక్తి ఒక్కటే అర్హతని అంటోంది. రామున్ని పూజించడానికి హిందువు కానవసరం లేదని పేర్కొంది. మంచి మనిషిగా జీవించడమే ముఖ్యమని చెబుతోంది. ప్రస్తుతం యాత్రలో మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. ప్రతి రోజూ 25 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు వెల్లడించింది.
సుధీర్ఘ యాత్రలో అలసట వచ్చినప్పటికీ రామునిపై ఉన్న భక్తే తమ యాత్రను కొనసాగిస్తోందని షబ్నమ్ తెలిపింది. రాముని ఆరాధన ఏ ప్రత్యేక మతం లేదా ప్రాంతానికి పరిమితం కాదని, అది సరిహద్దులను దాటి ప్రపంచం మొత్తాన్ని చుట్టుముడుతుందని షబ్నమ్ గట్టిగా నమ్ముతోంది. మతంతో సంబంధం లేకుండా రాముడు అందరివాడనే ప్రేరణ కలిగించడానికే యాత్రను చెపట్టినట్లు పేర్కొంది. అబ్బాయిలు మాత్రమే ఇలాంటి కష్టతరమైన యాత్రలు చేయగలరనే అపోహను దూరం చేస్తానంటోంది. యాత్రలో వీరిని కలిసిన పలువురు ఫొటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు.
అయితే.. షబ్నమ్ పాదయాత్రకు సవాళ్లు తప్పలేదు. ఆమెకు భద్రత కల్పించడమే కాకుండా భోజనం, వసతి ఏర్పాట్లు కల్పించడంలో పోలీసులు కీలకంగా వ్యవహరించారు. సున్నితమైన ప్రాంతాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. సోషల్ మీడియాలో కొందరు ద్వేషిస్తున్నప్పటికీ.. షబ్నమ్ తన ప్రయాణాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తోంది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. విశేష స్పందనలు ప్రోత్సాహాన్నిస్తున్నాయని తెలిపింది. రాముని జెండాను పట్టుకుని నడుస్తున్నప్పుడు ముస్లింలతో సహా అనేక మంది 'జై శ్రీరామ్' అని నినదించిన ఆనంద క్షణాలను అనుభవించానని షబ్నమ్ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment