ఆర్ట్ ప్రపంచాన్ని రక్షిస్తుంది! | Protects the art world! | Sakshi
Sakshi News home page

ఆర్ట్ ప్రపంచాన్ని రక్షిస్తుంది!

Published Sun, Jan 12 2014 11:20 PM | Last Updated on Thu, Apr 4 2019 3:48 PM

Protects the art world!

- బోస్ కృష్ణమాచారి, చిత్రకారుడు
 
‘బినాలే’ అంటారు యూరోపియన్స్. ‘బైఏన్యువల్’ అంటారు అమెరికన్స్. ‘బినాలే’ ఒక మొక్కపేరు. విత్తిన రోజు నుంచి రెండేళ్లలోపు పుష్పించి ఫలించి అంతరిస్తుంది. అదేరోజున మళ్లీ మొలకెత్తడం ప్రారంభమవుతుంది. బినాలే అంటే రెండోళ్లకోసారి జరిగే కళల ఉత్సవం కూడా! ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 బినాలేలు సుప్రసిద్ధం. మన దేశంలో 2012లో కేరళలోని సముద్రతీర పట్టణం కోచిలో తొలి బినాలే ప్రారంభమై  మూడు నెలలపాటు వైభవోజ్వలంగా జరిగింది. ‘కోచి ముజ్రిస్ బినాలే’ (కెఎంబి)గా విఖ్యాతమైంది. ఈ  ‘కెఎంబి’ ఆర్ట్ డెరైక్టర్ బోస్ కృష్ణమాచారి ఇటీవల నగరానికి విచ్చేశారు. భారతదేశానికి తొలిసారిగా బినాలేను విజయవంతంగా పరిచయం చేసిన బోస్ కృష్ణమాచారితో ఇంటర్వ్యూ సారాంశం...
 
 మీ గురించి చెప్పండి...

 మాది కార్పెంటర్ కుటుంబం. చిన్నప్పటి నుంచి ‘రేఖ’ తెలుసు. చెక్కడం తెలుసు. డాక్టర్‌ను కావాలనుకున్నాను. టీనేజ్‌లో తీవ్రమైన జబ్బు చేసింది. కుటుంబం ఆర్థికంగా చితికి పోయింది. చచ్చిబతికిన మనిషిని కదా, కొత్తగా జీవించాలనుకున్నాను. ముంబై జేజే స్కూల్లో చేరాను. నైరూప్య చిత్రాలు, రూప చిత్రాలు, శిల్పాలు, ఇన్‌స్టలేషన్స్, భవనాల కళాకృతులు, డిజిటల్ ఇమేజెస్, డాక్యుమెంటరీలు... ఇష్టం వచ్చిన పని చేస్తుంటాను. ముంబైలో నివసిస్తున్నాను. ప్రపంచంలో ముఖ్యమైన మ్యూజియంలు, గ్యాలరీలు నా ఆర్ట్‌ను ఆదరిస్తున్నాయి. ఉపన్యాసాలకు  ఆహ్వానిస్తుంటాయి.
 
 మీరు ఆర్ట్ కలెక్టర్ కూడా కదా...

 రియల్ ఎస్టేట్, బంగారం, షేర్లలో ఒడిదుడుకులను ఎవరూ అంచనా వేయలేరు. తెలివైన వారు ఆర్ట్‌లో పెట్టుబడి పెట్టి (ఆర్ట్ కలెక్టర్స్‌గా) బాగానే సంపాదిస్తున్నారు. సంపాదనలో అదొక ఉత్తమాభిరుచికి సంబంధించిన మార్గం. నా ధోరణి వేరు. నేను రెండు కారణాలతో కొంటాను. ఎదిగివస్తోన్న ఆర్టిస్ట్‌లను ప్రోత్సహించేందుకు కొంటాను. నాకు నచ్చిన ఆర్ట్ వర్క్‌ను కొంటాను. కానీ, అమ్మను. అవి అలానే ఉంటాయి, మంచి జ్ఞాపకాలను ఇస్తూ!
 
 ‘బినాలే’కు ముందూ వెనుకా చెప్పండి...


 మహారాష్ట్ర కల్చరల్ మినిస్టర్ నన్ను, కొందరు స్నేహితులను పిలిచి రాష్ట్రంలో విద్యావ్యాప్తికి కళాకారుల సహకారాన్ని కోరారు. నా మిత్రుల్లో కొందరు హిందీ సినీనటుల కంటే ఎక్కువగానే సంపాదిస్తారు. వారి పద్ధతుల్లో వారు సమాజానికి తిరిగి ఇస్తూనే ఉంటారు. వాస్తవానికి బిలియనీర్ కంటే పేద కళాకారుడే సమాజానికి ఎక్కువగా సహాయం చేస్తాడు. కళ ద్వారా కళాకారుడికి ఆదరణ, సమాజవికాసం, ఆర్ధికాభివృద్ధి పొందేందుకు బినాలేలు మార్గమని సూచించాం. 1895లో వెనిస్‌లో ప్రారంభమైన బినాలే దాదాపు 15 దేశాలను కళాత్మకంగా మార్చివేయడం గురించి వివరించాం.

ఆ ఆలోచన కోచిలో బినాలేగా ఆచరణకు వచ్చింది. మిత్రులం ప్రపంచ దేశాల బినాలే నిర్వాహకులను, మ్యూజియం క్యూరేటర్లను సంప్రదించాం. స్థానిక, జిల్లా, రాష్ట్ర,కేంద్ర సాంస్కృతిక విభాగాలను కదిలించాం. ‘సెలబ్రిటీలతో విందుకు ఇరవై ఐదువేలరూపాయలు’ ద్వారా కొన్ని లక్షల ఆదాయాన్ని సమకూర్చాం. టాటా, జిందాల్, గూగుల్‌వంటి సంస్థల ద్వారా వారికీ లాభదాయకమైన రీతిలో నిధులు పొందాం. కోచిలోని ప్రతి వ్యక్తీ తన వంతు సేవలు అందించారు. ఫలితంగా భారతదేశంలో తొలి బినాలే సాధ్యమైంది.

23 దేశాలనుంచి 89 మంది ఆర్టిస్ట్‌లు వచ్చారు. చిత్రకారులు, శిల్పులు, ఇన్‌స్టలేటర్స్, ఫొటోగ్రాఫర్లు, డాక్యుమెంటరీ మేకర్స్ తమ కళారూపాలను ప్రదర్శించారు. నృత్యగీతాలు, నాటకాలతో సాయంకాలాలు ఆహ్లాదంగా మారాయి. కోచి కోట, ఎర్నాకుళం చుట్టుపక్కల 14 స్థలాలు  సందర్శనీయాలయ్యాయి.  60 గ్యాలరీలు ఏర్పాటయ్యాయి. రోజూ 500 మంది ఇతర రాష్ట్రాల, విదేశీ టూరిస్ట్‌లు వచ్చారు. మొత్తం సందర్శకులు నాలుగు లక్షల మంది. బినాలే ముందు కోచీ వేరు తర్వాత వేరు. డిసెంబర్ 2014లో రెండవ బినాలేకు ‘కోచీ’ ముస్తాబవుతోంది!
 
 ఆర్టిస్ట్‌లకు మీ సలహా...

 ఎవ్వర్నీ అనుకరించకండి. వర్క్- వర్క్-వర్క్!  నిరాశకు లోనుకాకండి. ఆర్ట్‌ను మీరు రక్షిస్తే అది మిమ్ములను, సమాజాన్నీ రక్షిస్తుంది!
 
 -పున్నా కృష్ణమూర్తి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement