Gandhi Government Hospital
-
‘మింట్ కాంపౌండ్’ దాతృత్వం
హైదరాబాద్: సుమారు రూ.కోటి విలువైన వైద్య పరికరాలను గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి వితరణగా అందించి మింట్ కాంపౌండ్ ఇండియా తన దాతృత్వాన్ని చాటుకుంది. ఆస్పత్రి ప్రాంగణంలో శనివారం జరిగిన కార్యక్రమంలో మింట్ కాంపౌండ్ ఇండియా హైదరాబాద్ శాఖ చీఫ్ ఆపరేషన్ మేనేజర్, హెచ్ఆర్ హెడ్ రాములు వైద్య పరికరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్‌కు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో రాములు మాట్లాడుతూ.. నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన వైద్య పరికరాలను తాము అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పేదల ప్రాణాలు కాపాడేందుకు గాంధీ వైద్యులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నిరుపేద రోగుల కోసం ఏదైనా చేయమని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్, ఆర్ఎంఓ శేషాద్రి తమను కోరారన్నారు. దీంతో రెండు వేక్ థెరపీ మిషన్లు, ఎండోవీనస్ లేజర్ మిషన్, 2డీ ఎకో, రెండు లాప్రోస్కోపిక్ మిషన్లు, హైఫ్రీక్వేన్సీ ఇంపెడెన్స్ మనోమెట్రీ, జెసిస్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్, ఆపరేటింగ్ హిస్టరోస్కోపీ వంటి వైద్య పరికరాలను కొనుగోలు చేసి అందించామన్నారు. కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలి గాంధీ ఆస్పత్రిలో నిరుపేద రోగులకు మరిన్ని మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకురావాలని శ్రవణ్‌కుమార్ కోరారు. గత రెండేళ్లలో గాంధీ ఆస్పత్రిలో అనేక అభివృద్ధి, వసతుల కల్పన కార్యక్రమాలు చేపట్టామని, వందల సంఖ్యలో అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా గాంధీ ఖ్యాతిని ఇనుమడింపజేశామన్నారు. గాంధీ ఆస్పత్రిలో రూ.30 లక్షల వ్యయంతో పేషెంట్ అటెండర్ షెడ్, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు ఎన్టీపీసీ సంస్థ ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రవణ్‌కుమార్, హెచ్వోడీలు రాజారావు, శోభన్‌బాబు, మహాలక్ష్మీ, శ్రీహరి, ఆర్ఎంవోలు జయకృష్ణ, శేషాద్రిలతోపాటు మింట్ కాంపౌండ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘మృత్యుంజయ హోమం వైద్యవృత్తికే అవమానం’
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్) :హైదరాబాద్‌లోని గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో మరణాలను ఆపేందుకు మృత్యుంజయ హోమం చేయడం వైద్యవృత్తికే అవమానమని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెలిమెల రాజేశ్వర్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. ఆధునిక వైద్యం శాస్త్రీయపరంగా చాలా అభివృద్ధి చెందిందని, వైద్యవృత్తి చేసేవారికి మానవ శరీర నిర్మాణం, జనన, మరణాలపై కనీస పరిజ్ఞానం ఉంటుందన్నారు. వైద్యకళాశాలల్లో ఇందుకు సంబంధించిన విజ్ఞానం నేర్చుకున్న వైద్యులు గాంధీ ఆస్పత్రిలో మరణాలను ఆపేందుకు హోమాలు చేయడం అనాగరిక చర్య అని అన్నారు. గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చేసిన మృత్యుంజయ హోమం వైద్యుల మూఢ నమ్మకాలకు నిదర్శనమన్నారు. ఈ చర్యలను జనవిజ్ఞాన వేదిక తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి రోగులను కాపాడాల్సిన బాధ్యత నుంచి డాక్టర్లు తప్పుకుని దేవుడిపై భారం వేయడం దారుణమని పేర్కొన్నారు. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు డాక్టర్ రవీంద్ర సూరి, రామ్మోహన్రావు, నర్ర రామారావు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్‌కు మెమో.. ఇద్దరు నర్సులపై వేటు
⇒ గాంధీలో గడువు ముగిసిన మందుల కలకలం ⇒ విచారణకు కమిటీ సాక్షి, హైదరాబాద్: పురుగుల అవశేషాలు ఉన్న సెలైన్ ఎక్కించడంతో చిన్నారి సాయి ప్రవళిక మృతి చెందిన ఘటన ఇంకా మరువక ముందే సికింద్రాబాద్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో మరో ఉదంతం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడతూ వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 మంది చిన్నారులకు గడువు ముగిసిన ఇంజక్షన్ ఇవ్వడంతో శనివారం రాత్రి వారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యులు అప్రమత్తమై విరుగుడు మందు ఇవ్వడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సమగ్ర విచారణ కోసం నిజామాబాద్ పిడియాట్రిక్ హెచ్‌వోడీ డాక్టర్ జార్జ్, నిలోఫర్ పిడియాట్రిక్ ప్రొఫెసర్ అలిమేలుతో కమిటీ వేసింది. రెండు రోజుల్లో తుది నివేదిక అందజేయాలని ఆదేశించింది. శనివారం రాత్రి డ్యూటీలో ఉన్న పీజీ డాక్టర్ నవీన్సింగ్కి మెమో జారీ చేయగా, స్టాఫ్ నర్సులు శోభ, సునితపై అంతర్గత కమిటీ నివేదిక మేరకు సస్పెన్షన్ వేటు వేసింది. డీఎంఈ రమణి ఆదివారం ఆస్పత్రికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకరికే అనుమతి... శనివారం రాత్రి పిల్లలకు సెప్ట్రియాక్సోన్, ఎమాక్సెస్యాంక్లేవ్, వాంకోమైసిన్ యాంటీబయోటిక్ ఇంజక్షన్లు ఇచ్చామని, అరగంట తర్వాత వారికి చలి జ్వరం వచ్చిందని రమణి తెలిపారు. ఈ మూడు మందులను డ్రగ్ కంట్రోల్ బోర్డుకు పంపామని, గడువు తీరిన మందుగా మీడియాలో ప్రసారమైన మాక్స్ సెల్ఫ్ ఇంజక్షన్ పిల్లలకు వాడరని, గర్భిణులకు ఉపయోగించేదని తెలిపారు. ఇంజక్షన్ బాటిల్‌పై ప్రభుత్వ ముద్ర లేదని, దీన్నిబట్టి ఎవరో కావాలనే ఆస్పత్రిపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ కోణంలో విచారణ చేపట్టామని, పోలీసులు, నిఘా వర్గాల సాయం కూడా కోరామన్నారు. తాజా ఘటన నేప థ్యంలో రోగికి సహాయకులుగా ఇకపై ఒకరినే అనుమతిస్తామని చెప్పారు. గాంధీ సూపరింటెండెంట్‌గా డాక్టర్ శ్రవణ్‌కుమార్‌ను నియమించనున్నామన్నారు. -
42 రోజుల్లో 47 మంది మృతి
తగ్గని స్వైన్‌ఫ్లూ తీవ్రత తాజాగా మరో ఐదుగురు బలి గాంధీలో 44, ఫీవర్‌లో 22 మందికి చికిత్స సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. మృత్యుఘంటికలు మోగుతూనే ఉన్నాయి. చలి తగ్గుముఖం పట్టినా స్వైన్‌ఫ్లూ తీవ్రత మాత్రం తగ్గడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2778 మంది రక్త నమూనాలు పరీక్షించగా, 917 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 42 మంది మృతి చెందగా, తాజాగా గురువారం మరో ఐదుగురు చనిపోయారు. గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గురు, అపోలో, స్టార్ ఆస్పత్రిలో ఒకరు చొప్పున మృత్యువాత పడ్డారు. 42 రో జుల్లో 47 మంది చనిపోవడంపై భయాందోళన వ్యక్తం అవుతోంది. గాంధీలో అజంపురాకు చెందిన 39 ఏళ్ల వ్యక్తి, కర్ణాటకకు చెందిన వృద్ధురాలు, నగరానికి చెందిన మరో మహిళ చనిపోయారు. అపోలో ఆసుపత్రిలో కరీంనగర్‌వాసి, స్టార్ ఆస్పత్రిలో ప్రకాశం జిల్లావాసి చనిపోయారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 21 పాజిటివ్, 23 అనుమానిత కేసులు ఉండగా, ఫీవర్ ఆస్పత్రిలో 14 పాజిటివ్, ఎమినిది మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు. ఇక కేర్, అపోలో, యశోద, గ్లోబల్, కిమ్స్, ఆదిత్య తదితర ఆస్పత్రుల్లో మరో 25 మందికిపైగా అనుమానితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. -
కల్తీ కల్లు కాటు
70 మందికి అస్వస్థత గాంధీలో కోలుకుంటున్న బాధితులు కల్లు కాంపౌండ్‌లో ఒకరి అరెస్టు మల్కాజిగిరి,నేరేడ్మెట్,న్యూస్‌లైన్: కల్తీకల్లు ప్రాణాల మీదకు తెచ్చింది.. సరదాగా తాగుదామని వెళ్లిన సుమారు 70 మంది అస్వస్థత పాలయ్యారు. ప్రస్తుతం వీరంతా గాంధీ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి..నేరేడ్మెట్ రామకృష్ణాపురం ఆఫీసర్స్కాలనీలోని ఇళ్ల మధ్యలో పాతికేళ్లుగా అనధికారికంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతోంది. ఇక్కడి సమీపంలో ఉన్న బస్తీలవారు, కూలీలు అనేకమంది నిత్యం ఇక్కడ కల్లు సేవిస్తుంటారు. ఇలా ఆది,సోమవారాల్లో కల్లు సేవించిన పలువురు తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. కాళ్లు,చేతులు, మూతి వంకరపోవడం,మెడలు తిరగకపోవడంతో హన్మంతు(30), భాగ్యలక్ష్మి(30), సుకన్య(25), మణెమ్మ(60), అండాలు(38), ఈశ్వరమ్మ(40), కుమార్(22),నర్సింహ్మ(30),నీరజ(12), మమత(30), లక్ష్మి(40), గోపాల్(40)తోపాటు సమారు 70మందిని స్థానికులు హుటాహుటిన 108 సాయంతో సికింద్రాబాద్‌లోని గాంధీకి తరలించారు. మంగళవారం ఉదయం కూడా ఇంకా పలువురి పరిస్థితి అలాగే ఉండడంతో వారిని కూడా ఆస్పత్రికి తరలించారు. ఒకరి అరెస్టు : కల్తీకల్లు ఘటనలో కల్లు కంపౌండ్‌లో పనిచేస్తున్న రాజును అరెస్టు చేసినట్లు మల్కాజిగిరి ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపారు. కంపౌండ్ నిర్వాహకుడు మహేష్‌గౌడ్ పరారీలో ఉన్నాడని, ఆయన్ను అరెస్టు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. కాగా కాలనీలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్తీకల్లు శాంపిల్‌ను ఇప్పటికే పరీక్షలకు పంపామని ఏసీపీ హరికిషన్ వెల్లడించారు. కల్లు కంపౌండ్ తొలగించాలని ఆందోళన : ఇళ్ల మధ్యన అనధికారికంగా కల్లుకంపౌండ్ను నిర్వహించడమే కాకుండా కల్తీకల్లును విక్రయిస్తూ పేదల జీవితాలతో చెలగాలమాడుతున్న కల్లు కేంద్రాన్ని వెంటనే తొలగించాలని స్థానికులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఎక్సైజ్ అధికారుల అండదండలతోనే కల్లు కంపౌండ్ దర్జాగా కొనసాగుతోందని ఆరోపించారు. దీన్ని తొలగించే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రాణాపాయం లేదు గాంధీఆస్పత్రి,న్యూస్‌లైన్: కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురై సుమారు 70మంది చికిత్స పొందుతున్నారని, వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని గాంధీ ఆస్పత్రి వైద్యు లు వెల్లడించారు. స్వల్ప అస్వస్థతకు గురైన వారికి ప్రాథమికవైద్యసేవలందించి వెంటనే పంపించగా..మరో 30మందికి డిజాస్టర్‌వార్డులో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కాగా ఆస్పత్రి ఎమర్జెన్సీ వద్ద అవసరమైన స్ట్రెచర్లు అందుబాటులో లేకపోవడంతో కుటుంబసభ్యులే బాధితులను ఎత్తుకొని ఆయా వార్డుల్లోకి తీసుకెళ్లడం ఆస్పత్రి డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. గాంధీలో చికిత్సలు పొందుతున్న వారి లో.. రామకృష్ణాపురం, మొరంబంద ప్రాంతాలకు చెందిన ఈశ్వరమ్మ (40), మమత (35), సుకన్య (36), రాజమణి(50) అల్వీస్ (42), కుమార్ (22), దినేష్ (21), గోపాల్ (41), కే మమత (36), భాగ్య (24) మమత (20), విజయ (55) శాంత(27), నవీన్ (25) సాయికుమార్ (16), లక్ష్మీ (50), సాయిప్రకాశ్ (20), స్వరూప (26), లక్ష్మీ (24), కుమార్(25, పెళ్లికొడుకు), సీతాలు(20, పెళ్లికూతురు), పీ లక్ష్మీ(37), సత్యమ్మ (50), సాలమ్మ (33), శంకర్ (40), శాంతమ్మ (50), లలిత (40), లక్ష్మణ్ (25)లున్నారు.