సంబరాల పరేడ్
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: అది చరిత్రకు సాక్ష్యం.. చారిత్రక నేపథ్యానికి సజీవ దృశ్యం.. దేశభక్తిని చాటే వేదిక అది.. అదే సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానం. ఏడెకరాల సువిశాల స్థలంలో ఆవరించి ఉన్న ఈ మైదానానికి ఘనచరిత్ర ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా పంద్రాగస్టు వేడుకలకు మైదా నం ముస్తాబవుతోంది. విద్యార్థులు, పోలీసు బలగాల కవాతు రిహాల్స్తో ఇప్పటికే సందడిగా మారింది.
తొలుత క్రైస్తవ ప్రార్థనలు..
17వ శతాబ్దం నుంచి ఈ మైదానాన్ని క్రైస్తవులు ప్రార్థనలకు వినియోగించుకునే వారు. అప్పట్లో దీనిని సెయింట్ జోసెఫ్ క్యాథ్రల్ గ్రౌండ్‌గా పిలిచే వారు. కాలక్రమేణా సైనిక శిక్షణ కేంద్రంగా మారింది. నిజాంల హయాం లో ఇక్కడే సైనికులకు శిక్షణా శిబిరాలను నిర్వహించే వారు. తెల్లదొరలు, నిజాం పాలకులు సైనిక వందనం స్వీకరించడం కోసం ఈ మైదానాన్నే వేదికగా చేసుకునే వారు.
స్వాతంత్య్రానంతరం..
దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత 1948లో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ అధికారులు దీనికి పరేడ్ మైదానంగా నామకరణం చేశారు. అప్పటి నుంచే ఇక్కడ గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలు జరుగుతున్నాయి. ఏటా జనవరి 26న గవర్నర్, ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఈ మైదానంలోనే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు.
16 మంది ముఖ్యమంత్రులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడిన తరువాత 1957 నుంచి 2012 వరకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 55 సార్లు స్వాతంత్య్ర దినోత్సవాలు జరిగాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేసిన 17 మందిలో 16 మంది ఇక్కడ జాతీయ పతకాన్ని ఎగురవేశారు.
తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మొదలు ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు ఇక్కడ జాతీయ పతాకాలను ఎగురవేయగా.. నెల రోజుల పాటు సీఎంగా కొనసాగిన నాదెండ్ల భాస్కర్‌రావుకు మాత్రం ఆ అవకాశం లభించలేదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు సైతం ఇక్కడే గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగేవి. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన బూర్గుల రామకష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
21 మంది గవర్నర్లు
1954 నుంచి 2013 వరకు ఇక్కడ 59 సార్లు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్రానికి 22 మంది గవర్నర్లుగా పని చేయగా, 21 మంది ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వీరిలో రాష్ట్ర తొలి గవర్నర్‌గా పని చేసిన సీఎం త్రివేది నుంచి ప్రస్తుత గవర్నర్ నరసింహన్ వరకు ఉన్నారు. 1997లో గవర్నర్‌గా కొద్ది నెలలు మాత్రమే పని చేసిన రామానుజానికి పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసే అవకాశం రాలేదు.
ఆదివారం ఆట విడుపు
ఆదివారం వచ్చిందంటే చాలు ఈ మైదానం ఆటవిడుపుకు కేంద్రంగా మారుతోంది. నగరంలోని వందలాది మంది యువకులు, విద్యార్థులు సూర్యోదయాన్నే ఇక్కడికి చేరుకుని క్రికెట్ డుతుంటారు. సెలవు దినాల్లో క్రీడల సందడే ఇక్కడ రోజంతా కనిపిస్తుంది.
అమర జవాన్ల స్థూపం
కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన సుమారు వంద మంది అమర జవాన్ల స్మారకార్థం పరేడ్ మైదానంలో మిలటరీ అధికారులు స్థూపాన్ని నిర్మించారు. కార్గిల్ అమర్ జవాన్ స్థూపంగా నామకరణం చేశారు. 2000 నుంచి రెండేళ్ల పాటు సాగిన నిర్మాణ పనుల అనంతరం దీన్ని జాతికి అంకితమిచ్చారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ స్థూపం వద్ద ముఖ్యమంత్రి, గవర్నర్ ఇతర మిలటరీ అధికారులు పుష్పగుచ్ఛాల నుంచి నివాళులు అర్పించడం ఆనవాయితీ. కార్గిల్ దివాస్ పేరుతో ఏటా జూన్‌లో ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.