టూరెళ్లే ట్రైన్లు.. ఇది ఖరీదైన ప్రయాణం గురూ!
‘భూతల స్వర్గం’ అనే పేరు వినేఉంటారు కదా! మరి అలాంటి అనుభూతిని మీరెప్పుడైనా సొంతం చేసుకున్నారా.. లేదంటే ఇప్పుడు చెప్పబోయే రైలు ఎక్కాల్సిందే. బోలెడుసార్లు ఎక్కాం రైలు, అందులో అంత గొప్పేముంటుంది అనుకుంటున్నారా.. మీరు ఇంతకు ముందు ఎక్కింది ఊరెళ్లే రైళ్లు. ఇవి మాత్రం టూరెళ్లే రైళ్లు. సకల సౌకర్యాలతో విహారయాత్రలు చేసే సౌలభ్యాన్ని ఇవి కల్పిస్తున్నాయి. కాకపోతే ఇది ఖరీదైన ప్రయాణం సుమా! మన దేశంలో అందుబాటులో ఉన్న ఖరీదైన రైళ్ల విశేషాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..!
ప్యాలెస్ ఆన్ వీల్స్:
భారతదేశపు మొట్టమొదటి లగ్జరీ రైలు ప్యాలెస్ ఆన్ వీల్స్. తొలినాళ్లలో ఖరీదైన రైలు ప్రయాణాల్లో ప్రపంచంలోనే నాలుగో స్థానం ఆక్రమించిన ఈ రైలును 1982 జనవరి 26న ప్రారంభించారు. చారిత్రక వైభవం ఉట్టిపడేలా దీని ఇంటీరియర్ డిజైన్‌ను తీర్చిదిద్దారు. ఇది రాజస్తాన్ పర్యాటక శాఖ, ఇండియన్ రైల్వే సంయుక్త ప్రాజెక్టు. ఇందులోని 14 బోగీలకు రాజస్తాన్‌లోని 14 సామ్రాజ్యాల పేర్లు పెట్టారు. 6 నెలల ముందుగానే టికెట్స్ అన్నీ బుక్అయిపోయే ఈ రైలుకు విదేశీ పర్యాటకులెక్కువ. 1991లో ఏసీ ఏర్పాటు చేశారు. 2009లో మొత్తం రైలును సరికొత్తగా తీర్చిదిద్దారు.
ఖర్చు: ఎనిమిది రోజుల ప్యాకేజీ ధర రోజుకు ఒకరికి రూ.22,000. ఒక గదిని ఇద్దరు పంచుకుంటే రూ.33,000, ముగ్గురు పంచుకుంటే రూ.45,000 వసూలు చేస్తారు. అక్టోబర్-మార్చి నెలల్లో ధరలు ఎక్కువ. మే, జూన్, జూలైలలో ఈ ట్రైన్ సేవలు బంద్.
ది గోల్డెన్ చారియట్..
ఇది కర్ణాటక, గోవాల్లో అందాలను తిలకించేందుకు రూపొందించిన ప్యాకేజీ. 2008 మార్చిలో ప్రారంభమైంది. ఇండియన్ రైల్వే అండ్ కర్ణాటక టూరిజమ్‌లు సంయుక్తంగా రెండు రకాల ప్యాకేజీలను నిర్వహిస్తున్నాయి. ప్రతి సోమవారం బెంగళూరు నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు కబిని, బందీపూర్, మైసూర్, హసన్, హోస్పేట్, బాదామి, గోవాల మీదుగా ప్రయాణిస్తుంది. ఒక గదిని ఇద్దరు షేర్ చేసుకుంటే ఒకరికి రోజుకు రూ. 18,000 చార్జ్ చేస్తారు. ప్రస్తుతం ఇండియాలో నడుస్తున్న లగ్జరీ ట్రైన్లలో ఇందులోనే కాస్త ధర తక్కువ.
రాయల్ రాజస్తాన్..
ఇది ప్యాలెస్ ఆన్ వీల్స్‌కు సమాంతర ప్రాజెక్టు. 2009 జనవరిలో ప్రారంభమైంది. రాజ్‌పుత్‌ల అంతఃపురంలో మాత్రమే కనిపించే ప్రత్యేక అలంకరణలను దీనికి ఇంటీరియర్ డిజైన్‌గా ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచి ఆదివారం వరకు కొనసాగే ఈ ప్రయాణం ఢిల్లీ, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, చిత్తోర్‌ఘడ్, సవై మదోపూర్, జైపూర్, ఖజురహో, వారణాసి, ఆగ్రా, ఢిల్లీల్లో ప్రయాణిస్తుంది.
ఖర్చు: ఇద్దరు కలిసి గది తీసుకుంటే ఒకరికి రోజుకు రూ.26,200. ఎక్స్ట్రార్డినరీ సూట్‌కు రోజుకు రూ. 75,000 వరకు ఉంటుంది.
ఫెయిరీ క్వీన్..
1855లో ఇంగ్లండ్‌లో తయారైన ఈ రైలు ప్రపంచంలోనే వాడుకలో ఉన్న అత్యంత పురాతన స్టీమ్ లోకోమోటివ్. 1909లో కాలం చెల్లిన ఈ రైలును బాగుచేసి 1997 జులైలో మళ్లీ పట్టాలెక్కించారు. ఇది ఢిల్లీ ఆల్వార్ సరిస్కా (పులుల కేంద్రం), ఢిల్లీ ప్యాకేజీలను నిర్వహిస్తుంది. రెండ్రోజుల ప్యాకీజీకి ఒకరికి రూ.10,500
వీటిలో సదుపాయాలు..
ప్రతి గదికి ప్రత్యేక ఏసీతో ఫైవ్‌స్టార్ సదుపాయాలతో బెడ్రూమ్ ఉంటుంది. ప్రతి ట్రైన్లో ఒక బార్, రెండు రెస్టారెంట్లు ఉంటాయి. లైబ్రరీ, షాపింగ్, విశ్రాంతి గది, జిమ్, అవుట్గోయింగ్ పోస్ట్, ఫోను, ఇంటర్నెట్, ఎల్సీడీ టీవీలు, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంటాయి. 24 గంటలూ వేడినీరు, చల్లనినీరు అందుబాటులో ఉంటాయి.
మహరాజా ఎక్స్‌ప్రెస్..
2010లో ప్రారంభమైన ఈ రైలు లగ్జరీ ట్రైన్ సిరీస్‌లో కొత్త ప్రాజెక్టు. దీన్ని ఇండియన్ రైల్వే, గ్లోబల్ ట్రావెల్ కంపెనీ కాక్స్ అండ్ కింగ్స్ సంయుక్తంగా నడుపుతున్నాయి. ఇందులో మూడు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. మహారాజుల వైభవానికి ఆధునికతను మిక్స్ చేసి దీన్ని రూపొందించారు.
పర్యటించే ప్రదేశాలు:
ప్రిన్స్లీ ఇండియా: ప్రతి శనివారం ముంబై నుంచి ప్రారంభమవుతుంది. వడోదర, ఉదయ్‌పూర్, ఆగ్రా, జోధ్‌పూర్, బికనీర్, జైపూర్, రణతంబోర్, ఆగ్రా, ఢిల్లీల్లో పర్యటిస్తుంది.
రాయల్ ఇండియా: పైనున్న ప్రాంతాల్లోనే పర్యటిస్తుంది. ప్రతి ఆదివారం ఢిల్లీ నుంచి బయలుదేరుతుంది.
క్లాసికల్ ఇండియా: ప్రతి ఆదివారం ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆగ్రా, గ్వాలియర్, ఖజురహో, బంద్‌వగ్రా, వారణాసి, లక్నోల మీదుగా సాగుతుంది.
ఖర్చు.. ప్రిన్స్లీ ఇండియా, క్లాసికల్ ఇండియా టూర్ ప్యాకేజీ మొత్తం రూ. 3 లక్షల 18 వేలు. రాయల్ ఇండియా ప్యాకేజీకి రూ. 2 లక్షల 78 వేలు. ఇందులో ప్రెసిడెన్షియల్ సూట్ ప్యాకేజీకి రూ. 9 లక్షలు.