every household
-
ఇంటికో జాబు..అంతా డాబు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారంలోకి వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని హామీలు గుప్పించారు. నిరుద్యోగులు, చిరుద్యోగులు, ప్రజలు నమ్మారు. భవిష్యత్‌పై భరోసా ఇచ్చారని భావించి పదేళ్ల తర్వాత టీడీపీకి అధికారమిచ్చారు. అయితే చేతికి అధికారం చిక్కిన తరువాత ఏరుదాటాక బోడి మల్లన్న చందంగా ఓట్లేసిన ప్రజల్ని వంచించే కార్యక్రమం మొదలు పెట్టేసింది ప్రభుత్వం. ఉన్న ఉద్యోగస్తులను తొలగించే కార్యక్రమం చేపట్టింది. టీడీపీ దృష్టిలో ఉద్యోగ కల్పన అంటే పాత వారిని తొలగించి, కొత్తవారిని నియమించడమేనా? జాబు కావాలంటే బాబు రావాలన్నది అంతా డాబేనా? అని విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు చర్చించుకుం టున్నారు. ఉపాధి హామీ పథకం ఫీల్ట్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు..ఇలా తమకు గుర్తుకొచ్చినోళ్లందరినీ తొలగించేయాలని ప్రభుత్వం యోచించడం దారుణమంటూ మండిపడుతున్నారు. ఫీల్డ్ అసిసెంట్లపై వేటుకు యోచనమహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలైన దగ్గరి నుంచి గ్రామస్థాయిలో నిరుద్యోగ యువతీయువకులు ఫీల్డ్ అసిసెంట్లుగా పనిచేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పనుల పర్యవేక్షణ చేస్తూ, మస్తర్తు వేస్తూ అటు అధికారులకు, ఇటు ఉపాధి వేతనదారులకు సంధాన కర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న ఫీల్ట్ అసిసెంట్లు ఉపాధి హామీ పథకం అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఇప్పుడా ఉద్యోగులందర్నీ తొలగించేయాలని అధికారంలోకి వచ్చిన టీడీపీ పావులు కదుపుతోంది. ఈ మేరకు సంబంధిత అధికారులకు సూచన ప్రాయంగా ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు ఇరకాటంలో పడ్డారు. కానీ, పాలకుల నుంచి ఒత్తిళ్లొస్తున్నాయి. దీంతో ముందుకెళ్లలేక, వెనక్కి తగ్గలేక సతమతమవుతున్నారు. ఎవరై నా తప్పు చేస్తే వేటు వేయవచ్చని, అటువంటిదేమీ లేకపోయినా ఉద్యోగంలోంచి తొలగించడమంటే కష్టమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పుకొస్తున్నారు. అదే జరిగితే జిల్లాలో 960 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధిని కోల్పోతారు. ఆదర్శ రైతులదీ అదే పరిస్థితి గ్రామస్థాయిలో ఉన్న ఆదర్శ రైతులు వ్యవసాయ పరంగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అటు అధికారులకు, ఇటు రైతులకు మధ్య వారధిగా నిలుస్తున్నారు. కానీ, టీడీపీ పాలకులకు వారిపై కన్నుకుట్టింది. వారిపై వేటు వేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు సూచన ప్రాయ ఆదేశాలిచ్చింది. ఆదేశాలను అమలు చేసే విషయంలో అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. ఈ నిర్ణయం అమలైతే జిల్లాలో 1438 మంది ఆదర్శ రైతులు జీవనోపాధిని కోల్పోతారు. వారి కుటుంబీకులందరికీ ఆకలి కేకలు తప్పవు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులూ ఔట్.. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్నీ ప్రభుత్వం వదలడం లేదు. తక్కువ జీతంతో పనిచేస్తు న్న చిరుద్యోగులపై వేటేయాలని చూస్తోంది. ఈమేరకు శాఖ ల వారీగా ఎంత మంది పనిచేస్తున్నారో గుర్తించి నివేదిక కూడా తయారు చేసింది. ఇప్పటివరకు ఉన్న సమాచారమైతే అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి సుమారు 20వేలమంది వరకు ఉన్నారు. వీరందర్నీ ఒకేసారి తొలగించేందుకు సన్నద్ధమవుతోంది. అదే జరిగితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను నమ్ముకున్న వారంతా రోడ్డున పడతారు. ఇంటికొక ఉద్యోగమంటే ఉన్న ఉద్యోగస్తులను తొలగిం చి కొత్తవారికి ఇవ్వడమేనా? అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా అక్కసుతో చేస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. చేతనైతే కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలే తప్ప వారి పార్టీ శ్రేణుల కోసం పాత వారిని బలిచేయడం మహాతప్పిదమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క ర్నీ తొలగించుకుంటూ పోతే మరో ఉద్యమాన్ని చూడాల్సి వస్తుందని సంబంధిత ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. -
అంతన్నారు.. ఇంతన్నారు..
ఏలూరు/ పాలకోడేరు రూరల్ : ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి.. ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నమ్మిన చిరుద్యోగుల ఆవేదన ఇది. ఇలా చేస్తుంటే ఇక తమకేం ఉద్యోగాలు చూపిస్తారని నిరుద్యోగుల నిరాశపడుతున్నారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామాల్లో ఉపాధి హామీ పనుల గుర్తింపు మొదలు, కూలీలను పనులకు రప్పించేందుకు క్షేత్ర స్థాయిలో చేసే వీరి సేవలు కీలకం. ఆరేళ్ల నుంచి క్షే త్రస్థాయిలో పనిచేస్తున్న తమను తొలగించాలని ప్రభుత్వం యోచించటం దుర్మార్గమని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన చెందుతున్నారు. దీనిపై అప్పుడే ప్రజా సంఘాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థ 2008లో ప్రారంభమైంది. ఇప్పటికీ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం మేరకు ఏ సంవత్సరం పూర్తి స్థాయిలో ఉపాధి హామీ పనులు జరగలేదు. ఇక ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోతే పరిస్థితి ఏమిటనేది ప్రశ్న. కూలీలు-అధికారులకు వారధి క్షేత్ర సహాయకులు(ఫీల్డ్ అసిస్టెంట్) కూలీల చేత పనులు చేయించటమే కాకుండా అటు కూలీలకు, ఇటు ఉపాధి హామీ పథకం అధికారులకు వారిధిలా పనిచేస్తున్నారు. కూలీలకు పని కల్పించడం వారి ముఖ్య విధి. వీరికి నెల వేతనం రూ.5 వేలు. ఈ వేతనం కూడా రెండు మూడు నెలలు బకాయిలు ఉంటాయి. దాంతో వారు ఇబ్బందులు పడుతూ ఉద్యోగం చేస్తూ వస్తున్నారు. భవిష్యత్తులో ఉద్యోగం పర్మినెంట్ అవుతుందన్న ఆశతో ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తూ వచ్చారు. వారిని తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకోవడం అన్యాయమని ప్రజా సంఘాల వాదన. జిల్లాలో సూమారు 400 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు మేట్లతో భర్తీ చేసే అవకాశం! జిల్లాలో 318 మంది సీనియర్ మేట్లు పనిచేస్తున్నారు. 15, 20 పని సంఘాలకు కలిపి పనుల పర్యవేక్షణకుగాను వీరికి ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తం 17వేల పని సంఘాలు, 3వే ల వికలాంగ సంఘాలు ఉపాధి హామీ పనులు చేస్తున్నాయి. దీంతో పర్యవేక్షణ పక్కదారి పట్టకుండా ఉపాధి పనులను గాడిన పెట్టేలా ప్రభుత్వ నిర్ణయం ఉండాలని కూలీలు కోరుతున్నారు. దీని వెనుక రాజకీయ కోణం? అవశేష అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని నిర్ణయించుకోవటం వెనుక రాజకీయ కోణం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదర్శ రైతు పథకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించి అమలు చేశారు. ఉపాధి హామీ పథకం ఆయన హయాంలో రాష్ట్రంలో ఊపందుకుంది. పదో తరగతిలో గ్రామంలో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఫీల్డ్ అసిస్టెంట్లుగా, ఆదర్శ రైతులుగా ఎంపిక చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లుగా, ఆదర్శ రైతులుగా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను ఎంపిక చేశారని అప్పట్లో టీడీపీ అధినేత, నాయకులు ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులను తొలగించాలనే అభిప్రాయానికి అప్పట్లోనే వచ్చారని, ఇప్పుడు ఆ పని పూర్తి చేసేలా ఉన్నారని భావిస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్నపుడు రైతులపై కక్షసాధించిన బాబు, ఇప్పుడు చిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులపై క్షక సాధింపునకు పూనుకున్నారని పలువురి విమర్శ. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తే సహించేది లేదు: తెల్లం బాలరాజు కొయ్యలగూడెం: రాక రాక పాలనకొచ్చేసరికి టీడీపీ నియంతృత్వ విధానాలను అవలంబిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని వైసీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు విమర్శించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తోందని, దీనిని అడ్డుకుని తమకు న్యాయం చేయాలంటూ మండల ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం బాలరాజున కోరారు. ఆయన స్పందిస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 600 మంది ఫీల్ట్ అసిస్టెంట్లను తొలగిస్తే వారి జీవితాలు ఏమవుతాయో యోచించారా అని ప్రశ్నించారు. 2008 నుంచి పనిచేస్తున్న వీరికి జీవనాధారం ఎలా క ల్పిస్తారో తెలిపిన తరువాతే తొలగింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. అదేవిధంగా ఆదర్శరైతులను తొలగింపు నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నదన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 30 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారాగా ఖర్చుచేసిన సీఎం చంద్రబాబు గురువిందలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఎలాగూ రైతురుణమాఫీలో విఫలమవుతాననే ఉద్దేశంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇటువంటి పనులు చేస్తే తిరుగుబాటు తప్పదని బాలరాజు హెచ్చరించారు.