నిజమో.. అబద్ధమో... కళ్లు చెబుతాయి
లండన్: మాటలతో వర్ణించలేని అనేక భావాలను కళ్లు పలికిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కన్నుల కదలికలను బట్టి ఓ వ్యక్తి మాటలు నిజమా..? అబద్ధమా..? అన్నది కూడా తెలుసుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. తనకు తెలిసిన వ్యక్తుల గురించి ఎవరైనా తెలియదని చెప్పే సందర్భంలో అతని కనుల కదలికలను బట్టి అతడు అబద్ధం చెబుతున్నాడా లేదా అన్నది తెలుసుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు.
యూకేలోని పోర్ట్స్మౌత్ యూనివర్సిటీకి చెందిన ఐ ట్రాకింగ్ సాంకేతికతను ఉపయోగించి కొందరు వ్యక్తులపై పరిశోధన నిర్వహించారు. దీనిలో పాల్గొన్న వ్యక్తులకు తెలిసిన వారివి, సెలబ్రిటీలు, అపరిచితుల ఫొటోలు చూపించి తెలుసా అని అడిగారు. కొంతమంది తమకు తెలిసిన వారి ఫొటోలను కూడా తెలియదని చెప్పారు. అయితే అబద్ధం చెప్పేటప్పుడు వాళ్ల కళ్ల కదలికలు మారుతున్నాయని, దీన్ని బట్టి వారు అబద్ధం చెబుతున్నట్లు అర్థమవుతుందని పరిశోధకులు తెలిపారు. ఉగ్రవాదులు, నేరస్తుల విచారణలో ఈ పద్ధతి బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.