false statement
-
అబద్ధపు వాంగ్మూలాలకు ఒత్తిళ్లు
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు సర్కారు అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ కీలక నేతలను వేధించే కుట్రలను తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా సీఐడీ వ్యవస్థను దుర్వినియోగం చేయడంతోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ను రాజ్యాంగేతర శక్తిలా వాడుకుంటోంది. అక్రమంగా నమోదు చేసిన మద్యం కేసులో అధికారులపై బెదిరింపులకు పాల్పడుతోంది. రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డితోపాటు సంస్థలో గతంలో పని చేసిన సత్యప్రసాద్ నుంచి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు బరి తెగిస్తోంది. వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వారిని వేధిస్తోంది. అబద్ధపు వాంగ్మూలాలు తీసుకోండి..అక్రమ కేసులు బనాయించండి త్వరలోనే కొందరు కీలక నేతలను అరెస్ట్ చేస్తామని మంత్రి నారా లోకేశ్ ఇటీవల టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం వెనుక పక్కా కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయనేమీ ముఖ్యమంత్రి కాదు.. హోంమంత్రి కూడా కాదు. లోకేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మాత్రమే. పోలీసు శాఖ, సీఐడీ విభాగం, ఇతర దర్యాప్తు సంస్థలు ఆయన అధికారిక పరిధిలోకి రావు. అలాంటప్పుడు కొందరు వైఎస్సార్సీపీ నేతలను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన ఎలా ప్రకటించారన్నది కీలకంగా మారింది. అక్రమ కేసులు నమోదు చేసి వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేయాలని లోకేశ్ పోలీసు శాఖపై ఒత్తిడి తెస్తున్నారన్నది దీనిద్వారా స్పష్టమవుతోంది. తాము అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా వైఎస్సార్సీపీ కీలక నేతలను అక్రమ కేసుల్లో ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసు శాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఏసీబీ అదనపు డీజీ అతుల్ సింగ్ తదితరులపై లోకేశ్ చిందులు తొక్కారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ తరువాతే అక్రమ కేసుల కుట్రను సీఐడీ వేగవంతం చేసింది. సోషల్ మీడియా కార్యకర్తలపై వందల సంఖ్యలో అక్రమ కేసులు నమోదు చేసి తీవ్ర వేధింపులకు పాల్పడి అరాచకం సృష్టించింది. ఈ క్రమంలో నారా లోకేశ్ మరోసారి వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టుల గురించి సీఐడీ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డిలతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు సీఐడీకి స్పష్టం చేశారని తెలుస్తోంది. ఆ బాధ్యతను సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్తోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌కు అప్పగించినట్టు సమాచారం.నెలాఖరుకల్లా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాల్సిందే...ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్ వేధింపుల కుట్రను తీవ్రతరం చేశారు. మద్యం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి పాత్ర ఉందని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈమేరకు బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేరెడ్డి, ఆ సంస్థ మాజీ ఉద్యోగి సత్యప్రసాద్‌లను తీవ్రంగా వేధిస్తున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలను 164 సీఆర్పీసీ కింద ఈ నెలాఖరు కల్లా నమోదు చేయాల్సిందేనని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అల్టిమేటం జారీ చేశారు. అలా చేస్తే ఢిల్లీలో కీలక పోస్టింగు ఇస్తామని లేదంటే ఇప్పటికే వాసుదేవరెడ్డిపై నాలుగు అక్రమ కేసులు నమోదు చేశామని..ఇక ముందు మరిన్ని బనాయిస్తామని బెదిరిస్తున్నారు. అక్రమ కేసు నమోదు చేసి కనీసం రెండేళ్లపాటు జైలులో ఉంచుతామని ఘట్టమనేని శ్రీనివాస్ బెదిరించడం ప్రభుత్వ కుట్రలకు తార్కాణం. నెలాఖరునాటికి వారిద్దరితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించడమే లక్ష్యంగా సీఐడీ అధికారులు, ఘట్టమనేని శ్రీనివాస్ వేధింపులను తీవ్రతరం చేశారు. దీని వెనుక టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందన్నది స్పష్టం. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్‌తోపాటు యావత్ పోలీసు, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తమను బెదిరిస్తున్న తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ సిద్ధమవుతున్నారని సమాచారం. -
‘అసైన్డ్’పై తప్పుడు కథనాలు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో అసైన్డ్ భూముల వ్యవహారంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జున అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా.. ప్రజల్ని తప్పుదారి పట్టించేలా ఆ కథనాలున్నాయని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆనందపురం మండలం రామవరం గ్రామంలోని సర్వే నం.164–3లో 1.53 ఎకరాలు, సర్వే నం.169–2లో 0.87 ఎకరాల్ని జీఓ నం.596 ప్రకారం ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు కథనాలు వచ్చాయన్నారు. అయితే, 1977 రెÐవెన్యూ చట్టానికి లోబడే ప్రొసీడింగ్స్ మంజూరు చేశామని స్పష్టంచేశారు. అక్కిరెడ్డి బంగారయ్యకి సంబంధించి సర్వే నంబర్ 169–2లోని 0.87 ఎకరాలకు ఎలాంటి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ జారీచేయలేదన్నారు. అదేవిధంగా.. 2020లో భీమునిపట్నం మండలం అన్నవరం, భోగాపురం మండలం తూడెం గ్రామాల్లో జరిగిన ల్యాండ్ పూలింగ్ విషయంలో ఈనాడు రాసిన కథనంపై కలెక్టర్ మండిపడ్డారు. వాస్తవానికి.. అన్నవరం గ్రామంలోని సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్, భీమునిపట్నం మండలం అన్నవరం గ్రామంలోని సర్వే నం.1/101.పరిధిలోని భూమి వర్గీకరణ, మొత్తం విస్తీర్ణం 199.28 ఎకరాలు గయాలుగా నమోదైందన్నారు. ఇందులో తాము అనుభవిస్తున్నట్లుగా సదరు రైతులు ఆధారాలతో తమకెలాంటి ఫిర్యాదులూ చేయలేదన్నారు. హక్కు పత్రాలు ఏమైనా ఉంటే సమర్పించాలని పలుమార్లు రైతుల్ని కోరినా ఇవ్వలేదన్నారు. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రాంతంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలిచ్చేందుకు ఆనందపురం, పద్మనాభం మండలాల్లో పూలింగ్ జరిపినప్పుడు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే చేపట్టామని కలెక్టర్ స్పష్టంచేశారు. గ్రామసభలు సైతం నిర్వహించామని.. ఇందులో భాగంగానే 2019 నవంబర్ 28న ఎంజాయ్మెంట్ సర్వేచేసి రైతుల సమ్మతితోనే భూ సమీకరణ చేసుకునేందుకు అదే నెల 30న ఫారం–1 నోటీసులు సైతం జారీచేసినట్లు ఆయన వివరించారు. ఈ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు రాలేదనీ, దానికనుగనంగా.. సమీకరణ చేపట్టామన్నారు. రిజి్రస్టేషన్ల ప్రక్రియ కూడా తుదిదశలో ఉందని.. ఎవరైనా రైతులు మిగిలి ఉంటే.. తగిన డీ–పట్టాలతో అ«దీకృత అధికారిని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్క రైతుకీ న్యాయం చేసేలా వ్యవహరించామే తప్ప.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించినట్లుగా ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వలేదని కలెక్టర్ డా.మల్లికార్జున స్పష్టంచేశారు. -
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికే స్పీడ్ ఎక్కువ
రోమ్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వేగంగా ఎందుకు విస్తరిస్తుంది? ఎందుకు ఆ తప్పుడు సమాచారాన్ని యూజర్లు గుడ్డిగా నమ్ముతున్నారు? సోషల్ మీడియాలో కనిపించిన తప్పుడు వార్తల్లో వాస్తవాస్తవాలు సులభంగానే తెసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు ఆ పని చేయడం లేదు? తమ నమ్మకాలకు అనుగుణంగా ఉన్న వార్తలనే ఎందుకు విశ్వసిస్తున్నారు? తప్పుడు వార్తల ప్రచారాన్ని అరికట్టలేమా? సమాజంలో భిన్న విశ్వాసాలు గలవారు, వివిధ జాతులవారు ఉన్నట్లే, సోషల్ మీడియో యూజర్లలో కూడా ఉన్నారు. నిజానిజాలతో సంబంధం లేకుండా వచ్చే అవాస్తవ వార్తలు తమ నమ్మకానికి దగ్గరగా ఉంటేచాలు మెజారిటీ యూజర్లు నమ్మేస్తున్నారు. వాటిని షేర్ చేసుకుంటున్నారు. ఎక్కువ మంది షేర్ చేసుకుంటే ఆ వార్త పట్ల తమ నమ్మకాన్ని మరింత పెంచుకుంటున్నారు. కుట్రపూరిత వార్తలు, విషపూరిత వార్తలవైపు మొగ్గు చూపుతున్నారు. మృత్యుభయం కలిగించే వార్తలను మరీ నమ్మేస్తున్నారు. ముఖ్యంగా ఈ ట్రెండ్ ఫేస్బుక్లో కనిపిస్తోందని, 2010 నుంచి 2014 వరకు నాలుగేళ్లపాటు ఫేస్బుక్ పేజీలన్నింటిని క్షుణ్నంగా అధ్యయనం చేసిన నిపుణులు చెబుతున్నారు. ఇటలీలోని ‘లాబరేటరీ ఆఫ్ కాంపుటేషనల్ సోషల్ సైన్స్’కు చెందిన మిషెల డెల్ వికారియో నాయకత్వంలోని నిపుణుల బృందం ఈ అధ్యయనం చేసింది. భావసారూప్యతగల యూజర్లు కూడా నిజానిజాలతో సంబంధం లేకుండా తప్పుడు సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. పుకార్లు కూడా వేగంగానే ఫేస్బుక్ షికార్లు చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ‘హెల్త్‌కేర్ స్కీమ్’ బ్రహ్మాండంగా పనిచేస్తోందని, డొనాల్డ్ ట్రంప్ మంచి ఉత్తమ అధ్యక్షుడవుతారని, వాతావరణ మార్పులను భూతద్దంలో చూపిస్తున్నారని నమ్మేవాళ్లు వాస్తవాస్తవాల విచక్షణ జోలికి వెళ్లకుండానే వాటిని ప్రచారం చేస్తున్నారు. అందకనే కుట్రపూరిత వార్తలు వేగంగా ప్రచారం అవుతున్నాయి. ఇలాంటి భావసారూప్యత గలవారే వాటిని షేర్ చేసుకోవడం వల్ల వారి తప్పుడు భావాలకు మరింత ఊతం దొరుకుతోంది. వీటితో విభేదించే అభిప్రాయాల జోలికి వెళ్లడం లేదు. ఆ మధ్య ఫేస్బుక్లో తప్పుడు ప్రచారం వల్ల భారత్‌లోని నాగాలాండ్ ఓ ఘోరం జరిగిపోయింది. స్థానిక యువతిని ఓ ముస్లిం యువకుడు రేప్ చేశాడనే ప్రచారంతో ఆ ముస్లిం యువకుడిని నడివీధిలో స్తంభానికి కట్టేసి కొట్టారు. చోద్యం చూసిన ప్రజలంతా తమ సెల్ఫోన్లలో ఆ దృశ్యాన్ని వీడియో తీసి విస్తృతంగా షేర్ చేసుకున్నారు. ఆ ముస్లిం యువకుడు బంగ్లా దేశీయుడని కూడా తప్పుడు ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జాతి విద్వేషాన్ని మరింత రెచ్చగొట్టింది. ఈలోగా తీవ్రంగా కొట్టడంతో ఆ ముస్లిం యువకుడు చనిపోయాడు. ఆ స్థానిక యువతికి, ఆ యువకుడికి ఎప్పటి నుంచో శారీరక సంబంధం ఉందని, వారి మధ్య ఇష్టపూర్వకంగా జరిగిన సెక్స్‌ను రేప్‌గా ప్రచారం చేశారని, ఆ ముస్లిం యువకుడు బంగ్లా శరణార్థి కాడని, స్థానికంగా పుట్టి పెరిగన వాడేనని ఆనక దర్యాప్తులో తేలింది. మరి ఇలాంటి ప్రచారాన్ని అరికట్టేది ఎవరు? అపార వైజ్ఞానిక, సామాజిక సమాచార బ్యాంక్ కలిగిన ‘గూగుల్’ ఆ పని చేయవచ్చు. అలా చేస్తే గూగుల్ సెన్సార్‌పై కొత్త వివాదం తలెత్తవచ్చు. ఇలాంటి పరిస్థితులో తప్పుడు వార్తల ప్రచారాన్ని ఎలా అరికట్టగలం? యూజర్లే ఒకటికి రెండు సార్లు మంచి చెడులను, నిజానిజాలను విచక్షణతో ఆలోచించాలి. భిన్నాభిప్రాయలను గౌరవించే సంస్కృతిని అలవర్చుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సంస్కారాన్ని పెంచుకోవాలి. నేడు ప్రజావేదికలకులేని స్వేచ్ఛ సోషల్ మీడియాకు ఉంది. స్వేచ్ఛా స్ఫూర్తి అంటే వాస్తవాన్ని గ్రహించే స్ఫూర్తి ఉండాలి.