- తగ్గని స్వైన్‌ఫ్లూ తీవ్రత తాజాగా మరో ఐదుగురు బలి
- గాంధీలో 44, ఫీవర్‌లో 22 మందికి చికిత్స
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. మృత్యుఘంటికలు మోగుతూనే ఉన్నాయి. చలి తగ్గుముఖం పట్టినా స్వైన్‌ఫ్లూ తీవ్రత మాత్రం తగ్గడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2778 మంది రక్త నమూనాలు పరీక్షించగా, 917 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 42 మంది మృతి చెందగా, తాజాగా గురువారం మరో ఐదుగురు చనిపోయారు. గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గురు, అపోలో, స్టార్ ఆస్పత్రిలో ఒకరు చొప్పున మృత్యువాత పడ్డారు.
42 రో జుల్లో 47 మంది చనిపోవడంపై భయాందోళన వ్యక్తం అవుతోంది. గాంధీలో అజంపురాకు చెందిన 39 ఏళ్ల వ్యక్తి, కర్ణాటకకు చెందిన వృద్ధురాలు, నగరానికి చెందిన మరో మహిళ చనిపోయారు. అపోలో ఆసుపత్రిలో కరీంనగర్‌వాసి, స్టార్ ఆస్పత్రిలో ప్రకాశం జిల్లావాసి చనిపోయారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 21 పాజిటివ్, 23 అనుమానిత కేసులు ఉండగా, ఫీవర్ ఆస్పత్రిలో 14 పాజిటివ్, ఎమినిది మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు. ఇక కేర్, అపోలో, యశోద, గ్లోబల్, కిమ్స్, ఆదిత్య తదితర ఆస్పత్రుల్లో మరో 25 మందికిపైగా అనుమానితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.