fairness creams ads
-
ఆ ప్రకటనలపై కొరడా.. భారీ జరిమానా, జైలు
సాక్షి, న్యూఢిల్లీ: అసత్యాలు, అభూత కల్పనలతో వ్యాపార ప్రకటనలు గుప్పించే వారిపై ఇకపై కేంద్రం కొరడా ఝుళిపించనుంది. కొన్ని రకాల రుగ్మతలు, వ్యాధులకు మేజిక్ రెమిడీల పేరుతో ప్రకటనల ద్వారా వినియోగదారులను మభ్యపెట్టాలని చూస్తే ఇకపై భారీ జరిమానా, కఠిన శిక్షలు అమలు చేసేందుకు యోచిస్తోంది. ఈ మేరకు డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనల చట్టం, 1954)కు ముసాయిదా సవరణను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల మేరకు నిబంధనలను ఉల్లఘించిన సదరు సంస్థలకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష, 50 లక్షల రూపాయల జరిమానా విధించనుంది. ఈ జాబితాలో 78 రకాల వ్యాధులను చేర్చింది. వీటిపై ప్రకటనలను నిషేధించనుంది. ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధి నివారణ, శరీరం, ముఖం రంగును మార్చే క్రీములు (ఫెయిర్ నెస్,స్కిన్ టోన్) లైంగిక సామర్థ్యం మెరుగుదల, యాంటీ ఏజింగ్ క్రీమ్, అకాల వృద్ధాప్యం, మహిళల్లో వంధ్యత్వం, జుట్టు తెలబడటం లాంటివి ముసాయిదా సవరణ చట్టంలో చేర్చింది. ఈ రుగ్మతలకు సంబంధించిన ఉత్పత్తులు, షరతులు ఏవైనా నయం చేసే మందులు, ‘మేజిక్ రెమెడీస్’ లాంటివి ప్రచారం చేయరాదని చట్టం పేర్కొంది. ఈ చట్టం ప్రకారం, మొదటి ఆరోపణ రుజువైతే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.10 లక్షల వరకు జరిమానా లేదా రెండూ శిక్షార్హమైనవి. తదుపరి నేరారోపణకు, రూ.50 లక్షల వరకు జరిమానాతో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఈ సవరణ చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిపై ప్రజల నుండి, వాటాదారుల నుండి సూచనలు, సలహాలు అభ్యంతరాలను కోరాలని అధికారులు నిర్ణయించారు. ఈ నోటీసు జారీ చేసిన తేదీ నుండి 45 రోజులలోపు వాటిని అందించాల్సి వుంటుంది. -
15 కోట్ల భారీ ఆఫర్ వద్దన్నాడు.. ఎందుకో తెలుసా!
సాక్షి, ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఓ భారీ ఆఫర్‌ను వదులుకున్నాడట. ఏకంగా రూ.15 కోట్ల డీల్ తనకు రాగా సుశాంత్ సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించడంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ ‘ఎంఎస్ ధోని: అన్‌టోల్డ్ స్టోరీ’లో ధోని పాత్రలో కనిపించిన సుశాంత్ ప్రేక్షకులను మెప్పించాడు. ఈ బయోపిక్ తర్వాత సుశాంత్‌కు ప్రకటనల నిమిత్తం ఆఫర్లు రాగా కొన్ని చేయగా, మరికొన్నింటిని తిరస్కరించాడు. ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ కంపెనీ తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తే రూ.15 కోట్లు ఇస్తామన్న ఆఫర్‌ను వద్దనుకున్నట్లు సుశాంత్ తెలిపాడు. భారీగా డబ్బులు ఇస్తామన్నా తన మనసు అందుకు ఒప్పుకోలేదన్నాడు. ‘ఫెయిర్‌నెస్ క్రీమ్ సంస్థలకు ప్రచారం కల్పించి తప్పుడు సందేశాన్ని సమాజానికి అందించాలనుకోలేదు. కొన్ని వర్గాలు, జాతుల వారి మనోభావాలను దెబ్బతీసే ప్రకటనలు చేయకపోవడమే అత్యుత్తమం. అభయ్ డియోల్, షారుక్ ఖాన్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహం, దీపికా పదుకొనే, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా లాంటి స్టార్లు గతంలో ఫెయిర్‌నెస్ క్రీమ్స్ ప్రకటనలను వ్యతిరేకించారని’ సుశాంత్ గుర్తుచేశాడు. చివరగా రాబ్తా మూవీలో కనిపించిన సుశాంత్.. ప్రస్తుతం డ్రైవ్, చందమామ దూర్కే మూవీతో పాటు సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న ‘కేదార్నాథ్’మూవీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. -
28 ఏళ్లొస్తే పెళ్లి చేసేసుకోవాలా: కంగనా
తెల్లగా ఉన్నా.. ఎర్రగా ఉన్నా.. నల్లగా ఉన్నా.. అన్నీ భగవంతుడు ఇచ్చిన రంగులేనని చెబుతోంది బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్. నల్లగా ఉన్న చర్మాన్ని నిగారింపజేసేలా వారం రోజుల్లోనే రంగు మార్చేస్తామంటూ వస్తున్న ఫెయిర్‌నెస్ క్రీముల ప్రకటనలను నిషేధించాలని ఆమె డిమాండు చేస్తానంటోంది. తన చెల్లెలు రంగు తక్కువని, అలాంటి ప్రకటనల్లో చేస్తే ఆమెతో సహా అలాంటి వారందరినీ కించపరిచినట్లే అవుతుందని.. అందుకే వీటిని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పింది. దాదాపు దశాబ్ద కాలం క్రితమే బాలీవుడ్ తెరమీదకు అడుగుపెట్టినా.. తనకంటూ కొన్ని నిబంధనలు పెట్టుకోవడంతో ఇన్నాళ్లుగా ఎదగలేకపోయింది. కానీ ఆమెలోని నటిని చూపించే దర్శకులు ఇన్నాళ్లకు ఆమెను గుర్తించడంతో.. బాక్సాఫీసులు కంగనాకు సలాం చేస్తున్నాయి. తెలుగులో కూడా ఆమె 'ఏక్ నిరంజన్' సినిమాలో తళుక్కుమన్న విషయం తెలిసిందే. హీరోయిన్లకు కూడా ఆత్మగౌరవం అనేది ఉండాలని.. దాన్ని కించపరుచుకునేలా బయట స్టేజి షోలు, పెళ్లిళ్లలో డాన్సులు చేయొద్దని కంగనా రనౌత్ చెబుతోంది. తాను షోలు చేయను, అవార్డు ఫంక్షన్లకు వెళ్లను కాబట్టే తనకు గుర్తింపు వచ్చేందుకు పదేళ్లు పట్టిందని చెప్పింది. అందుకే చాలా ఏజెన్సీలు తనను వదిలేశాయని తెలిపింది. అయినా సరే.. టాలెంటునే నమ్ముకున్న కంగనా.. బాలీవుడ్‌ను ఏలేస్తున్న సంగతి తెలిసిందే. దీన్నే అందరూ పాటిస్తే హీరోయిన్ల ఆత్మగౌరవం నిలబడుతుంది కదూ. అలాగే పెళ్లి విషయంలో కూడా ఆమె తన అభిప్రాయాలను నిశ్చితంగా చెప్పింది. 28 ఏళ్లు వచ్చాయంటే పెళ్లి చేసేసుకోవాలని ఎక్కడైనా రూలుందా అని కంగనా ప్రశ్నించింది. పెళ్లి చేసుకోడానికి తగిన వయసు 'ఇదీ' అంటూ ఏమీ లేదని.. మనసుకు నచ్చినప్పుడు చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పుడు తన పరిస్థితి బాగుందని, ఇలాంటి సమయంలో దీన్ని వదిలేసి పెళ్లి అంటూ వెళ్లిపోవాల్సిన అవసరం తనకు లేదని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పింది.