అయోధ్య: ‘జాతి ఐక్యతకు ప్రతీక’ | Ayodhya Bhoomi Pujan LIVE Updates in Telugu | Sakshi
Sakshi News home page

లైవ్‌ అప్‌డేట్స్‌; అయోధ్యలో భూమిపూజ

Published Wed, Aug 5 2020 9:23 AM | Last Updated on Wed, Aug 5 2020 2:55 PM

Ayodhya Bhoomi Pujan LIVE Updates in Telugu - Sakshi

జాతి ఐక్యతకు ప్రతీక: మోదీ
శతాబ్ధాల నిరీక్షణ నేటితో పూర్తవుతోందని ప్రధాని మోదీ అన్నారు. అయోధ్యలో భూమి పూజ తర్వాత ఆయన మాట్లాడుతూ.. తమ జీవితకాలంలో ఈ కల సాకారమవుతుందని కోట్లమంది నమ్మలేకపోయారన్నారు. దేశం మొత్తం రామమయమైంది, దేశం మొత్తం భావోద్వేగంలో ఉందని వ్యాఖ్యానించారు. భూమి పూజకు తనను ఆహ్వానించడం  అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జాతి ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. జైశ్రీరామ్‌ నినాదాలతో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు.


ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాం

రామమందిరం భూమి పూజలో పాల్గొనడం తమ అదృష్టమని, ఆలయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశామని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఈ సందర్భంగా అన్నారు. ప్రపంచంలోనే అయోధ్య విశిష్ట నగరంగా రూపుదిద్దుకోబోతుందని పేర్కొన్నారు. రామజన్మభూమి ఉద్యమంలో అద్వానీ పాత్ర ఎనలేనిదని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్ వ్యాఖ్యానించారు. విశ్వమానవాళికి మార్గదర్శం చేయదగ్గ భవ్యమైన రామమందిరం రూపుదిద్దుకోబోతుందన్నారు.


అపురూప ఘట్టం ఆవిష్కృతం

దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూసిన అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ ముగిసింది. రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేద మంత్రోచ్ఛరణల నడుమ శంకుస్థాపన చేశారు. గర్భగుడి వద్ద వెండి ఇటుకతో శంకుస్థాపన చేశారు. భూమి పూజకు నక్షత్ర ఆకారంలో ఐదు వెండి ఇటుకలను ఉపయోగించారు. ప్రవిత్ర నదీ జలాలతో క్రతువు నిర్వహించారు. దేశం యావత్తు ఆ అపురూప ఘట్టాన్ని టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షించింది. అయోధ్యలో భూమిపూజకు సమాంతరంగా.. దేశవ్యాప్తంగా రామాలయాల్లో ప్రార్థనలు, పూజలు జరిగాయి.


శంకుస్థాపన​ క్రతువులో ప్రధాని మోదీ
అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రామజన్మభూమిలో రామ్‌లల్లా దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటారు. తర్వాత భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన శంకుస్థాపన​ క్రతువు నిర్వహిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, రామానంద్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు, హిందూమత ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భూమిపూజ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. రామ నామ స్మరణతో అయోధ్య మార్మోగుతోంది.


అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుగా హనుమాన్‌ గడీని సందర్శించారు. హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేకంగా హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఒక్కరే ఉన్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వీరిద్దరూ ఆలయంలో కలియ తిరిగారు. దాదాపు 5 నిమిషాల పాటు అక్కడ గడిపారు. అక్కడి నుంచి రామజన్మ భూమికి పయనమయ్యారు.


అయోధ్యకు విచ్చేసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో అయోధ్య చేరుకున్నారు. లక్నో విమానాశ్రయం నుంచి ప్రత్యేక సైనిక హెలికాప్టర్‌లో అయోధ్య చేరుకున్న ఆయనకు కోవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఉన్నత అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి సుప్రసిద్ధ హనుమన్‌ ఆలయానికి ఆయన వెళ్లారు.


ప్రముఖుల రాక

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఉమా భారతి.. అయోధ్యలో రామజన్మభూమికి చేరుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ ఏర్పాట్లను స్వయంగాపర్యవేక్షిస్తున్నారు. హిందూ మత పెద్దలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యోగా గురువు బాబా రాందేవ్‌, స్వామి అవదేశానంద్‌ గిరి, చిదానంద్‌ మహరాజ్‌ తదితరులు రామజన్మభూమికి విచ్చేశారు.


సీతమ్మధారలో ప్రత్యేక పూజలు

విశాఖపట్నం: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంఖుస్ధాపన సంధర్బంగా విశాఖలోని సీతమ్మధార అభయాంజనేయ స్వామి ఆలయంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, చెరువు రామకోటయ్య, ఆర్ ఎస్ ఎస్ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జి జనార్ధన్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి తదితరులు ఆద్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ రోజు ప్రపంచంలో హిందువులు పండగ జరుపుకునే రోజని.. శతాబ్దాల హిందూ ప్రజల కోరిక నేరవేరుతున్న వేళ అని.. ప్రధాని మోదీ చేతుల మీదగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరుపుకుంటుండటం శుభసూచకమన్నారు. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా రాముడిని కొలుస్తారని, రాముడు మతాలకి అతీతంగా పూజించే దేవుడిగా తెలిపారు.


కోఠిలో పండగ వాతావరణం

హైదరాబాద్‌లోని కోఠి వీహెచ్‌పీ కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. కార్యాలయం పరిసర ప్రాంతాలు కాషాయామయం అయ్యాయి. అయోధ్య రామాలయ శంకుస్థాపన సందర్భంగా వీహెచ్‌పీ కార్యాలయంలో రామయజ్ఞం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వీహెచ్‌పీ కార్యాలయలలో శంకుస్థాపన అనంతరం సంబరాలకు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఇంటిపై కాషాయ జెండా ఎగరవేయాలని వీహెచ్‌పీ పిలుపునిచ్చింది.


ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు బయలు దేరారు. రోజువారీ వస్త్రధారణకు భిన్నంగా పంచకట్టులో ప్రధాని మోదీ కనిపించారు. లక్నో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత హెలికాప్టర్‌లో అయోధ్యకు ప్రధాని పయనమవుతారు. ముందుగా హనుమాన్‌ గర్హిలో ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు.


కోవిడ్‌–19 ప్రొటోకాల్‌ పాటించేలా...

కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో అయోధ్య పట్టణాన్ని అధికారులు అణువణువునా శానిటైజ్‌ చేశారు. ముఖ్యంగా ప్రముఖులు సందర్శించనున్న ఆలయాలను క్రిమినిరోధక ద్రావణాలతో శుభ్రం చేస్తున్నారు. అయోధ్యలోని హనుమాన్‌ గఢీ ఆలయంతో పాటు పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున శానిటేషన్‌ కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ హనుమాన్‌ గఢీ ఆలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు పెట్టారు. కోవిడ్‌–19 ప్రొటోకాల్‌ను అందరూ పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.


శోభయమానంగా అయోధ్య
అయోధ్య:
రామ నామ స్మరణతో అయోధ్య మార్మోగుతోంది. రంగు రంగుల పూల దండలు, కాషాయ తోరణాల అలంకరణలతో అయోధ్య శోభయమానంగా మారింది. అయోధ్యకు వెళ్లే రహదారులకు ఇరువైపులా రామ మందిర నమూనా చిత్రాలను, రామ్‌లల్లా చిత్రాలను అలంకరించారు. రామ మందిర నిర్మాణానికి జరిగే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా ప్రముఖులు రానుండటంతో భారీగా మొహరించిన భద్రతా బలగాలతో అయోధ్య పట్టణం హడావుడిగా ఉంది. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. కార్యక్రమం జరిగే ప్రాంతానికి ఎవరూ రావద్దని స్థానికులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాగే, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎవరూ అయోధ్యకు రావద్దని కోరారు. మొత్తం శంకుస్థాపన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం జరుపుతామని, ప్రజలంతా ఇళ్లలోనే ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలని అభ్యర్థించారు.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికల్లో తమ  స్పందన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement