'వీర జవాన్ కు మా అవయవాల్ని దానం చేస్తాం'
ముంబై/లక్నో: సియాచిన్ ప్రమాదం నుంచి సుమారు ఐదు రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ లాన్స్‌నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ కు తమ చేతనైన సాయం అందిస్తామని ముగ్గురు వ్యక్తులు ముందుకొచ్చారు. 'లాన్స్ నాయక్ కిడ్నీ ఫెయిల్ అయిందని విన్నాను. అతడి కోసం అవసరమైతే నా కిడ్నీని దానం చేస్తాను' అని సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ స్వరూప్ ప్రకటించారు. ఆ జవాన్ కోసం తమ అవయవాలను దానం చేసేందుకు సిద్ధమని లక్నోకు చెందిన ఓ మహిళ, నేవీ మాజీ ఆఫీసర్ వేరు వేరు ప్రాంతాల్లో తెలిపారు. హనుమంతప్ప ప్రస్తుతం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం అందరికీ విదితమే.
యూపీలోని లఖింపూర్ కేరికి చెందిన నందినీ పాండే ఓ గృహిణి. అయితే సియాచిన్ లో మంచులో కురుకుపోవడం వల్ల తొమ్మిది మంది మృతిచెందడంతో ఆమె చలించిపోయింది. దీంతో ప్రాణాలతో బయటపడ్డ సాహస జవాన్ కు కిడ్నీ దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్థానిక మీడియా ద్వారా ప్రకటించింది. గతంలో ఆమె భర్త అవయవదానం చేయడంపై అవగాహన సదస్సులు నిర్వహించేవారు.
నేవీకి చెందిన మాజీ సెయిలర్ ఎస్.ఎస్ రాజు కూడా సియాచిన్ లో అనూహ్యరీతిలో ప్రాణాలతో బయటపడ్డ హనుమంతుకు తన వంతు సాయం చేయాలని భావించాడు. 'ఆర్మీ డాక్టర్లు నా విజ్ఞప్తి... నా లివర్, కిడ్నీ ఏదైనా సరే వీర జవాన్ కు అవసరమైతే తీసుకోండి. నన్ను కచ్చితంగా సంప్రదించండి' అంటూ థానే జిల్లా భయాందర్ వాసి అయిన నేవీ మాజీ ఉద్యోగి ప్రకటించారు. కొన ప్రాణాలతో పోరాడుతున్న సోదరుడ్ని కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చాడు.