Ex Maoist
-
వరుస ఎన్ కౌంటర్లతో మావోయిజాన్ని ఆపలేరు
-
అప్పుడు జనజీవనంలో కలిసి.. ఇప్పుడు మందుపాతరకే బలి
రాయ్‌పూర్: దాదాపు రెండేళ్ల తర్వాత.. దంతేవాడ ఉదంతంతో ఛత్తీస్‌గఢ్ పోలీసు శాఖకు భారీ నష్టం వాటిల్లింది. పది మంది పోలీస్ సిబ్బంది మావోయిస్టుల ఘాతుకానికి బలయ్యారు. స్థానిక పండుగను ఆసరాగా తీసుకుని మావోయిస్టులు 50 కేజీల ఐఈడీతో సిబ్బంది కాన్వాయ్‌పై దాడికి పాల్పడగా.. నిర్లక్ష్యం పదిమంది పోలీసులు, ఒక డ్రైవర్ మొత్తం పదకొండు మంది ప్రాణాల్ని బలిగొంది. అయితే మరణించిన పది మంది డీఆర్జీ(డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్) సిబ్బందిలో.. ఐదుగురు మాజీ మావోయిస్టులేనని అధికారులు చెప్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ జోగా సోధి(35), మున్నా కడ్తి(40), కానిస్టేబుల్స్ హరిరామ్ మాండావి(36), జోగా కవాసి(22), గోప్నియా సైనిక్(సీక్రెట్ ట్రూపర్స్), రాజురామ్ కార్తమ్(25).. గతంలో మావోయిస్టులని.. కొన్నేళ్ల కిందటే లొంగిపోయి డీఆర్జీలో చేరారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. మంచి జీవితం కోసం పాకులాడిన ఆ ఐదుగురు ఇలా అర్థాంతరంగా మావోయిస్టుల చేతిలో బలికావడం భాదాకరమని పేర్కొన్నారాయన. ► మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంగా ఉన్న బస్తర్ డివిజన్లో డీఆర్జీ విభాగంలో స్థానిక యువతను, లొంగిపోయిన మావోయిస్టులనే రిక్రూట్ చేసుకుంటుంది ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ. విద్యార్హతను పెద్దగా ప్రామాణికంగా తీసుకోదు కూడా!. ఈ క్రమంలోనే.. మావోయిస్టు గ్రూపుల నుంచి ఒక్కొక్కరిగా బయటకు వచ్చిన ఆ ఐదుగురు.. డీఆర్జీలో చేరారు. సుక్మా జిల్లా అర్లంపల్లికి చెందిన సోధి, దంతేవాడ ముదర్ గ్రామానికి చెందిన కడ్తి 2017లో డీఆర్జీలో చేరారు. అదేవిధంగా మాండావి 2020, కార్తమ్ 2022లో పోలీస్ ఫోర్స్‌లో చేరారు. దంతేవాడ బడే గదమ్ గ్రామానికి చెందిన కవాసి మాత్రం కిందటి నెలలోనే డీఆర్జీలో చేరాడు అని ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. ► డీఆర్జీ.. District Reserve Guard (DRG) ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ పరిధిలోని విభాగం. బస్తర్ డివిజన్లోని ఏడు జిల్లాల్లో డీఆర్జీ సిబ్బందిని మోహరించారు. గత మూడు దశాబ్దాలుగా బస్తర్ రీజియన్‌లో పేట్రేగిపోతున్న మావోయిస్టులను అణచివేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో.. డీఆర్జీతో పాటు ఇతర సాయుధ బలగాల సిబ్బంది ప్రాణాలు కోల్పోతూ వస్తన్నారు. ► డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్‌ను 2008లో ఉత్తర బస్తర్ కన్కర్, అబుజ్మద్ నారాయణ్పూర్లలో మోహరించారు. ఐదేళ్ల తర్వాత బీజాపూర్, బస్తర్ జిల్లాలకు డీఆర్జీ బలగాలను విస్తరించారు. ఆ మరుసటి ఏడాది సుక్మా, కొండాగావ్ జిల్లాలకు, చివరికి.. 2015లో దంతేవాడకు డీఆర్జీని విస్తరించింది ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ. ► బుధవారం దంతేవాడ నుంచి అర్నర్పూర్కు డీఆర్జీ బలగాలను తీసుకొచ్చేందుకు ఏడు వాహనాలతో కాన్వాయ్ వెళ్లింది. ఆ సమయంలో ఆ దారిలో కొందరు పిల్లలు పండుగ కోసం వచ్చీపోయే వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో పరిస్థితి సాధారణంగానే ఉందనుకుని.. అదే రూట్లో పోలీస్ సిబ్బందితో కాన్వాయ్ తిరుగు పయనం అయ్యింది. కానీ, మావోయిస్టులు పిల్లలను పక్కకు పంపించేసి.. యాభై కేజీల ఐఈడీని అమర్చి దాడికి పాల్పడ్డారు. ఇదీ చదవండి: ప్రధాని మోదీకి కన్నీటి విన్నపం -
ఇమడలేకే లొంగిపోయాను!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు గతి తప్పాయని, ప్రజలకు దూరమైన మావోయిస్టులు వారిపైనే దాడులకు పాల్పడుతూ, అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారని ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు సత్వాజీ అలియాస్ సుధాకర్, అలియాస్ కిరణ్ అలియాస్ శశికాంత్ పేర్కొన్నారు. బుధవారం సుధాకర్ ఆయన భార్య అరుణ (అలియాస్ నీలిమ అలియాస్ మాధవి)తో కలసి డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయాడు. తాము లొంగిపోవడానికి కారణాలను సుధాకర్ మీడియాకు వివరించారు. ‘బిహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో ప్రజలకు పార్టీ పూర్తిగా దూరమైంది. అక్కడి పార్టీ శ్రేణుల్లో కుటుంబ పాలన, బంధుప్రీతి, అక్రమ వసూళ్లు పెరిగిపోయాయి. తెలంగాణలో మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పని చేసిన నాకు ఎక్కడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కానరాలేదు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా బిహార్, జార్ఖండ్‌లో పనిచేసిన సమయంలో అడుగడుగునా సిద్ధాంతాల ఉల్లంఘన కన్పించింది. తొలుత ఇది కిందిస్థాయి వరకే పరిమితమైందనుకున్నా.. అగ్రనాయకుల దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లా. వారికి కూడా అక్కడి అకృత్యాలపై నియంత్రణ లేదన్న సంగతి చాలా ఆలస్యంగా నాకు అర్థమైంది. పార్టీ విధానం మారాలని, ప్రజలకు దూరమవుతున్నామని పలుమార్లు సీనియర్లకు చెప్పి చూశాను. అయినా లాభం లేకపోయింది. పైగా ప్రజలపైనే దాడులు, వారి వద్దే అక్రమ వసూళ్లు నాలో కలత రేపాయి. పార్టీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో శారీరక వేధింపుల్లేవు. కానీ సంప్రదాయ సమాజంలో అనాదిగా వస్తున్న పితృస్వామ్యమే అక్కడా తిష్టవేసింది. దీనివల్ల మహిళా సభ్యులకు వివిధ రూపాల్లో ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోలీసులకు పట్టుబడ్డ సమయంలో మా సోదరుడి వద్ద దొరికిన రూ.25 లక్షలు పార్టీవే. దానికి అన్ని లెక్కలు పార్టీ అకౌంట్స్ వద్ద ఉన్నాయి. నేనెప్పుడూ నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం డబ్బు వసూళ్లకు పాల్పడలేదు. నన్ను పార్టీ సస్పెండ్ చేయలేదు. పార్టీ విధానాలు నచ్చకే తప్పుకొంటున్నట్లు ఏడాదిగా చెబుతున్నా. నా భార్యతో కలిసి బయటకి వస్తున్నట్లు లేఖ రాసి వచ్చా’అని వివరించారు. అనారోగ్యం, విభేదాలే కారణం: అరుణ పార్టీలో పలువురి ఆధిపత్య ధోరణి నచ్చకే తాము బయటికి వచ్చామని అరుణ వివరించారు. వాస్తవ సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకంగా పార్టీ నడుచుకుంటోందని, దీనిపైనే విభేదించే పార్టీని వీడినట్లు తెలిపారు. పార్టీలో మహిళలపై శారీరకంగా అఘాయిత్యాలు జరగట్లేదని, అయితే ఆధిపత్యం చెలాయించడం, ఒత్తిళ్లు చేయడం వల్లే పలువురు మహిళా మావోయిస్టులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. వేధింపులతోనే మహిళా మావోలు ఆత్మహత్యలు: డీజీపీ మావోయిస్టు పార్టీ బలహీనపడిందని, మిలీషియా సంఖ్య 500కు పడిపోయిందని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. అగ్రనేతల్లో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని పేర్కొన్నారు. మహిళా దళ సభ్యులపై అకృత్యాలు పెరిగిపోయినట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. ఈ కారణంగానే పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అయితే ఇవేమీ ఇంతకాలం వెలుగుచూడలేదన్నారు. ‘సత్వాజీ లొంగుబాటు వెనుక చాలా పెద్ద తతంగమే నడిచింది. ఏడాది కింద అతడి సోదరుడు లొంగిపోయిన సమయంలోనే పార్టీ తీరుపై సెంట్రల్ కమిటీ సభ్యుడు సత్వాజీ అలియాస్ సుధాకర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుసుకున్నాం. ఈ క్రమంలోనే ‘ఇంటర్ స్టేట్ పోలీస్ కో–ఆర్డినేషన్ అండ్ కో–ఆపరేషన్’లో భాగంగా తెలంగాణ పోలీసులు జార్ఖండ్ పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేసి వారి సహకారంతో సత్వాజీ లొంగుబాటు సఫలీకృతం చేయగలిగాం. మావోయిస్టు పార్టీ అధినాయకత్వంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కీలకమైన దండకారణ్యంలోనూ ముఖ్యనేతలు సోనూ, దేవూజీల మధ్య, స్థానిక గిరిజన నేతలకు తెలంగాణ నాయకులకు మధ్య విభేదాలున్నాయి. మావోయిస్టు అగ్రనేత సంబాల కేశవరావు భార్య రామక్క (అలియాస్ శారద) 2010లో వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంది. బస్తర్‌కు చెందిన డీవీసీఎం చందన, కమాండర్ చుక్కీ, కోదాడకు చెందిన దళ సభ్యురాలు గడ్డం భాగ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న వారిలో ఉన్నారు. పార్టీ విధానాలు గతి తప్పుతున్న క్రమంలో చాలామంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా మావోయిస్టుల్లో కొనసాగుతున్న వారు లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. సుధాకర్ దంపతులపై ఉన్న రివార్డు (సుధాకర్‌పై రూ.25 లక్షలు, అరుణపై రూ.10 లక్షలు) మొత్తం రూ.35 లక్షలను వీరికే ఇస్తాం. ఆ డబ్బుతో వీరు కొత్త జీవితం మొదలుపెట్టొచ్చు. ఇక ఇతనిపై ఉన్న ఎన్ఐఏ కేసు మాత్రం సుధాకర్ న్యాయపరంగా ఎదుర్కోవాల్సిందే’అని డీజీపీ వివరించారు. సమావేశంలో ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, అడిషనల్ డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. అరుణ నేపథ్యమిదీ.. బిహార్, జార్ఖండ్ స్టేట్ కమిటీ సభ్యురాలుగా కొనసాగిన వైదుగుల అరుణ (అలియాస్ మాధవి, నీలిమ)ది వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం మామడపురం గ్రామం. 3వ తరగతి చదువుతున్నపుడే ఈమెకు బాల్య వివాహం జరిగింది. ఆ పెళ్లి అరుణకు ఇష్టం లేదు. 8వ తరగతిలో తమ గ్రామానికి వచ్చి విప్లవపాటలు పాడే మావోయిస్టు దళానికి ఆకర్షితురాలై దళంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1998లో సుధాకర్‌ను వివాహం చేసుకున్నారు. సుధాకర్ ప్రస్థానం ఇదీ! నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన సుధాకర్‌ది బీద కుటుంబం. 7వ తరగతి వరకు గ్రామంలోనే చదువుకున్న సుధాకర్.. నిర్మల్‌లో 8 నుంచి ఇంటర్‌వరకు చదివాడు. 1983లో ఇంటర్ చదువుతున్న క్రమంలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ)లో చేరి చదువు ఆపేశారు. ఆర్ఎస్యూ జిల్లా కమిటీ కార్యదర్శి కటకం సుదర్శన్ వద్ద చేరి దళంలో కొరియర్‌గా చేరారు. ఇర్రి మోహన్‌రెడ్డి వద్ద ఆయుధాల తయారీలో శిక్షణ పొందాడు. బెంగళూరులోని స్థావరంలో ఆయుధాలు తయారుచేసి దేశంలోని పలు దళాలకు చేరవేసేవాడు. 1986లో అరెస్టయి 1989 వరకు జైలు శిక్ష అనుభవించారు. జైలులో ఉన్న సమయంలో వరవరరావుతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటి కొచ్చాక వరవరరావుతో కలసి రైతు కూలీ సంఘంలో పనిచేశారు. 1990లో చెన్నారెడ్డి హయాంలో మావోలపై నిషేధం ఎత్తివేసినపుడు అజ్ఞాతం నుంచి బయటకొచ్చారు. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్తూపం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించాడు. పోలీసుల ఒత్తిడితో తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. అక్కడి నుంచి 1990లో దళంలో సభ్యుడిగా చేరిన సుధాకర్ 1999 నాటికి ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీలో, సబ్ కమిటీ ఆన్ మిలిటరీ అఫైర్స్‌లో సభ్యుడిగా ఎదిగాడు. 2001–03లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఛత్తీస్‌గఢ్‌లో, 2003–13 వరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా మిలిటరీ కమిషన్‌లో పనిచేశారు. 2013లో పదోన్నతిపై సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఈస్టర్న్ రీజనల్ బ్యూరో (ఈఆర్బీ)కి బదిలీ అయి బిహార్ రీజినల్ కమిటీలో పనిచేశారు. -
అడవిలో పోరాడి.. జీవితంలో ఓడి..!
మావోయిస్టు మాజీ నేత కోమళ్ల శేషగిరిరావు అలియాస్ గోపన్న(51) శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మావోయిస్టు ఉద్యమంలో ఆంధ్రా, ఒడిషా (ఏఓబీ) రాష్ట్రనేతగా పనిచేసి కొన్నేళ్ల క్రితం ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరిగిన మోసాలతో ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల శివారులో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాక్షి, భీమారం/కాజీపేట: మావోయిస్టు ఉద్యమానికి కీలకమైన ఏఓబీలో రాష్ట్ర నేతగా పని చేసి, అడవిలో అనేక దాడులకు నేతృత్వం వహించి పోలీసులకు లొంగిపోయిన మావో యిస్టు మాజీ అగ్రనేత కోమళ్ల శేషగిరిరావు అలియాస్ గోపన్న(51).. తర్వాతి జీవితంలో మాత్రం ఓడిపోయాడు. రియల్ ఎస్టేట్‌లో జరిగి న మోసం.. ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురై రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కాజీపేట–హసన్‌పర్తి రైల్వేస్టేషన్ల మధ్య ఉనికిచర్ల గేట్ వద్ద శుక్రవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోపన్న హన్మకొండ గోపాలపురంలోని వివేక్‌నగర్‌లో భార్య మంజుల అలియాస్ భారతి, కూతురు సుమశ్రీతో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఉదయం ఆయనఇంటి నుంచి కారులో బయటికి వచ్చాడు. అంతకు ముందు ఇంటి కి సమీపంలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి వెళ్లి కొద్దిసేపు ఉన్నాడు. తర్వాత కారులో వడ్డేపల్లి చర్చి క్రాస్ వద్దకు చేరుకుని అక్కడ కొద్దిసేపు తిరిగాడు. కారు డ్రైవర్‌ను ఇంటికి వెళ్లమని చెప్పి తాను రైల్వేట్రాక్ బాటపట్టాడు. దీం తో డ్రైవర్ కొంతదూరం వచ్చి.. గోపన్న మిత్రుడు చందర్‌కు ఫోన్ చేసి.. సమాచారమిచ్చాడు. చందర్ వెంటనే బైక్‌పై అటువైపు వెళ్లగా అప్పటికే గోపన్న రైల్వే ట్రాక్‌పైకి చేరుకొని 12.20 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ నుంచి దానాపూర్(పాట్నా) వెళ్లే ధానా పూర్ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిం చారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించగా సాయంత్రం పోస్టుమార్టం పూర్తి చేశారు. రాజమండ్రి భూవివాదంతోనే ఆర్థిక ఇబ్బందుల్లోకి.. ఆం«ధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలోని ఓ జమీందార్కు చెందిన సుమారు 135 ఎకరాల భూమి ని తాను కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నానని హైదరాబాద్‌కు చెందిన ఓ రియల్టర్ గోపన్నను నమ్మించాడు. అసలు భూయజమానితో తాను ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తానని గోపన్న దగ్గర కొంత నగదు తీసుకొని అగ్రిమెంట్ చేసుకున్నాడు. తర్వాత అదే భూమి ని గోపన్న రాజమండ్రికి చెందిన బిల్డర్ సుబ్బారెడ్డికి అమ్మేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆ భూమిపై వివాదం ఏర్పడింది. హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ తనను మో సం చేసినట్లు గోపన్న ఆలస్యంగా గుర్తించాడు. అదే సమయంలో అగ్రిమెంట్ చేసుకున్న సుబ్బారెడ్డి మాత్రం భూమి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి పెంచాడు. రెండుసార్లు గోపన్న రిజిస్ట్రేషన్‌కు సమయం ఇచ్చి రాలేదని సుబ్బారెడ్డి తెలిపాడు. సుబ్బారెడ్డి ఒత్తిడి పెంచడంతో అదే భూమిని గోపన్న డబ్బుల కోసం మరో రియల్టర్‌తో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిసింది. అగ్రిమెంట్లో గోపన్నకు మోసం.. హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ అగ్రిమెంట్లో మోసం చేసినట్లు గోపన్న గుర్తించారు. అగ్రిమెంట్ ఇచ్చిన వారు హైదరాబాద్‌కు చెందిన ఓ బలమైన రాజకీయ వర్గానికి చెందిన వారని తెలిసింది. గోపన్న ఏదైతే భూమి అగ్రిమెంట్ చేసుకున్నాడో దానిని అమ్మకానికి ఎవరితోనూ తాను ఒప్పందం చేసుకోలేదని భూమి యజ మానురాలు వెల్లడించడంతో అసలు విషయం బహిర్గతమైనట్లు తెలిసింది. గతేడాది గోపన్న కిడ్నాప్.. దాడి.. ఇదిలా ఉండగా రిజిస్ట్రేషన్ చేయడానికి గోపన్న గతేడాది రాజమండ్రికి వెళ్లారు. అక్కడ గోపన్న కిడ్నాప్‌నకు గురయ్యారు. మూడు రోజులపాటు గోపన్ననను అపహరించి, కిడ్నాపర్లు ఆయనను తీవ్రంగా గాయపరిచారు. చావు బతుకుల మధ్య గోపన్న ఇంటికి చేరుకున్నాడు. డబ్బుల కోసం ఒత్తిడి.. గోపన్నకు డబ్బులు ఇచ్చిన రియల్టర్ సుబ్బారెడ్డి డబ్బులు ఇవ్వమని గోపన్నపై ఒత్తిడి పెం చాడు. దీంతో గోపన్న సదరు వ్యక్తికి 15న డబ్బులు ఇస్తానని మెస్సేజ్ పంపారు. మెస్సెజ్ ప్ర కారం రియల్టర్ తన డబ్బులు తీసుకునేందుకు హన్మకొండకు వచ్చాడు. అయితే డబ్బులు సమకూరకపోవడంతో ఆయన ఆందోళనకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. కేటీఆర్ ముందు మొర.. రాజమండ్రిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హైదరాబాద్ రియల్టర్ తనకు చేసిన మోసాన్ని మంత్రి కేటీఆర్ ముందు గోపన్న మొరపెట్టుకున్నట్లు తెలిసింది. రాజమండ్రికి చెందిన ఓ ఎమ్మెల్యే ఫోన్లో బెదిరింపులకు గురిచేస్తున్న విషయాన్ని కూడా గోపన్న ఆయనకు వివరించారని సమీప బంధువులు పేర్కొన్నారు. అడవిలో ఉన్నప్పుడు బతికితివి కాదే అన్న అడవిలో ఉన్నప్పుడే బతికితివి కాదే అన్న.. నిన్ను ఎలా చూడాలే అన్న.. అడివిలో కాపాడిన దేవుడు.. ఇప్పుడు ఏటూ పోయిండే అన్న.. నీ బిడ్డకు దిక్కేవరే అన్న.. అంటూ గోపన్న మృతదేహంపై ఆయన సోదరి పద్మ విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. కూతురంటే మహాప్రాణం.. గోపన్న, మంజుల పెంపుడు కూతురు సుమశ్రీ అంటే గోపన్నకు ఎంతో ప్రేమ. నిత్యం సుమ.. సుమ అని పిలిచేవాడు. సుమశ్రీ ఎస్ఆర్ స్పా ర్కిల్ పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. గోపన్న తండ్రి ధర్మారావు మూడేళ్ల క్రితం, తల్లి సావిత్రి ఐదేళ్ల కిత్రం చనిపోయారు. సంఘటన స్థలానికి ఎర్రబెల్లి, జంగా సమాచారం అందుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి చేరుకొని పట్టాలపై చెల్లాచెదురైన శరీరవయవాలను పరిశీలించారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్.. మిత్రులారా దయచేసి క్షమించండి.. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి.. నా కూతురు, భార్య గురించి ఆలోచించండి. కుటుంబ సభ్యులారా తప్పు చేశాను. నమ్మి మోసపోయాను. నా కుటుంబాన్ని దిక్కులేకుండా చేసి పోతున్నాను. తల్లీ క్షమించు బిడ్డా.. అమ్మను బాధపెట్టకు. అమ్మ అమాయకురాలు.. న్యక్షా లవ్ యూ, మిస్ యూ.. నిన్ను కష్టపెట్టి ఉంటే క్షమించు. ఒక మనిషి ఎంత ఎదగగలడో.. ఎంత దిగజారగలడో నా జీవితం ఉదాహరణ. ఒక్క నిమిషం వీడక బతకాలనుకున్నాను. కానీ ఈ సాయంత్రం నేను ఇంకా మాటలు పడుతాను. ఆర్థికంగా నష్టపోయాను’ అని నోట్లో పేర్కొన్నాడు. నేడు శివముక్తిధామంలో అంత్యక్రియలు వరంగల్ క్రైం: మావోయిస్టు మాజీ అగ్రనేత కోమళ్ల శేషగిరిరావు అలియాస్ గోపన్న ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. హన్మకొండ పద్మక్షి కాలనీలోని శివముక్తిధామంలో శనివారం ఉదయం 10 గంటలకు గోపన్న అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. -
మావోయిస్టు మాజీ నేత గోపన్న ఆత్మహత్య
వరంగల్ అర్బన్: మావోయిస్టు మాజీ నేత గోపన్న అలియాస్ శేషగిరిరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హసన్‌పర్తి మండలం కోమటిపల్లి వద్ద వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో ఈయన మావోయిస్టు దండకారణ్యం కమిటీ మిలటరీ కమాండర్‌గా పనిచేశాడు. కొంతకాలంగా స్థానిక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఈయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టె గ్రామానికి చెందినవాడు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని బంధువులు చెబుతున్నారు. ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
పోలీసుల అదుపులో మాజీ మావోయిస్టు
