Faiz
-
బనగానపల్లె పీఎస్ వద్ద ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేతపై అక్రమ కేసులు
సాక్షి, నంద్యాల జిల్లా: బనగానపల్లె పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఫైజ్‌పై మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రోద్బలంతో అక్రమ కేసులు బనాయించారు. గత బుధవారం అబ్దుల్ ఫైజ్ ఇంటిపై మంత్రి బీసీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. అబ్దుల్ ఫైజ్‌కు న్యాయం చేయాల్సిన పోలీసులు ఆయనపైనే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పెద్ద ఎత్తున వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు భారీగా మోహరించారు.ఈ నెల 15న అబ్దుల్‌ఫైజ్ కుమారుడు అబ్దుల్ ఉబేద్ వివాహం జరుగుతుండగా.. ఆ ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులను భయంభ్రాంతులకు గురి చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. అబ్దుల్‌ఫైజ్ కథనం మేరకు.. పెద్ద కుమారుడు అబ్దుల్‌ఉబేద్ జోడే కావడంతో బుధవారం విద్యుత్ దీపాలంకరణతో ఇంటిని తీర్చిదిద్దారు. ఈ ఇంటిని హైదరాబాద్ నుంచి వచ్చిన డ్రోన్ కెమెరామెన్స్ చిత్రీకరిస్తున్నారు. అబ్దుల్‌ఫైజ్ ఇంటికి సమీపంలో ఉన్న మంత్రి ఇంటి వద్ద నుంచి కొందరు టీడీపీ అనుచరులు ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి.. డ్రోన్ కెమెరాను లాక్కొని కిందపడేసి పగులకొట్టారు.అలాగే ఇంట్లో ఉన్న మహిళలను కూడా భయంభ్రాంతులకు గురి చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సీఐ ప్రవీణ్‌కుమార్ వెంటనే అబ్దుల్‌ఫైజ్ ఇంటి వద్దకు వెళ్లి ఆయన కూడా మంత్రి అనుచరులకు వత్తాసు పలికారు. డ్రోన్ కెమెరామెన్ల పై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వెంటనే అబ్దుల్‌ఫైజ్ ఇంటి వద్దకు వెళ్లి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
‘హమ్ దేఖేంగే’ను ఆలాపించడంపై దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత పాకిస్థానీ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ‘హమ్ దెఖేంగే’ కవితను ఐఐటీ కాన్పూర్‌లో ఆలాపించడం వివాదంగా మారింది. ఫైజ్ కవిత హిందూ వ్యతిరేకమైనదని, దీనిని పాడటం దేశద్రోహం అంటూ ఈ కవితను పాడిన విద్యార్థులకు వ్యతిరేకంగా కేసు నమోదైంది. ఈ కేసు వివాదంపై ప్రఖ్యాత బాలీవుడ్ గీత రచయిత జావేద్ అఖ్తర్ స్పందించారు. ఫైజ్ కవితను హిందూ వ్యతిరేకమైనదని పేర్కొనడం అసంబద్ధం, హాస్యపూరితమని ఆయన కొట్టిపారేశారు. ఇలాంటి వివాదాన్ని అసలు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. అప్పటి పాకిస్థానీ పాలకుడు జియా ఉల్ హక్ ఛాందసవాద, మతతత్వ, ప్రగతినిరోధక పాలనకు వ్యతిరేకంగా ఫైజ్ ఈ కవిత రాశారని తెలిపారు. అవిభాజ్య భారతం నుంచి వచ్చిన ప్రగతిశీల రచయితల్లో ఫైజ్ ప్రముఖుడని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్రం గురించి కవితలు రాసిన ఫైజ్.. ఆ తర్వాత చోటుచేసుకున్న దేశ విభజన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ కవితలు రాశారని, దేశ విభజనను వ్యతిరేకించిన కవిని ఇప్పుడు దేశద్రోహి అని అభివర్ణించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఫైజ్ తన జీవితంలో సగభాగం పాక్ వెలుపలే గడిపాడని, అప్పట్లో పాక్ ద్రోహి అని కూడా అతనికి ముద్ర వేశారని గుర్తు చేశారు. -
వైఎస్ఆర్సీపీ నాయకుడి ఐరన్‌మార్టుకు నిప్పు
బనగానపల్లెటౌన్: పట్టణంలోని వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఫైజ్‌కు చెందిన ఐరన్ మార్టుకు శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియన వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పుంటించారు. వెంటనే స్థానికులు, రాత్రి బీట్‌లో ఉన్న పోలీసులు గమనించడంతో ఘోరఅగ్ని ప్రమాదం తప్పింది. బాధితుడి సోదరుడు ఖైజ్ శనివారం తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కేడీసీసీ బ్యాంకు సమీపంలో ఉన్న ఫయాజ్ ఐరన్ మార్టు దుకాణంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అర్ధరాత్రి షెట్ట్టర్ కింద పెట్రోల్ పోసి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి పరారు అయ్యారు. మంటలు వ్యాపించడంతో గమనించిన స్థానికులు, రాత్రి పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు వెంటనే అదుపులోనికి తెచ్చారు. ఈ సంఘటనలో చిన్న పైప్‌లు, గొట్టలు కాలిపోయాయి. పెద్దగా ఆస్తి నష్టం జరగా లేదు. సంఘటన స్థలాన్ని సాయంత్రం కర్నూలు నుంచి వచ్చిన డ్వాగ్ స్క్వాడ్ బృందం పరిశీలించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మంజునాథ్ పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి: కాటసాని వైఎస్ఆర్సీపీ నాయకుడు ఫైజ్‌కు చెందిన ఐరన్ మార్టుకు నిప్పంటించిన దుండగులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పోలీసు ఉన్నతాధికారులను కోరారు. అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని కాటసాని సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుతో మాట్లాడుతూ 2000 సంవత్సరంలో కూడ బనగానపల్లె పట్టణంలో వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేసేందుకు కొదరు నాయకులు ఇటువంటి సంఘటలకే పాల్పడ్డారని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి సంఘటలు పునరావృతం చేసేందుకు అసాంఘీక శక్తులు ప్రయత్నిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న బనగానపల్లె పట్టణంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని రామిరెడ్డి పేర్కొన్నారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద వెంకటరెడ్డి, డాక్టర్ మహమ్మద్‌హుస్సేన్, న్యాయవాది ఖైర్, ఎవరెస్టు బాబు, ఆచారి, ఖానిక్, బాబులాల్, సురేష్‌కుమార్, తదితరులు ఉన్నారు.