నోట్లు..కోట్లు
►పాత నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్
►పోలీసులు అదుపులో 16మంది నిందితులు
►రూ.1.20 కోట్ల పాత నోట్లు స్వాధీనం
కంటోన్మెంట్: నోట్ల రద్దు నేపథ్యంలో ఈ నెలాఖరుకు పాతనోట్ల మార్పిడీ గడువు ముగియనుండటంతో పాతనోట్లు కోట్లల్లో చేతులు మారుతున్నాయి. సోమవారం బంజా రాహిల్స్ ప్రాంతంలో రూ.1.30 కోట్ల పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 24 గంటలు గడవకముందే నార్త్ జోన్ పరిధిలో రూ.1.20 కోట్లు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పాత మార్చి ఇస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను నార్త్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 16 మందిని అరెస్టు చేయగా మరొ కరు పరారీలో ఉన్నారు. వారి నుంచి రూ.1.20 కోట్ల విలువైన పాత రూ.500, రూ.1000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ డీసీపీ సుమతి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..సోమవారం అర్ధరాత్రి బేగంపేటలోని శ్యామ్‌లాల్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు కనిపించడంతో వారి ని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడమేగాక పరారయ్యేందుకు ప్రయత్నించారు.
దీంతో పోలీసులు వారి ని వెంబడించగా సదరు వ్యక్తులు వెంకట్ రెసిడెన్సీ ప్లాట్ నెం బర్ 301లోకి వెళ్లడాన్ని గుర్తించి అక్కడికి వెళ్లగా సదరు ప్లాట్‌లో పెద్దసంఖ్యలో ఉన్న ముఠా సభ్యులు పరారయ్యేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా భారీగా పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి జరుగుతున్నట్లు గుర్తించారు. ఫ్లాట్ యజమానితో పాటు 16 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1.20 కోట్ల విలువైన పాత నోట్లు, నాలుగు కార్లు, 17 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉండగా, అరెస్టైన వారిలో ఒక మాజీ కార్పొరేటర్, ఓ మహిళ ఉండటం గమనార్హం. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. సమావేశంలో బేగంపేట ఏసీపీ రంగారావు, ఇన్స్పెక్టర్ జగన్, ఎస్ఐలు మధు, సాయినాథ్ రెడ్డి పాల్గొన్నారు.
మార్పిడి పేరుతో మోసం...
డిమానిటైజేషన్ తర్వాత నగదు మార్పిడి దందాను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావించిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి వెంకట్ రెసిడెన్సీ కేంద్రంగా భారీ మోసాలకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని డీసీపీ తెలిపారు. గత 5 నెలలుగా సదరు ప్లాట్‌లో నగదు మార్పిడి లావాదేవీలు జరుగుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. తాజా ఘటనలో నెల్లూరుకు చెందిన సుభాన్ అనే వ్యక్తి నుంచి రూ.90 లక్షలు, కూకట్‌పల్లికి చెందిన పవన్ కుమార్‌రెడ్డి నుంచి రూ.30 లక్షల విలువైన పాత నోట్లను ముఠా సభ్యులు సేకరించారు. ఇందుకు సత్యవతి, వెంకన్న, శ్రీరామ్ మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు తెలిపారు. సదరు సొమ్ముకు బదులుగా తమకు తెలిసిన వ్యాపారవేత్తల వద్ద ఈపాటికే పోగైన బ్లాక్ మనీ (కొత్త కరెన్సీ)ని ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. ఇందుకు యాదగిరికి చెందిన ఫ్లాట్‌ను అడ్డాగా చేసుకున్న నిందితులు పాత నోట్లతో తమ వద్దకు వచ్చే వారికి తమకు బ్యాంకు అధికారులు, వివిధ హోదాల్లో ఉన్న ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలతో సంబంధాలున్నట్లు నమ్మించేవారని సమాచారం. 5 నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ ముఠాను పట్టుకున్న పోలీసులు వారిచ్చే సమాచారం ఆధారంగా త్వరలో మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశమున్నట్లు తెలిపారు.
పట్టుబడింది వీరే: అంతం యాదగిరి, షేక్ సుభాన్, మారం రెడ్డి పవన్ కుమార్ రెడ్డి, నానే సత్యవతి, కె. వెంకన్న, ఎస్. ఎల్లాగౌడ్, కె. అమర్నాథ్ రెడ్డి, షేక్ షావలి, ఎండీ ముజామ్మిల్, సి. మధన్ గోపాల్, వీవీ రమణ, బి. పురన్ చందర్, వెంగల పవన్ మూర్తి, ఎంపీ శ్రీరామ్ చందర్, హస్ముత్ పటేల్, సుబ్బారావులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.