సాక్షి, అర్వపల్లి: సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపు రానికి చెందిన తెలంగాణ మహాజన సమాజం రాష్ట్ర కన్వీనర్, మాజీ మావోయిస్టు నేత శ్రీరాముల శ్రీనివాస్ అలియాస్ సుదర్శన్‌ను గుజరాత్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ కోర్టులో హాజరై బయటకు వస్తుండగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌పై గుజరాత్లో ఓ కేసు పెండింగ్‌లో ఉండటంతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఓ కేసులో నెల రోజుల క్రితం అరెస్టు అయిన శ్రీనివాస్ 8 రోజుల క్రితమే బెయిల్‌పై బయటికి వచ్చారు. ఈయన గతంలో ఏవోబీ కార్యదర్శిగా పనిచేశారు. మూడేళ్ల క్రితం శ్రీనివాస్‌ను ఖమ్మం పోలీసులు అరెస్టు చేయగా, ఏడాది పాటు జైలులో ఉండి.. బెయిల్‌పై వచ్చారు. -
నయీం అనుచరుల లొంగుబాటు
నల్లగొండ: మావోయిస్టు వ్యతిరేక ఉద్యమ నాయకులు పాశం శ్రీను, సుధాకర్ శుక్రవారం నల్లగొండ ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరిపై ఇటీవల పోలీసులు పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న వీరిద్దరూ తమను పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో లొంగిపోయినట్లు తెలుస్తోంది. వీరిద్దరిపై సుమారు 100 కేసులున్నట్లు సమాచారం. మావోయిస్టు కొనాపూరి సాంబశివుడు, రాములు హత్యకేసుల్లో వీరిద్దరు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారు. కాగా సుధాకర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరి జడ్పీటీసీ సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పాశం శ్రీను, సుధాకర్‌లు మావోయిస్టు వ్యతిరేక ఉద్యమ నేత నయీంకు ముఖ్య అనుచరులుగా ఉన్నారు. -
ఇద్దరు మాజీ మావోయిస్టుల అరెస్ట్
హాలియా, న్యూస్‌లైన్ :పీఏపల్లి మండలానికి చెందిన ఇద్దరు మాజీ మావోయిస్టులను సోమవారం హాలియా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. సీఐ ఆనంద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15వ తేదీన మండలంలోని అలీనగర్ వద్ద ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ ఐడీ పార్టీ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి తనిఖీ చేయగా 2 తుపాకులు, 12 రౌండ్ల తూటాలు లభించాయి. వీరిని వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించారు. గుండెబోయిన శ్రీరాములుది పీఏపల్లి మండ లం తిరుమలగిరి కాగా, తోటకూరి శేఖ ర్ది ఘనపురం గ్రామమని, వీరు గతం లో కృష్ణపట్టె దళంలో పని చేసినట్లు సీఐ తెలిపారు. 2004లో ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరుపుతున్న సమయంలో ఘనపురం గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డిని కృష్టపట్టె దళం హతమార్చింది. ఈ సంఘటనలో ఈ ఇద్దరూ పాల్గొన్నారు. అదే విధంగా 2010లో నిడమనూరు మండలం బొక్కమంతలపాడుకు చెందిన ఓ వ్యక్తిని నక్సలైట్లమని చెప్పి అతని నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులోనూ వీరు నిందితులుగా ఉన్నారు. దళంలో పని చేసే సమయంలో వీరు రెండు తుపాకులను దాచిపెట్టుకున్నారు. దళం నుంచి బయటకు వచ్చిన వీరిద్ద రూ ఇటీవల నక్సలైట్ల పేరుతో డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో గతంలో దాచిన తుపాకులను బయటకు తీశారు. ఈ క్రమంలో ఈ నెల 15న వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు చిక్కారు. చాకచక్యంగా వ్యవహరించి వారిని అదుపులోకి తీసుకున్న ఎస్ఐ విజయ్‌ప్రకాశ్‌ను, ఐడీపార్టీ సిబ్బంది సత్యం, హరినాయక్, కానిస్టేబుల్ ఆంజనేయులును సీఐ అభినందించారు.