వినపడని కుయ్..కుయ్
దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన అద్భుత పథకం 108. ఈ అంబులెన్స్ సేవ వల్ల ఎంతో మంది ప్రాణాపాయం నుంచి బయట పడగలిగారు. ఇతర రాష్ట్రాలకు సైతం మార్గ దర్శకంగా ఉన్న ఈ పథకం నేడు తెలుగు రాష్ట్రం లోనే కొన్ని మండలాల్లో అమలు కావడం లేదు. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు 108 వాహనం లేక ప్రైవేట్ వాహనాలకు డబ్బులు చెల్లించలేక డిండి మండల ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు.
డిండి : అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు వెంటనే సమీప ఆస్పత్రికి బాధితులను తరలించే ఉద్దేశంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ అందించే సేవలకు డిండి మండల ప్రజలు నోచుకోవడం లేదు. హైదరాబాద్–శ్రీశైలం రోడ్డుపై ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండలం లోని 16గ్రామ పంచాయతీల్లో 11 సబ్సెంటర్లున్నా యి. మండల పరిధిలోని వీరబోయనపల్లి, సింగరాజుపల్లి, రహమంతపూర్, తవక్లాపూర్, కందుకూర్, బ్రా హ్మణపల్లి, వావిల్‌కొల్, టి గౌరారం, కామేపల్లి, గోనబోయినపల్లి, ప్రతాప్‌నగర్, ఖానాపూర్, చెర్కుపల్లి, బొగ్గులదొన తదితర గ్రామాల ప్రజలు దాదాపు 20కిలోమీటర్ల దూరం నుంచి వైద్య సేవలకు వందల సంఖ్యలో ప్రతినిత్యం మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి వస్తుంటారు. ఆయా గ్రామాల్లోని ప్రజలకు ఏదైనా అత్యవసర వైద్య పరిస్థితి ఏర్పడితే డిండికి 108 అంబులెన్స్ సౌకర్యం లేక సమీప మండలాలైన దేవరకొండ, వంగూరు, అచ్చంపేట అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తుంది. ఆ సమయంలో అక్కడ కూడా లేకుంటే వారి ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
పీహెచ్సీలో సిబ్బంది కొరత..
స్థానిక మండల కేంద్రంలోని పీహెచ్సీలో సిబ్బంది కొరత కొన్నేళ్లనుంచి కొనసాగుతూనే ఉంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 24 గంటల వైద్య సౌకర్యానికి ఇద్దరు వైద్యులు ఉండాలి కానీ ఇక్కడ ఒక్క డాక్టర్ మాత్రమే విధులు నిర్వహిస్తుండడంతో మండల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 22 మంది ఏఎన్‌ఎంలకుగాను 14 మంది ఉద్యోగులు ఉంటూ 8 ఖాళీలు, ఎంపీహెచ్ఏ మేల్ 1, పీఎస్ఓ 1 పోస్టులు ఖాళీలున్నాయి.
అత్యవసర పరిస్థితి వస్తే అంతే సంగతులు..
మండలంలోని మారుమూల గ్రామాల్లో ప్రజలకు ముఖ్యంగా రాత్రి సమయాల్లో కాన్పులు జరుతుగున్న గర్భిణులు ఇబ్బందులకు గురవుతున్నామని వారు పే ర్కొంటున్నారు. ఎమర్జెన్సీ అపుడు డిండి నుంచి హైదరాబాద్‌కు ప్రైవేటు వాహనాల్లో తరలించడానికి 3 గం టల సమయం పడుతుందని, ఎమర్జెన్సీ ప్రభుత్వ వాహనమైన 108 అంబులెన్స్ గంటన్నర వ్యవధిలోనే చేరుతుందని వారు పేర్కొంటున్నారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
మండలానికి 108 అంబులెన్స్ సౌకర్యం లేక పోవడంతో రోగులు ఇబ్బందులు ఎదరుర్కొంటున్న మాట వాస్తవమే. ఈ విషయంతో పాటు పీహెచ్సీలో సిబ్బంది కొరతను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు.