బతుకే ఒక బదిలీ...
ప్రాణప్రదంగా పెంచుకున్న మొక్కలను వదిలి వెళ్లిపోవాలి. పాశం పెంచుకున్న పరిసరాలను వదిలి వెళ్లిపోవాలి. అక్కా ఎలా ఉన్నావు? అని అడిగే పక్క ఫ్లాట్ ఆత్మీయురాలిని వదిలి వెళ్లిపోవాలి. ఇంతకాలం కలిసి వాకింగ్ చేసిన కింద ఫ్లాట్ బాబాయిని వదిలి వెళ్లిపోవాలి. సెక్షన్‌లో తోటి ఉద్యోగులను వదిలి వెళ్లిపోవాలి. లంచ్ టైంలో కూరను షేర్ చేసే మిత్రులను వదిలి వెళ్లిపోవాలి. కానీ వెళ్లక తప్పదు. ఎందుకంటే - బతుకంటే బదిలీయే కదా!
మహా విజేత చంఘిజ్ ఖాన్ తన వృద్ధాప్యంలో ఆస్థాన వైద్యులందరినీ పిలిచి ఒక కోరిక కోరాడు- ‘నాకు చనిపోవాలని లేదు... చిరంజీవత్వాన్ని ప్రసాదించండి... అందుకు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.’ నిజమే. చంఘిజ్‌ఖాన్ దగ్గర వేల కొలది మైళ్ల భూమి ఉంది. లక్షల కొలది గుర్రాలు ఉన్నాయి. వందల ఐరావతాల ఎత్తు ధనం ఉంది. అతడు ఏం కావాలన్నా అది ఎవరికైనా ఇవ్వగలడు. మృత్యువును దూరం చేస్తే ఏం చేయమన్నా చేయగలడు.
కాని మృత్యువును ఆపగలరా ఎవరైనా?
‘చక్రవర్తీ... నువ్వు మా తల ఉత్తరిస్తానన్నా సరే... మేము సత్యం పలుకక తప్పదు... నీ మృత్యువు ఆగదు... శరీరం శైథిల్యం అయ్యాక మరణంలోకి జన్మ బదిలీ కాక తప్పదు’ అని జవాబు చెప్పారు వైద్యులు. అదే సత్యం. జీవితంలో బదిలీయే సత్యం. పురాణాల్లో యయాతీ తన వృద్ధాప్యం తీసుకొని యవ్వనాన్ని ఇవ్వమని కుమారులని కోరాడు. ఇద్దరు కుమారులు ఇవ్వము అని అంటే మూడో కుమారుడు తండ్రి వృద్ధాప్యాన్ని తీసుకుని తన యవ్వనాన్ని ఇచ్చాడు. అయినంత మాత్రాన యయాతీ ఆయుష్మంతుడిగా మిగిలిపోలేదు. బదిలీ లేని బతుకులోని బోర్‌డమ్‌ను తట్టుకోలేక తపస్సులో జారుకొని మోక్షం పొందాడు.
పూత పిందెలోకి పిందె కాయలోకి కాయ ఫలంలోకి ఫలం ఆకొన్నవాడి జీర్ణాశయంలోకి బదిలీ కావాల్సిందే. ఇది నియమం. భూమి పన్నెండు గంటలు ఇటు పగలు. ఆ తర్వాత రాత్రిలోకి బదిలీ కావాల్సిందే. ఎండలు నాలుగు నెలలు అటూ ఇటూ. ఆ తర్వాత వర్షంలోకి బదిలీ కావాల్సిందే. మేఘం నడినెత్తిన కాసేపు. ఆ తర్వాత దూరతీరాలకు బదిలీ కావాల్సిందే.
మానవ నాగరికత అంతా బదిలీ పైనే ఆధారపడి ఉంది. నదులను వెతుక్కుంటూ నిప్పును వెతుక్కుంటూ పంటకు యోగ్యమైన మైదానాలను వెతుక్కుంటూ పశువుల గ్రాసానికి పుష్కలమైన అడవులను వెతుక్కుంటూ మానవజాతి ఒక చోట నుంచి మరోచోటుకు బదిలీ అవుతూ మానవ నాగరికతను నిర్మించింది. పరిణామక్రమాన్ని కొనసాగించింది. కదలికనే పురోగతిగా వ్యాఖ్యానించింది.
ప్రపంచాన్ని ఏలాలని బయలుదేరిన అలెగ్జాండర్ ఎంత దూరం ప్రయాణం చేసినా ఆ తర్వాత చివరకు వెనుకకు మరలక తప్పలేదు. దండయాత్రలు సాగించిన యూరోపియన్లు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లక తప్పలేదు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి ఇవాళ ఇంగ్లిష్ వాళ్లు ‘మేము- మా బ్రిటన్’ వరకూ ఆగిపోక తప్పడమూ లేదు. ఈ బదిలీ కొన్నాళ్లు... ఆ బదిలీ కొన్నాళ్లు... ఇంతే చరిత్ర.
చిన్నప్పటి స్నేహితులు పై తరగతులకు బదిలీ అవుతున్నప్పుడు చెదిరిపోతారు. కాలేజ్‌లో తోడుగా కూల్‌డ్రింక్ పంచుకున్న మిత్రులు కెరీర్‌లో బదిలీ అవుతున్నప్పుడు చేయి విడిచేస్తారు. ఉద్యోగాల్లో ఏళ్ల తరబడి పక్క సీట్లో కూర్చున్న కలీగ్స్ ఉద్యోగం బదిలీ అవుతున్నప్పుడు ఏదో ఊళ్లో ఏదో సెక్షన్‌లో మనల్ని మర్చిపోతారు.
ఉంటున్న ఇంటిపై మమకారం, చేస్తున్న ఆఫీస్‌పై మమకారం, వాసం ఉంటున్న ఈ దేహంపై మమకారం మనిషి పెంచుకున్నవే. ప్రకృతి అది శాశ్వతం అని చెప్పలేదు. చెప్పదు. ఈ ఇల్లు కాకపోతే మరో ఇల్లు. ఈ ఆఫీస్ కాకపోతే మరో ఆఫీస్. ఈ దేహం కాకపోతే మరుజన్మలో మరో దేహం. దేవుడే ఒక అవతారం చాలించి మరో అవతారానికి బదిలీ అవుతున్నప్పుడు మనిషి ఎంత? మనిషి కోరుకునే శాశ్వతత్వాల ఉనికి ఎంత?
చెన్నై మెరీనా బీచ్ బాగుంటుంది. వదిలేయాల్సి వస్తే వదలాల్సిందే. హైదరాబాద్ హుసేన్ సాగర్ చాలా బాగుంటుంది. వీడ్కోలు పలకాల్సి వస్తే వీడ్కోలు పలకాల్సిందే. ఇవాళ బెజవాడ. సరే. రేపు కాకినాడ.. ఓకే. ఈ సంవత్సరం ఈ పిల్లలకు పాఠాలు. వచ్చే సంవత్సరం మరో బ్యాచ్‌కు బోధనలు. పాలవాడు మారతాడు. పేపర్‌వాడు మారతాడు. పనమ్మాయి మారుతుంది. మన పిల్లలే మనతో ఉండకుండా హాస్టల్స్‌కి అమెరికాకి లేదంటే పెళ్లిళ్లై వేరుకాపురాల్లోకి బదిలీ అయి వెళ్లిపోతూ ఉంటారు.
బదిలీయే అందం. అదే చందం. మరి మొగుడూ పెళ్లాలు? కొత్త ఒక అందం. అక్కడి నుంచి అనురాగం పెరగడం ఒక అందం. వయసు పెరిగేకొద్దీ ఒకరికి మరొకరు అలవాటు పడటం ఒక అందం. ముంగురులు తెల్లబడ్డాక ఒకరి తప్పొప్పులతో సహా మరొకరు అంగీకరించే స్థితికి చేరుకోవడం ఒక అందం. చివరి రోజుల్లో జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ పార్క్‌లో వాకింగ్ చేస్తూ ఉండటం అందాతి అందం. కేవలం కొత్త పెళ్లి జంటగా ఉంటే ఎంత బోర్? కొత్త జంట తల్లిదండ్రులుగా బదిలీ కావడమే అందం. భోజనం శక్తిగా శక్తి ఆలోచనగా ఆలోచన ఆచరణగా ఆచరణ ఫలితంగా బదిలీ కావడమే ప్రకృతి.జీవితం ఘట్టాలుగా ఘట్టాలు దశలుగా దశలు చరమాంకంగా బదిలీ కావడమే ప్రకృతి. మనిషి ప్రకృతిలో భాగం. మనిషి బదిలీలో భాగం. బదిలీని స్వీకరించి ముందుకు సాగడమే మనిషి కర్తవ్యం.
మనం చాలాకాలంగా పని చేస్తున్న ప్రదేశంతో, ఉద్యోగంతో ఒక బంధం ఏర్పడుతుంది. అది చాలా సహజం. అయితే కర్తవ్యం మనల్ని ఎటు తీసుకెళితే అటు వెళ్లాలి అని గుర్తు పెట్టుకోవాలి. మనం వెళ్లిన ప్రదేశంలో కూడా కొత్త జ్ఞాపకాలు ఏర్పడతాయి. వాటి నేపథ్యంలో వాటంతట అవే క్రమేణా పలచబారతాయి. మన జ్ఞాపకాలను బలవంతంగా మరచిపోవడానికి ప్రయత్నించకూడదు. దానివల్ల వాటిని మరచిపోవడం సాధ్యం కాదు. అయినా ఇవేమీ భయంకరమైన చేదు జ్ఞాపకాలేమీ కాదు కదా... బలవంతంగా మరచిపోవడానికి! దానికి బదులుగా మనం కొత్తగా మారిన చోటులో ఉండి కూడా గతంలో మనం కలిసి టీ తాగిన చోటు, స్నేహితులతో కబుర్లు చెప్పుకున్న ప్రదేశం, ఠ ంఛనుగా టిఫిన్ చేసే చోటు... వీటన్నింటినీ నెమరు వేసుకుంటూ ఉండాలి. వీలైతే డైరీలో రాసుకుని, వాటిని తరచు చదువుకుంటూ ఉండాలి. మన స్నేహితులతో ఫోన్ కాంటాక్ట్‌లో ఉంటూ ఉండాలి. ఇవేమీ అంతంత దూరాలు కూడా కావు కాబట్టి, వీలయినప్పుడల్లా కలుస్తూ ఉండాలి. అది ఎలా ఉండాలంటే మనం చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మలు, మేనత్తల ఊళ్లకు వెళ్లి, అక్కడ వేసవి సెలవులో, దసరా సెలవులో, సంక్రాంతి సెలవులో గడిపి వచ్చిన తర్వాత ఎలా నెమరు వేసుకుంటూ ఉంటామో, అలా ఉండాలన్నమాట. చాలాకాలం తర్వాత వాళ్లను తిరిగి కలిసినప్పుడు వాళ్లతో ఎలా ఉంటామో స్నేహితులను అలా కలవాలి, వారితో అలా గడపాలి.
- కె. సువర్చల