రెండు నెలల్లో రోడ్లు పూర్తి
=నిధులకు లోటు లేదు
=మేడారం జాతర దారివెంట గ్రామాలన్నింటా డబుల్ రోడ్డు
=జంపన్నవాగుపై మరో బ్రిడ్జి
=ఆర్అండ్బీ ఎస్ఈ మోహన్‌నాయక్ వెల్లడి
వరంగల్, న్యూస్‌లైన్: ‘జాతర నిధులకు ఎలాంటి లోటు లేదు. మరింత పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్త రోడ్లను గుర్తించాం. వాటి పనులను ప్రారంభించాం. జాతర రూట్లో ఉన్న గ్రామాల్లో కూడా రోడ్లను వెడల్పు చేస్తున్నాం. గత జాతర సందర్భంగా కొన్ని గ్రామాల్లో వాహనాలు నిలిచిపోవడంతో క్రేన్ పెట్టి క్లియర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు
అలాంటి గ్రామాలను, రోడ్లను గుర్తించి విస్తరిస్తున్నాం.
జనవరి 30 వరకు రోడ్లన్నీ పూర్తి చేసి జాతరకు సిద్ధంగా ఉంటాం..’ అని ఆర్అండ్బీ ఎస్ఈ జె.మోహన్ నాయక్ అన్నారు. మేడారం మహా జాతర సందర్భంగా రోడ్ల మరమ్మతులకు రూ.19 కోట్లు, ట్రైబల్ సబ్‌ప్లాన్ నుంచి రూ. 21 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. వీటిలో రూ. 19 కోట్ల విలువైన పనులకు టెండర్లు ముగిశాయని, రూ. 21 కోట్ల విలువైన పనులకు వచ్చే నెల 2న టెండర్లు పూర్తి చేస్తామన్నారు. జాతర పనులు, కొత్త రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై ఆయన గురువారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు.
మేడారం చుట్టూ కొత్త రోడ్లు
గత జాతర సమయంలో ఏయే రోడ్ల వెంట, ఎక్కడ నుంచి ఎంత మంది వస్తారనే విషయాలను గుర్తించాం. పస్రా-గుండాల రోడ్లను డబుల్ లేన్‌గా విస్తరిస్తున్నాం. పస్రా నుంచి నార్లపూర్ వెంట మొత్తం 6 కిలోమీటర్లు, బయ్యక్కపేట వరకు 11.6 కిలోమీటర్ల రోడ్డును డబుల్ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. మధ్యలో తెగిన రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నాం. తాడ్వాయి, నార్లపూర్ వరకు 11 కిలోమీటర్ల రోడ్డును పెద్దగా చేస్తున్నాం. ఇక ఊరట్టం నుంచి మల్యాల వరకు 10 కిలోమీటర్ల రోడ్డును నిర్మిస్తున్నం.
దీనికి మొదట అటవీ శాఖ అభ్యంతరం తెలిపినా తర్వాత క్లియరెన్స్ వచ్చింది. త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తాం. ఇక ప్రధానంగా కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే భక్తుల కోసం ఈసారి నేరుగా మేడారం వచ్చేందుకు ప్రధాన రోడ్డును గుర్తించాం. కరీంనగర్ నుంచి భూపాపల్లి మీద గా బయ్యక్కపేట నుంచి నేరుగా మేడారం వచ్చేందుకు రోడ్డును నిర్మిస్తున్నాం. రూ. 4 కోట్లు కేటాయించాం. ఈ రోడ్డు నిర్మాణం చేస్తే... పరకాల, జంగాలపల్లి, ములుగు ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు రావు.
గ్రామాల రోడ్లు..రెండింతలు
ప్రధానంగా గ్రామాల్లో ఉన్న రోడ్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల్లోనే ట్రాఫిక్ ఆగిపోతోంది. దీంతో ఈసారి చుట్టూ ఉన్న గ్రామాల్లోని రోడ్లను రెండింతలు చేసే ప్రయత్నం చేస్తునా. నార్లపూర్, బయ్యక్కపేట, దూదేకులపల్లి, గొల్ల బుద్దారం, రాంపూర్ గ్రామాల్లో రోడ్లను వెడల్పు చేస్తున్నాం. వట్టివా గు, తుమ్మలవాగుల నుంచి ఇప్పటి వరకు రాకపోకలకు చాలా కష్టంగా ఉండేది. కానీ, ఇప్పు డు వాటిపై రూ. 8 కోట్లతో రెండు కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తున్నాం. పనులు మొదలుపెట్టాం.
జంపన్నవాగుపై మరో బ్రిడ్జి
జంపన్నవాగుపై మరో 100 మీటర్ల పొడవుగా కొత్త బ్రిడ్జిని ప్రతిపాదించాం. దీనికి రూ. 3 కోట్లు కూడా విడుదలయ్యాయి. ఇప్పుడున్న బ్రిడ్జి పక్కనే దీనిని నిర్మాణం చేస్తాం. ఇక్కడ భూ సేకరణ సమస్య కూడా లేదు. గతంలో సేకరించిన భూమి ఉంది. జనవరి 30 నాటికి ఈ బ్రిడ్జిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం. దీనికి తోడు సమ్మక్క గద్దెల నుంచి జంపన్నవాగు వరకు ఇప్పుడు డబుల్ రోడ్డును 10 మీటర్ల వరకు వెడల్పు చేస్తున్నాం. దీనికి కూడా నిధుల కేటాయింపు జరిగింది.
దీంతో స్నాన ఘట్టాలకు వెళ్లేందుకు చాలా తేలికవుతుంది. ఇవన్నీ పూర్తి చేసి జాతర వరకు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటుంన్నాం. ఇప్పటికే టెండర్లు వేసిన కాంట్రాక్టర్లను వేరే చోట్ల పనులు చేయనీయకుండా... మేడారం పనులనే కట్టబెట్టాం. వచ్చేనెల 2న మరో రూ. 21 కోట్ల పనులకు టెండర్లు పూర్తి కాగానే... త్వరగా అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం. జాతర రూట్లోనే కాకుండా లింక్ రోడ్లన్నీ ప్రత్యేకంగా మరమ్మతులు చేస్తున్నాం. వాటన్నింటినీ జనవరి 30 వరకు పూర్తి చే స్తాం.