సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికే స్పీడ్ ఎక్కువ | More explore to spread the false news in Social media | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికే స్పీడ్ ఎక్కువ

Published Wed, Jan 13 2016 8:13 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికే స్పీడ్ ఎక్కువ - Sakshi

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికే స్పీడ్ ఎక్కువ

రోమ్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వేగంగా ఎందుకు విస్తరిస్తుంది? ఎందుకు ఆ తప్పుడు సమాచారాన్ని యూజర్లు గుడ్డిగా నమ్ముతున్నారు? సోషల్ మీడియాలో కనిపించిన తప్పుడు వార్తల్లో వాస్తవాస్తవాలు సులభంగానే తెసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు ఆ పని చేయడం లేదు? తమ నమ్మకాలకు అనుగుణంగా ఉన్న వార్తలనే ఎందుకు విశ్వసిస్తున్నారు? తప్పుడు వార్తల ప్రచారాన్ని అరికట్టలేమా?
 
 సమాజంలో భిన్న విశ్వాసాలు గలవారు, వివిధ జాతులవారు ఉన్నట్లే, సోషల్ మీడియో యూజర్లలో కూడా ఉన్నారు. నిజానిజాలతో సంబంధం లేకుండా వచ్చే అవాస్తవ వార్తలు తమ నమ్మకానికి దగ్గరగా ఉంటేచాలు మెజారిటీ యూజర్లు నమ్మేస్తున్నారు. వాటిని షేర్ చేసుకుంటున్నారు. ఎక్కువ మంది షేర్ చేసుకుంటే ఆ వార్త పట్ల తమ నమ్మకాన్ని మరింత పెంచుకుంటున్నారు. కుట్రపూరిత వార్తలు, విషపూరిత వార్తలవైపు మొగ్గు చూపుతున్నారు.  మృత్యుభయం కలిగించే వార్తలను మరీ నమ్మేస్తున్నారు. ముఖ్యంగా ఈ ట్రెండ్ ఫేస్‌బుక్‌లో కనిపిస్తోందని, 2010 నుంచి 2014 వరకు నాలుగేళ్లపాటు ఫేస్‌బుక్ పేజీలన్నింటిని క్షుణ్నంగా అధ్యయనం చేసిన నిపుణులు చెబుతున్నారు. ఇటలీలోని ‘లాబరేటరీ ఆఫ్ కాంపుటేషనల్ సోషల్ సైన్స్’కు చెందిన మిషెల డెల్ వికారియో నాయకత్వంలోని నిపుణుల బృందం ఈ అధ్యయనం చేసింది.
 
 భావసారూప్యతగల యూజర్లు కూడా నిజానిజాలతో సంబంధం లేకుండా తప్పుడు సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. పుకార్లు కూడా వేగంగానే ఫేస్‌బుక్ షికార్లు చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ‘హెల్త్‌కేర్ స్కీమ్’ బ్రహ్మాండంగా పనిచేస్తోందని, డొనాల్డ్ ట్రంప్ మంచి ఉత్తమ అధ్యక్షుడవుతారని, వాతావరణ మార్పులను భూతద్దంలో చూపిస్తున్నారని నమ్మేవాళ్లు వాస్తవాస్తవాల విచక్షణ జోలికి వెళ్లకుండానే వాటిని ప్రచారం చేస్తున్నారు. అందకనే కుట్రపూరిత వార్తలు వేగంగా ప్రచారం అవుతున్నాయి. ఇలాంటి భావసారూప్యత గలవారే వాటిని షేర్ చేసుకోవడం వల్ల వారి తప్పుడు భావాలకు మరింత ఊతం దొరుకుతోంది. వీటితో విభేదించే అభిప్రాయాల జోలికి వెళ్లడం లేదు.

 ఆ మధ్య ఫేస్‌బుక్‌లో తప్పుడు ప్రచారం వల్ల భారత్‌లోని నాగాలాండ్ ఓ ఘోరం జరిగిపోయింది. స్థానిక యువతిని ఓ ముస్లిం యువకుడు రేప్ చేశాడనే ప్రచారంతో ఆ ముస్లిం యువకుడిని నడివీధిలో స్తంభానికి కట్టేసి కొట్టారు. చోద్యం చూసిన ప్రజలంతా తమ సెల్‌ఫోన్లలో ఆ దృశ్యాన్ని వీడియో తీసి విస్తృతంగా షేర్ చేసుకున్నారు. ఆ ముస్లిం యువకుడు బంగ్లా దేశీయుడని కూడా తప్పుడు ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జాతి విద్వేషాన్ని మరింత రెచ్చగొట్టింది. ఈలోగా తీవ్రంగా కొట్టడంతో ఆ ముస్లిం యువకుడు చనిపోయాడు.

ఆ స్థానిక యువతికి, ఆ యువకుడికి ఎప్పటి నుంచో శారీరక సంబంధం ఉందని, వారి మధ్య ఇష్టపూర్వకంగా జరిగిన సెక్స్‌ను రేప్‌గా ప్రచారం చేశారని, ఆ ముస్లిం యువకుడు బంగ్లా శరణార్థి కాడని, స్థానికంగా పుట్టి పెరిగన వాడేనని ఆనక దర్యాప్తులో తేలింది. మరి ఇలాంటి ప్రచారాన్ని అరికట్టేది ఎవరు? అపార వైజ్ఞానిక, సామాజిక సమాచార బ్యాంక్ కలిగిన ‘గూగుల్’ ఆ పని చేయవచ్చు. అలా చేస్తే గూగుల్ సెన్సార్‌పై కొత్త వివాదం తలెత్తవచ్చు.

 ఇలాంటి పరిస్థితులో తప్పుడు వార్తల ప్రచారాన్ని ఎలా అరికట్టగలం? యూజర్లే ఒకటికి రెండు సార్లు మంచి చెడులను, నిజానిజాలను విచక్షణతో ఆలోచించాలి. భిన్నాభిప్రాయలను గౌరవించే సంస్కృతిని అలవర్చుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సంస్కారాన్ని పెంచుకోవాలి.  నేడు ప్రజావేదికలకులేని స్వేచ్ఛ సోషల్ మీడియాకు ఉంది. స్వేచ్ఛా స్ఫూర్తి అంటే వాస్తవాన్ని గ్రహించే స్ఫూర్తి ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement