28 ఏళ్లొస్తే పెళ్లి చేసేసుకోవాలా: కంగనా
తెల్లగా ఉన్నా.. ఎర్రగా ఉన్నా.. నల్లగా ఉన్నా.. అన్నీ భగవంతుడు ఇచ్చిన రంగులేనని చెబుతోంది బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్. నల్లగా ఉన్న చర్మాన్ని నిగారింపజేసేలా వారం రోజుల్లోనే రంగు మార్చేస్తామంటూ వస్తున్న ఫెయిర్నెస్ క్రీముల ప్రకటనలను నిషేధించాలని ఆమె డిమాండు చేస్తానంటోంది. తన చెల్లెలు రంగు తక్కువని, అలాంటి ప్రకటనల్లో చేస్తే ఆమెతో సహా అలాంటి వారందరినీ కించపరిచినట్లే అవుతుందని.. అందుకే వీటిని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పింది. దాదాపు దశాబ్ద కాలం క్రితమే బాలీవుడ్ తెరమీదకు అడుగుపెట్టినా.. తనకంటూ కొన్ని నిబంధనలు పెట్టుకోవడంతో ఇన్నాళ్లుగా ఎదగలేకపోయింది. కానీ ఆమెలోని నటిని చూపించే దర్శకులు ఇన్నాళ్లకు ఆమెను గుర్తించడంతో.. బాక్సాఫీసులు కంగనాకు సలాం చేస్తున్నాయి. తెలుగులో కూడా ఆమె 'ఏక్ నిరంజన్' సినిమాలో తళుక్కుమన్న విషయం తెలిసిందే.
హీరోయిన్లకు కూడా ఆత్మగౌరవం అనేది ఉండాలని.. దాన్ని కించపరుచుకునేలా బయట స్టేజి షోలు, పెళ్లిళ్లలో డాన్సులు చేయొద్దని కంగనా రనౌత్ చెబుతోంది. తాను షోలు చేయను, అవార్డు ఫంక్షన్లకు వెళ్లను కాబట్టే తనకు గుర్తింపు వచ్చేందుకు పదేళ్లు పట్టిందని చెప్పింది. అందుకే చాలా ఏజెన్సీలు తనను వదిలేశాయని తెలిపింది. అయినా సరే.. టాలెంటునే నమ్ముకున్న కంగనా.. బాలీవుడ్ను ఏలేస్తున్న సంగతి తెలిసిందే. దీన్నే అందరూ పాటిస్తే హీరోయిన్ల ఆత్మగౌరవం నిలబడుతుంది కదూ.
అలాగే పెళ్లి విషయంలో కూడా ఆమె తన అభిప్రాయాలను నిశ్చితంగా చెప్పింది. 28 ఏళ్లు వచ్చాయంటే పెళ్లి చేసేసుకోవాలని ఎక్కడైనా రూలుందా అని కంగనా ప్రశ్నించింది. పెళ్లి చేసుకోడానికి తగిన వయసు 'ఇదీ' అంటూ ఏమీ లేదని.. మనసుకు నచ్చినప్పుడు చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పుడు తన పరిస్థితి బాగుందని, ఇలాంటి సమయంలో దీన్ని వదిలేసి పెళ్లి అంటూ వెళ్లిపోవాల్సిన అవసరం తనకు లేదని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పింది.