ఇంటికో జాబు..అంతా డాబు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారంలోకి వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని హామీలు గుప్పించారు. నిరుద్యోగులు, చిరుద్యోగులు, ప్రజలు నమ్మారు. భవిష్యత్‌పై భరోసా ఇచ్చారని భావించి పదేళ్ల తర్వాత టీడీపీకి అధికారమిచ్చారు. అయితే చేతికి అధికారం చిక్కిన తరువాత ఏరుదాటాక బోడి మల్లన్న చందంగా ఓట్లేసిన ప్రజల్ని వంచించే కార్యక్రమం మొదలు పెట్టేసింది ప్రభుత్వం. ఉన్న ఉద్యోగస్తులను తొలగించే కార్యక్రమం చేపట్టింది. టీడీపీ దృష్టిలో ఉద్యోగ కల్పన అంటే పాత వారిని తొలగించి, కొత్తవారిని నియమించడమేనా? జాబు కావాలంటే బాబు రావాలన్నది అంతా డాబేనా? అని విశ్లేషకులు, రాజకీయ పరిశీలకులు చర్చించుకుం టున్నారు. ఉపాధి హామీ పథకం ఫీల్ట్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు..ఇలా తమకు గుర్తుకొచ్చినోళ్లందరినీ తొలగించేయాలని ప్రభుత్వం యోచించడం దారుణమంటూ మండిపడుతున్నారు.
ఫీల్డ్ అసిసెంట్లపై వేటుకు యోచనమహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలైన దగ్గరి నుంచి గ్రామస్థాయిలో నిరుద్యోగ యువతీయువకులు ఫీల్డ్ అసిసెంట్లుగా పనిచేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పనుల పర్యవేక్షణ చేస్తూ, మస్తర్తు వేస్తూ అటు అధికారులకు, ఇటు ఉపాధి వేతనదారులకు సంధాన కర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న ఫీల్ట్ అసిసెంట్లు ఉపాధి హామీ పథకం అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఇప్పుడా ఉద్యోగులందర్నీ తొలగించేయాలని అధికారంలోకి వచ్చిన టీడీపీ పావులు కదుపుతోంది. ఈ మేరకు సంబంధిత అధికారులకు సూచన ప్రాయంగా ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు ఇరకాటంలో పడ్డారు. కానీ, పాలకుల నుంచి ఒత్తిళ్లొస్తున్నాయి. దీంతో ముందుకెళ్లలేక, వెనక్కి తగ్గలేక సతమతమవుతున్నారు. ఎవరై నా తప్పు చేస్తే వేటు వేయవచ్చని, అటువంటిదేమీ లేకపోయినా ఉద్యోగంలోంచి తొలగించడమంటే కష్టమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పుకొస్తున్నారు. అదే జరిగితే జిల్లాలో 960 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధిని కోల్పోతారు.
ఆదర్శ రైతులదీ అదే పరిస్థితి
గ్రామస్థాయిలో ఉన్న ఆదర్శ రైతులు వ్యవసాయ పరంగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అటు అధికారులకు, ఇటు రైతులకు మధ్య వారధిగా నిలుస్తున్నారు. కానీ, టీడీపీ పాలకులకు వారిపై కన్నుకుట్టింది. వారిపై వేటు వేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు సూచన ప్రాయ ఆదేశాలిచ్చింది. ఆదేశాలను అమలు చేసే విషయంలో అధికార యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. ఈ నిర్ణయం అమలైతే జిల్లాలో 1438 మంది ఆదర్శ రైతులు జీవనోపాధిని కోల్పోతారు. వారి కుటుంబీకులందరికీ ఆకలి కేకలు తప్పవు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులూ ఔట్..
వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్నీ ప్రభుత్వం వదలడం లేదు. తక్కువ జీతంతో పనిచేస్తు న్న చిరుద్యోగులపై వేటేయాలని చూస్తోంది. ఈమేరకు శాఖ ల వారీగా ఎంత మంది పనిచేస్తున్నారో గుర్తించి నివేదిక కూడా తయారు చేసింది. ఇప్పటివరకు ఉన్న సమాచారమైతే అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి సుమారు 20వేలమంది వరకు ఉన్నారు. వీరందర్నీ ఒకేసారి తొలగించేందుకు సన్నద్ధమవుతోంది. అదే జరిగితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను నమ్ముకున్న వారంతా రోడ్డున పడతారు.
ఇంటికొక ఉద్యోగమంటే ఉన్న ఉద్యోగస్తులను తొలగిం చి కొత్తవారికి ఇవ్వడమేనా? అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా అక్కసుతో చేస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. చేతనైతే కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలే తప్ప వారి పార్టీ శ్రేణుల కోసం పాత వారిని బలిచేయడం మహాతప్పిదమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క ర్నీ తొలగించుకుంటూ పోతే మరో ఉద్యమాన్ని చూడాల్సి వస్తుందని సంబంధిత ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.