బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌లకు వేధింపులు
రాజ్యాంగేతర శక్తి ఘట్టమనేని శ్రీనివాస్ బెదిరింపులు
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు సర్కారు అక్రమ కేసులతో వైఎస్సార్‌సీపీ కీలక నేతలను వేధించే కుట్రలను తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా సీఐడీ వ్యవస్థను దుర్వినియోగం చేయడంతోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను రాజ్యాంగేతర శక్తిలా వాడుకుంటోంది. అక్రమంగా నమోదు చేసిన మద్యం కేసులో అధికారులపై బెదిరింపులకు పాల్పడుతోంది.
రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డితోపాటు సంస్థలో గతంలో పని చేసిన సత్యప్రసాద్ నుంచి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు బరి తెగిస్తోంది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వారిని వేధిస్తోంది.
అబద్ధపు వాంగ్మూలాలు తీసుకోండి..
అక్రమ కేసులు బనాయించండి త్వరలోనే కొందరు కీలక నేతలను అరెస్ట్ చేస్తామని మంత్రి నారా లోకేశ్ ఇటీవల టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం వెనుక పక్కా కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయనేమీ ముఖ్యమంత్రి కాదు.. హోంమంత్రి కూడా కాదు. లోకేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మాత్రమే. పోలీసు శాఖ, సీఐడీ విభాగం, ఇతర దర్యాప్తు సంస్థలు ఆయన అధికారిక పరిధిలోకి రావు. అలాంటప్పుడు కొందరు వైఎస్సార్‌సీపీ నేతలను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన ఎలా ప్రకటించారన్నది కీలకంగా మారింది.
అక్రమ కేసులు నమోదు చేసి వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్ చేయాలని లోకేశ్ పోలీసు శాఖపై ఒత్తిడి తెస్తున్నారన్నది దీనిద్వారా స్పష్టమవుతోంది. తాము అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా వైఎస్సార్‌సీపీ కీలక నేతలను అక్రమ కేసుల్లో ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసు శాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఏసీబీ అదనపు డీజీ అతుల్ సింగ్ తదితరులపై లోకేశ్ చిందులు తొక్కారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానించడం గమనార్హం.
ఆ తరువాతే అక్రమ కేసుల కుట్రను సీఐడీ వేగవంతం చేసింది. సోషల్ మీడియా కార్యకర్తలపై వందల సంఖ్యలో అక్రమ కేసులు నమోదు చేసి తీవ్ర వేధింపులకు పాల్పడి అరాచకం సృష్టించింది. ఈ క్రమంలో నారా లోకేశ్ మరోసారి వైఎస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్టుల గురించి సీఐడీ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు సీఐడీకి స్పష్టం చేశారని తెలుస్తోంది. ఆ బాధ్యతను సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌తోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌కు అప్పగించినట్టు సమాచారం.
నెలాఖరుకల్లా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాల్సిందే...
ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్ వేధింపుల కుట్రను తీవ్రతరం చేశారు. మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి పాత్ర ఉందని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈమేరకు బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేరెడ్డి, ఆ సంస్థ మాజీ ఉద్యోగి సత్యప్రసాద్‌లను తీవ్రంగా వేధిస్తున్నారు.
తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలను 164 సీఆర్‌పీసీ కింద ఈ నెలాఖరు కల్లా నమోదు చేయాల్సిందేనని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అల్టిమేటం జారీ చేశారు. అలా చేస్తే ఢిల్లీలో కీలక పోస్టింగు ఇస్తామని లేదంటే ఇప్పటికే వాసుదేవరెడ్డిపై నాలుగు అక్రమ కేసులు నమోదు చేశామని..ఇక ముందు మరిన్ని బనాయిస్తామని బెదిరిస్తున్నారు. అక్రమ కేసు నమోదు చేసి కనీసం రెండేళ్లపాటు జైలులో ఉంచుతామని ఘట్టమనేని శ్రీనివాస్ బెదిరించడం ప్రభుత్వ కుట్రలకు తార్కాణం.
నెలాఖరునాటికి వారిద్దరితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించడమే లక్ష్యంగా సీఐడీ అధికారులు, ఘట్టమనేని శ్రీనివాస్ వేధింపులను తీవ్రతరం చేశారు. దీని వెనుక టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందన్నది స్పష్టం. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్‌తోపాటు యావత్ పోలీసు, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తమను బెదిరిస్తున్న తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ సిద్ధమవుతున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment