‘ఎక్స్ట్రా ఫిట్టింగ్’పై కొరడా
♦ పలు షోరూమ్‌లకు ఆర్టీఏ నోటీసులు
♦ డీలర్షిప్ సస్పెండ్ చేస్తామని హెచ్చరిక
హైదరాబాద్: ఎక్స్ట్రా ఫిట్టింగ్‌లు, హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో వాహనదారుల జేబులు గుల్ల చేస్తున్న ఆటోమొబైల్ షోరూమ్‌లపై ఆర్టీఏ కొరడా ఝళిపించింది. నిబంధనలకు విరుద్దంగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్న పలు షోరూమ్‌లకు రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
తాత్కాలిక రిజిస్ట్రేషన్లు, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ల పై విధించిన ఫీజులకు 2 నుంచి 3 రెట్లు అధికంగా వసూలు చేయడం, వివిధ రకాల చార్జీలు, సేవలు, అదనపు హంగుల నెపంతో ఒక్కో వాహనం పైన రూ.3500 నుంచి రూ.5000 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఇటీవల కమిషనర్ స్వయంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కాచిగూడ, మెహదీపట్నం, తదితర ప్రాంతాల్లోని పలు షోరూమ్‌లలో అదనపు వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడికావడంతో సదరు షోరూమ్‌ల చట్టబద్దతను ప్రశ్నిస్తూ కమిషనర్ షోకాజ్ నోటీసులు అందజేశారు. నిబంధనలకు విరుద్దంగా వాహనాలను విక్రయిస్తున్న షోరూమ్‌ల డీలర్‌షిప్పులను ఎందుకు సస్పెండ్ చేయకూడదంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.