వ్యర్థాలతో అనర్థాలు.. చెత్తలోకి కాలం చెల్లిన మందులు
సాక్షి, అమరావతి: కాలం చెల్లిన మందులు.. ఆస్పత్రుల నుంచి వచ్చే వ్యర్థాలు కొత్త సమస్యలు తీసుకొస్తున్నాయి. వీటిని సక్రమంగా నిర్వీర్యం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని పణంగా పెట్టాల్సి వస్తోంది. చాలామంది రిటెయిలర్లు ఎక్స్పెయిర్ అయిన మందుల్ని చెత్తలో వేస్తున్నారు. మందుల షాపులతో పాటు ఇళ్లల్లోంచి కూడా రకరకాల మాత్రలు, సిరప్లు, ఆయింట్మెంట్లు మునిసిపాలిటీ చెత్త డబ్బాలు లేదా మురుగు కాలువల్లో పడేస్తున్నారు.
కొన్ని ఆస్పత్రులు రోగుల నుంచి వెలువడే ఫ్లూయిడ్స్‌ను.. ఎలాంటి సీవరేజీ ట్రీట్మెంట్ చేయకుండానే డ్రైనేజీలోకి వదులుతున్నారు. 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిర్వీర్యం చేయాల్సిన మందులు డంపింగ్ యార్డుల్లో కుళ్లిపోతే అనేక దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. వాతావరణం, జలాలు కలుషితమవడంతో అనారోగ్యాలు ప్రబలుతున్నాయి. హెపటైటిస్ వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి.
మందులు కుళ్లిపోతే వచ్చే సమస్యలు
యాంటీబయోటిక్స్ మందులు కుళ్లిపోవడం వల్ల ఆ వ్యర్థాల నుంచి కొత్తరకం బ్యాక్టీరియా పుట్టుకొస్తోంది. ఈ బ్యాక్టీరియా వల్ల కొత్తరకం జబ్బులు సోకుతున్నాయి. సామర్థ్యం కలిగిన యాంటీబయోటిక్స్ వాడినా ఈ జబ్బులు పూర్తిగా తగ్గడంలేదు. మందులు చెత్త కుప్పల్లో కుళ్లిపోవడం వల్ల వాయుకాలుష్యం తీవ్రమవుతోంది. గాలి ద్వారా వ్యాప్తిచెందే జబ్బుల ప్రభావం పెరుగుతోంది. భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయి. ఈ నీటిని తాగడం వల్ల మనుషులతోపాటు జంతువులకు కూడా మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, హెపటైటిస్–బి వంటి జబ్బులు వస్తున్నాయి.
ఆస్పత్రుల్లో రంగుల డబ్బాలు
కాలం చెల్లిన మందులే కాదు.. ఆస్పత్రుల్లో ఉత్పన్నమయ్యే వివిధ రకాల బయో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలున్నాయి. వీటిని సేకరించడానికి కూడా ప్రత్యేక రంగులను నిర్ణయించారు. ఆయా వ్యర్థాలను నిర్దేశించిన రంగు ఉన్న డబ్బాల్లోనే వేయాలి.
హ్యూమన్ అనాటమిక్ వేస్ట్:
రోగినుంచి వచ్చిన బాడీ ఫ్లూయిడ్స్, డ్రెస్సింగ్ వేస్ట్, బ్యాగ్‌లు, రక్తంతో ఉన్న వేస్ట్, ఎక్స్‌పెయిరీ మందులు వంటివి. వీటిని పసుపు రంగు డబ్బాల్లో మాత్రమే వేయాలి. అనంతరం వీటిని అత్యధిక ఉష్ణోగ్రతలో నిర్వీర్యం చేయాలి.
కంటామినేటెడ్ వేస్ట్:
రోగి శరీరంలో అమర్చి ఆ తర్వాత పడేయాల్సిన ట్యూబ్‌లు, యూరినల్ బ్యాగ్స్, సిరంజిలు, నీడిల్స్ వంటివి. వీటిని ఎరుపురంగు డబ్బాలో మాత్రమే వేయాలి. ఈ వ్యర్థాలను ఆటోక్లావింగ్ లేదా మైక్రోవేవింగ్ హైడ్రోక్లావింగ్ పద్ధతుల్లోనే నిర్వీర్యం చేయాలి. ఇందులో కొన్ని రీసైక్లింగ్ చేసినవి రోడ్డు నిర్మాణంలో వాడతారు. వీటిని లైసెన్సు ఉన్న కాంట్రాక్టరుకే ఇచ్చి రీ సైక్లింగ్ చేయాలి.
పదునైన పరికరాలు:
నీడిల్స్, సిరంజిలు, నీడిల్ కట్టర్లు, బర్నర్లు, బ్లేడ్లు ఇలా ఏవైనా విషపూరితమైనవి, పదునైనవి. వీటిని లీకేజీలేని తెలుపు రంగు డబ్బాలో మాత్రమే వేయాలి. ఈ వ్యర్థాలను ఆటోక్లావింగ్ లేదా డ్రైహీట్ స్టెరిలైజేషన్ పద్ధతిలో కాల్చేయాలి. కాలుష్య నియంత్రణ మండలి గుర్తింపు ఉన్న సంస్థ ద్వారా నిర్వీర్యం చేయాలి.
గ్లాస్‌వేర్ వేస్ట్:
విషపూరిత గాజు వస్తువులు, మందుల వయెల్స్, మెడిసిన్ వయెల్స్ వంటివి. వీటిని నీలం రంగు డబ్బాలో మాత్రమే సేకరించాలి. వీటిని తిరిగి ఉపయోగించాలంటే డిటర్జంట్ లేదా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేయాలి.
బయో వ్యర్థాల నిర్వీర్యానికి కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు
►బయో వ్యర్థాలను తీసుకెళ్లే వాహనాలకు విధిగా జీపీఎస్ ఉండాలి.
►ఏ ఆస్పత్రిలో ఎంత బయో వ్యర్థాలు సేకరించిందీ కాంట్రాక్ట్ సంస్థ విధిగా వెబ్సైట్లో ఉంచాలి.
►వ్యర్థాలను సేకరించే పనివారికి ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించాలి.
►వారికి గ్లౌజులు, ఎన్–95 మాస్కులు ఉండేలా చూసుకోవాలి.
►ఆయా వ్యర్థాలను తీసుకెళ్లే సంస్థలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారుల పర్యవేక్షణ ఉండాలి
►వ్యర్థాలను నిర్వీర్యం చేసే ప్లాంట్లను నిరంతరం అధికారులు పర్యవేక్షించాలి.
►సేకరించిన వ్యర్థాలను 48 గంటల్లోగా నిర్వీర్యం చేయాలి.
కొత్త పాలసీ తీసుకొస్తాం
ఎక్స్‌పెయిరీ మందులు చెత్తడబ్బాల్లోకి వెళ్లకుండా ఖచ్చితమైన నిర్వీర్య ప్రక్రియ చేపట్టేలా కొత్త పాలసీ తీసుకొస్తాం. దీనిపై వివిధ మాన్యుఫాక్చరింగ్, హోల్‌సేల్, రీటెయిలర్లతో మాట్లాడుతున్నాం. వీలైనంత త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తాం.
– రవిశంకర్‌నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణశాఖ