న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర ట్రస్టు కొనుగోలు చేసిన భూమి విషయంలో అక్రమాలు జరిగాయని, ఇదొక పెద్ద కుంభకోణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరింది. నిజాలను వెలికితీసేందుకు కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. శ్రీరాముడి పేరిట దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును బీజేపీ నేతలు లూటీ చేస్తున్నారని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆదివారం మండిపడ్డారు.
ఈ విషయంలో ప్రధానమంత్రితోపాటు సుప్రీంకోర్టు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేత ఒకరు అయోధ్యలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొంత భూమిని రూ.20 లక్షలకు కొనుగోలు చేశారని, అదే భూమిని ఇటీవల రామమందిర ట్రస్టుకు ఏకంగా రూ.2.5 కోట్లకు విక్రయించారని చెప్పారు. కేవలం 79 రోజుల్లో 1,250 శాతం లాభం ఆర్జించారని ఆరోపించారు. 2 కోట్లకు భూమిని కొని నిమిషాల్లోనే రూ. 18.5 కోట్లకు రామమందిర ట్రస్టుకు అమ్మారని ఇదివరకే తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడిది రెండో ఉదంతం.
అక్రమార్కులను కఠినంగా శిక్షించాలి
సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతోందని రణదీప్ సూర్జేవాలా గుర్తుచేశారు. ట్రస్టును ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టుకు, న్యాయమూర్తులకు, ప్రధానమంత్రికి బాధ్యత లేదా? అని నిలదీశారు. ట్రస్టు ఆర్థిక లావాదేవీలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో ఆడిట్ నిర్వహించాలని, అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. భూకుంభకోణంపై ప్రధాని మోదీ తీసుకోబోయే చర్యల కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు.
చదవండి: ఈ భూమిపై మాకింత చోటేది?
20 లక్షల భూమిని 2.5 కోట్లకు అమ్మేశారు
Published Mon, Jun 21 2021 7:28 AM | Last Updated on Mon, Jun 21 2021 7:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment