రాముడు అందరి వాడు : ప్రధాని మోదీ | Narendra Modi Speech At Ayodhya Ram Mandir Bhoomi Pooja | Sakshi
Sakshi News home page

రాముడు అందరి వాడు : ప్రధాని మోదీ

Published Wed, Aug 5 2020 2:33 PM | Last Updated on Wed, Aug 5 2020 5:06 PM

Narendra Modi Speech At Ayodhya Ram Mandir Bhoomi Pooja - Sakshi

లక్నో, అయోధ్య: దేశ ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న అపూరూప ఘట్టానికి నేడు అంకురార్పణ జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జై శ్రీరాం నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ నినాదం కేవలం భారత్‌లోనే కాక ప్రపంచం అంతా ప్రతిధ్వనిస్తుంది. ఈ మహత్కార్యం సందర్భంగా దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులందరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మందిర నిర్మాణానికి సంబంధించి భూమి పూజకు నన్ను ఆహ్వానించినందుకు రామ్‌ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అన్నారు మోదీ. (గ‌త 500 సంవ‌త్స‌రాల్లో ఆ ఘ‌న‌త మాత్రం మోదీకే)

‘నేడు ప్రతి ఒక్కరి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. మందిర నిర్మాణం దేశానికి ఒక ఉద్వేగభరితమైన క్షణం. ఏళ్ల తరబడి కొనసాగిన సుదీర్ఘ నిరక్షణ నేటితో ముగియనుంది. ఇన్నేళ్లు ఒక గుడారం కింద నివసించిన రాముడికి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించబోతున్నాం. అయోధ్య చరిత్రలో నేడు ఒక సువర్ణ అధ్యాయం. ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి చిహ్నంగా నిలుస్తుంది. ఆలయం కోట్ల మంది ప్రజల సమిష్టి తీర్మానం శక్తికి ప్రతీక. ఇది భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తినిస్తుంది. ఈ నాడు దేశమంత రామమయమయ్యింది. మందిర నిర్మాణం కోసం ఎందరో ప్రాణ త్యాగం చేశారు. వారందరి త్యాగాల ఫలితమే నేటి మందిర నిర్మాణం. ఈ రోజు వారందరికి దేశ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అన్నారు మోదీ. (అయోధ్యలో భూమి పూజ: ఒవైసీ వ్యాఖ్యలు)

‘భారతీయ సంస్కృతికి రాముడు ప్రతీక. మందిర నిర్మాణంతో చరిత్ర సృష్టించడమే కాక.. చరిత్ర పునరావృతమవుతోంది. నదిని దాటడానికి రాముడికి గుహుడు సాయం చేశాడు.. గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి కృష్ణుడికి పిల్లలు సాయం చేశారు. అలానే అందరి ప్రయత్నం, కృషితో మందిర నిర్మాణం పూర్తవుతుంది. మందిర నిర్మాణంతో అయోధ్య రూపు రేఖలు మారిపోతాయి. దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారు. దాంతో ఆర్థికంగా కూడా అభివృద్ధి జరుగుతుంది. మానవుడు రాముడిని విశ్వసించినప్పుడల్లా పురోగతి జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. ఆ మార్గం నుంచి తప్పుకున్నప్పుడల్లా.. విధ్వంసం తలుపులు తెరవబడ్డాయి. మనం అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలి. అందరి మద్దతు, నమ్మకంతో ప్రతి ఒక్కరి అభివృద్ధిని ఆకాంక్షించాలి’ అని మోదీ కోరారు.

‘అయోధ్యలో నిర్మించబోయే మందిరం శ్రీరాముని పేరు వలే.. భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది సమస్త మానవాళిని ప్రేరేపిస్తుందని నా నమ్మకం. రాముడు అందరి వాడు.. ప్రతి ఒక్కరిలో ఉన్నాడు’ అన్నారు మోదీ. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణం శిలాఫలాకాన్ని మోదీ ఆవిష్కరించారు. రామ మందిర నిర్మాణ చిహ్నంగా పోస్ట్‌ల స్టాంప్‌ను విడుదల చేవారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement