సాక్షి, న్యూఢిల్లీ : శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో రామ మందిర నిర్మాణం అంటే మర్యాదపురుషోత్తముడైన శ్రీరాముడు తన జీవితంలో ఆచరించి చూపిన సత్య, నైతికత, సౌభ్రాతృత్వం వంటి ఆదర్శ విలువలకు పట్టాభిషేకం చేయడమేనని భావిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాఖ్యానించారు. అయోధ్యకు రాజుగా శ్రీరాముడు పాటించిన శ్రేష్టమైన , ఆదర్శవంతమైన జీవితం, సమాజంలోని సామాన్యులు, ఉన్నత వర్గాలవారు అనే భేదభావాల్లేకుండా ప్రజలందరికీ అనుసరణీయంగా ఉండేవని అన్నారు. శ్రీరాముడి సత్ప్రవర్తనే కాదు, స్వయంగా పాటించి చూపిన విలువలు భారతీయ చేతనలోని మూలాలను ప్రతిబింబిస్తాయని అన్నారు.
(చదవండి : రాముడు అందరి వాడు : ప్రధాని మోదీ)
ఇవి మత , ప్రాంత విభేదాల్లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైనవని పేర్కొన్నారు. ఆ విలువలు కాలాతీతమైనవని, నేటికీ సందర్భోచితమైనవని అన్నారు. రామ మందిర నిర్మాణాన్ని ఒక మతపరమైన కార్యక్రమంగా కాక, ఆ ఆలోచనా పరిధుల్ని దాటి మచింత విస్తృతమైన అంశంగా చూడాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ మందిరం ఉన్నతమైన , సనాతనమైన మానవవిలువలకు ప్రతీకగా మనకు ఎల్లప్పుడూ మార్గదర్శనం చేస్తూనే ఉంటుందన్నారు. ఎలాంటి వివక్షకు తావులేకుండా మనమంతా ఒకటని తెలిపే భారతీయ నైతిక విలువలను మనకు నిరంతరం గుర్తుచేస్తూంటుంది. అలాంటి అద్భుతమైన ప్రాధాన్యత గల రామమందిరానికి భూమి పూజ, భారతీయ చరిత్రలో సువర్ణరాక్షలరాలతో లిఖితమైన శ్రీరాముడు పాటించిన విలువల వైభవాన్ని కళ్లకు కడుతూనే ఉంటుందన్నారు. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఈ వివాదంలో న్యాయ, శాంతి పూర్వక పరిష్కారంలో భాగస్వాములైన కక్షిదారులందరికీ పేరు పేరునా అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు.
(చదవండి : ఐదు శతాబ్దాల నిరీక్షణ ముగిసింది : యోగి)
‘ఈ సందర్భంగా అయోధ్య స్థల వివాదంలో కక్షిదారుగా ఉన్నటువంటి శ్రీ ఇక్బాల్ అన్సారీ (దివంగత శ్రీ హషీమ్ అన్సారీ గారి కుమారుడు)ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భారతీయ సాంస్కృతిక విలువల స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ.. ప్రతి ఒక్కరూ గతాన్ని మరచి ముందుకు సాగాలని ప్రజలందరికీ వారు గొప్పమనుసుతో చేసిన విజ్ఞప్తి అభినందనీయం. ఇంతటి చారిత్రకమైన ఈ రోజును.. అన్ని విశ్వాసాల పట్ల పరస్పర గౌరవం, సామరస్యపూర్వక జీవనంతో కూడిన.. కొత్త శకానికి నాందిగా భావించి ముందుకెళ్దాం. ఈ సంకల్పంతో ప్రతి పౌరుడి కలలు సాకారమయ్యే భారతావని నిర్మాణం జరగాలని కోరుకుందాం.ఈ సందర్భంగా, జాతిపిత మహాత్మాగాంధీ ఆలోచించినట్లుగా.. ప్రజాస్వామ్య, ధర్మబద్ధమైన ఆదర్శాలతో ప్రజా శ్రేయస్సును, సమాజంలో ఆనందాన్ని ప్రతిబింబించే, సమాజంలో అందరికీ శాంతిసామరస్యాలు, సమానత్వాన్ని కల్పించే రామరాజ్య స్థాపనకు పునరంకితమవుదామని ప్రతినబూనుదాం’అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment