70 మందికి అస్వస్థత
గాంధీలో కోలుకుంటున్న బాధితులు
కల్లు కాంపౌండ్‌లో ఒకరి అరెస్టు
మల్కాజిగిరి,నేరేడ్‌మెట్,న్యూస్‌లైన్:
కల్తీకల్లు ప్రాణాల మీదకు తెచ్చింది.. సరదాగా తాగుదామని వెళ్లిన సుమారు 70 మంది అస్వస్థత పాలయ్యారు. ప్రస్తుతం వీరంతా గాంధీ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి..నేరేడ్‌మెట్ రామకృష్ణాపురం ఆఫీసర్స్‌కాలనీలోని ఇళ్ల మధ్యలో పాతికేళ్లుగా అనధికారికంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతోంది. ఇక్కడి సమీపంలో ఉన్న బస్తీలవారు, కూలీలు అనేకమంది నిత్యం ఇక్కడ కల్లు సేవిస్తుంటారు. ఇలా ఆది,సోమవారాల్లో కల్లు సేవించిన పలువురు తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. కాళ్లు,చేతులు, మూతి వంకరపోవడం,మెడలు తిరగకపోవడంతో హన్మంతు(30), భాగ్యలక్ష్మి(30), సుకన్య(25), మణెమ్మ(60), అండాలు(38), ఈశ్వరమ్మ(40), కుమార్(22),నర్సింహ్మ(30),నీరజ(12), మమత(30), లక్ష్మి(40), గోపాల్(40)తోపాటు సమారు 70మందిని స్థానికులు హుటాహుటిన 108 సాయంతో సికింద్రాబాద్‌లోని గాంధీకి తరలించారు. మంగళవారం ఉదయం కూడా ఇంకా పలువురి పరిస్థితి అలాగే ఉండడంతో వారిని కూడా ఆస్పత్రికి తరలించారు.
ఒకరి అరెస్టు : కల్తీకల్లు ఘటనలో కల్లు కంపౌండ్‌లో పనిచేస్తున్న రాజును అరెస్టు చేసినట్లు మల్కాజిగిరి ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపారు. కంపౌండ్ నిర్వాహకుడు మహేష్‌గౌడ్ పరారీలో ఉన్నాడని, ఆయన్ను అరెస్టు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. కాగా కాలనీలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్తీకల్లు శాంపిల్‌ను ఇప్పటికే పరీక్షలకు పంపామని ఏసీపీ హరికిషన్ వెల్లడించారు.
కల్లు కంపౌండ్ తొలగించాలని ఆందోళన : ఇళ్ల మధ్యన అనధికారికంగా కల్లుకంపౌండ్‌ను నిర్వహించడమే కాకుండా కల్తీకల్లును విక్రయిస్తూ పేదల జీవితాలతో చెలగాలమాడుతున్న కల్లు కేంద్రాన్ని వెంటనే తొలగించాలని స్థానికులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఎక్సైజ్ అధికారుల అండదండలతోనే కల్లు కంపౌండ్ దర్జాగా కొనసాగుతోందని ఆరోపించారు. దీన్ని తొలగించే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ప్రాణాపాయం లేదు
గాంధీఆస్పత్రి,న్యూస్‌లైన్: కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురై సుమారు 70మంది చికిత్స పొందుతున్నారని, వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని గాంధీ ఆస్పత్రి వైద్యు లు వెల్లడించారు. స్వల్ప అస్వస్థతకు గురైన వారికి ప్రాథమికవైద్యసేవలందించి వెంటనే పంపించగా..మరో 30మందికి డిజాస్టర్‌వార్డులో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కాగా ఆస్పత్రి ఎమర్జెన్సీ వద్ద అవసరమైన స్ట్రెచర్లు అందుబాటులో లేకపోవడంతో కుటుంబసభ్యులే బాధితులను ఎత్తుకొని ఆయా వార్డుల్లోకి తీసుకెళ్లడం ఆస్పత్రి డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. గాంధీలో చికిత్సలు పొందుతున్న వారి లో.. రామకృష్ణాపురం, మొరంబంద ప్రాంతాలకు చెందిన ఈశ్వరమ్మ (40), మమత (35), సుకన్య (36), రాజమణి(50) అల్వీస్ (42), కుమార్ (22), దినేష్ (21), గోపాల్ (41), కే మమత (36), భాగ్య (24) మమత (20), విజయ (55) శాంత(27), నవీన్ (25) సాయికుమార్ (16), లక్ష్మీ (50), సాయిప్రకాశ్ (20), స్వరూప (26), లక్ష్మీ (24), కుమార్(25, పెళ్లికొడుకు), సీతాలు(20, పెళ్లికూతురు), పీ లక్ష్మీ(37), సత్యమ్మ (50), సాలమ్మ (33), శంకర్ (40), శాంతమ్మ (50), లలిత (40), లక్ష్మణ్ (25)లున్నారు.
కల్తీ కల్లు కాటు
Published Wed, Feb 12 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement
Advertisement