డాక్టర్‌కు మెమో.. ఇద్దరు నర్సులపై వేటు
⇒ గాంధీలో గడువు ముగిసిన మందుల కలకలం
⇒ విచారణకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: పురుగుల అవశేషాలు ఉన్న సెలైన్ ఎక్కించడంతో చిన్నారి సాయి ప్రవళిక మృతి చెందిన ఘటన ఇంకా మరువక ముందే సికింద్రాబాద్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో మరో ఉదంతం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడతూ వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 మంది చిన్నారులకు గడువు ముగిసిన ఇంజక్షన్ ఇవ్వడంతో శనివారం రాత్రి వారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యులు అప్రమత్తమై విరుగుడు మందు ఇవ్వడంతో ప్రాణాపాయం తప్పింది.
ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సమగ్ర విచారణ కోసం నిజామాబాద్ పిడియాట్రిక్ హెచ్‌వోడీ డాక్టర్ జార్జ్, నిలోఫర్ పిడియాట్రిక్ ప్రొఫెసర్ అలిమేలుతో కమిటీ వేసింది. రెండు రోజుల్లో తుది నివేదిక అందజేయాలని ఆదేశించింది. శనివారం రాత్రి డ్యూటీలో ఉన్న పీజీ డాక్టర్ నవీన్‌సింగ్‌కి మెమో జారీ చేయగా, స్టాఫ్ నర్సులు శోభ, సునితపై అంతర్గత కమిటీ నివేదిక మేరకు సస్పెన్షన్ వేటు వేసింది. డీఎంఈ రమణి ఆదివారం ఆస్పత్రికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఒకరికే అనుమతి...
శనివారం రాత్రి పిల్లలకు సెప్ట్రియాక్సోన్, ఎమాక్సెస్‌యాంక్లేవ్, వాంకోమైసిన్ యాంటీబయోటిక్ ఇంజక్షన్లు ఇచ్చామని, అరగంట తర్వాత వారికి చలి జ్వరం వచ్చిందని రమణి తెలిపారు. ఈ మూడు మందులను డ్రగ్ కంట్రోల్ బోర్డుకు పంపామని, గడువు తీరిన మందుగా మీడియాలో ప్రసారమైన మాక్స్ సెల్ఫ్ ఇంజక్షన్ పిల్లలకు వాడరని, గర్భిణులకు ఉపయోగించేదని తెలిపారు. ఇంజక్షన్ బాటిల్‌పై ప్రభుత్వ ముద్ర లేదని, దీన్నిబట్టి ఎవరో కావాలనే ఆస్పత్రిపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ కోణంలో విచారణ చేపట్టామని, పోలీసులు, నిఘా వర్గాల సాయం కూడా కోరామన్నారు. తాజా ఘటన నేప థ్యంలో రోగికి సహాయకులుగా ఇకపై ఒకరినే అనుమతిస్తామని చెప్పారు. గాంధీ సూపరింటెండెంట్‌గా డాక్టర్ శ్రవణ్‌కుమార్‌ను నియమించనున్నామన్నారు.