fake pan cards
-
నకిలీ పాన్‌కార్డులు.. 2 కోట్లు టోకరా
సాక్షి, హైదరాబాద్: నగరంలో నకిలీ పాన్‌కార్డులు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి పాన్‌కార్డులు తయారు చేసి బ్యాంకులను మోసం చేస్తున్న16 మందిని అదుపులోకీ తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నాలుగు గ్యాంగ్‌లుగా ఏర్పడిన నిందితులు ఇప్పటి వరకు 2 కోట్ల 39 లక్షల మేర బ్యాంకులకు టోకరా వేశారు. పట్టుబడ్డ నిందితుల నుంచి రూ. 4 లక్షల రూపాయల నగదు , 7 ల్యాప్ టాప్‌లు, వివిధ బ్యాంకులకు చెందిన 200 క్రెడిట్ కార్డులు, 49 పాన్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు పలువురు బ్యాంకు సిబ్బంది సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
పాన్ కార్డుకూ ఆధార్ లింకు!
మీకు పాన్ కార్డు ఉందా? దానికి ఆధార్ కార్డును లింక్ చేసుకున్నారా... లేకపోతే వెంటనే త్వరపడండి. మీరు అలా లింక్ చేయకపోతే వచ్చే సంవత్సరం జనవరి ఒకటో తేదీ తర్వాత మీ పాన్ కార్డు ఎందుకూ పనికిరాదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలే తెలిపాయి. ఇప్పటికే దాదాపు దేశవ్యాప్తంగా చాలామందికి ఆధార్ కార్డులున్నాయి. దాంతో వాటి వాడకాన్ని మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం తలపెడుతోంది. ప్రస్తుతం ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేవారందరికీ తప్పనిసరిగా పాన్ కార్డు ఉండాల్సిందే. అంతవరకు ఓకే గానీ, పన్నులతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కూడా చాలామంది పాన్ కార్డులు తీసుకుంటున్నారు. కానీ, వీటిలో చాలావరకు నకిలీ కార్డులు ఉన్నాయన్న అనుమానాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఒక్కరే రెండేసి కార్డులు తీసుకున్న సందర్భాలు సైతం అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయి. దాంతో ఇలాంటి అక్రమాలన్నింటికీ చెక్ పెట్టేందుకు పాన్ కార్డుకు ఆధార్ లింకేజి ఏర్పాటుచేయాలని ప్రభుత్వం తలపెట్టింది. డిసెంబర్ 31వ తేదీలోగా ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని చెబుతున్నారు. దేశ జనాభాలోని పెద్దవాళ్లలో 98 శాతం మందికి ఆధార్ కార్డులు ఉన్నాయని, దాంతో.. ఈ ఏడాది చివరవరకు అంటే సమయం చాలా ఉన్నట్లేనని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో 108 కోట్ల మందికి ఆధార్ కార్డులున్నాయి. అందువల్ల ప్రభుత్వ పథకాల లబ్ధి లాంటి వాటన్నింటికీ దీన్ని అనుసంధానం చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ ఉపయోగాన్ని క్రమంగా విస్తరిస్తోంది. దేశంలో 25 కోట్ల పాన్ కార్డులున్నాయి. 50 వేలకు మించిన నగదు లావాదేవీలు అన్నింటికీ పాన్ కార్డు నెంబరును రాయడం తప్పనిసరి. అలాగే 2 లక్షల రూపాయలకు మించి బంగారం కొన్నా పాన్ నెంబరును రాయాల్సిందే. ఈ నేపథ్యంలో పాన్ కార్డుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ దశలో ఆధార్ లింకేజిని తప్పనిసరి చేస్తే, ఇక కొత్తగా వస్తున్న కార్డులకు కూడా ఆధార్ లింకేజి ఉంటుంది కాబట్టి.. మోసాలకు తావుండదని భావిస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ తర్వాత తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని, లేకపోతే తమకు ఆధార్ కార్డు ఉందన్న విషయాన్ని నిరూపించుకోవాలని అంటున్నారు. -
పాన్ కార్డు ఖరీదు 105!!
ఇప్పటివరకు మీకు పాన్‌కార్డు లేదా? కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఆదాయపన్ను శాఖకు పన్నులతో కలిపి 105 రూపాయలు చెల్లించాల్సిందే. భారతీయ పౌరులకు పాన్ కార్డులు జారీ చేసేముందు వారి వారి పత్రాల పరిశీలనకు ఆదాయపన్ను శాఖ కొత్త విధివిధానాలను నోటిఫై చేసింది. ఒకే వ్యక్తికి రెండు మూడు పాన్ కార్డులు లేకుండా చూసేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పుడు మొత్తం 105 రూపాయలు చెల్లించి పాన్ కార్డు పొందొచ్చు. అయితే సర్వీసు చార్జిని మాత్రం మార్చలేదు. జనన ధ్రువీకరణ, చిరునామా, గుర్తింపు ధ్రువీకరణకు ఒరిజినల్ డాక్యుమెంట్ల పరిశీలన ప్రక్రియను కూడా ఇటీవలే ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి కొత్తగా ఎవరైనా పాన్ కార్డులు కావాలనుకుంటే వాళ్లు తమ గుర్తింపు, చిరునామా, జనన ధ్రువీకరణ పత్రాల కాపీలను దరఖాస్తుతో పాటు జతచేయాలని, వాటి ఒరిజినల్స్‌ను చెక్ చేసి తర్వాత తిరిగిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దరఖాస్తుదారులు తమ పత్రాల కాపీల మీద సంతకాలు చేయాల్సి ఉంటుంది. బినామీ ఆస్తులు కూడగట్టుకోడానికి, పన్నులు ఎగవేయడానికి వీలుగా ఒకే వ్యక్తి రెండు మూడు పాన్ కార్డులు తీసుకుంటున్న వైనాన్ని ఆదాయపన్ను శాఖ పలు సందర్భాలలో గుర్తించింది. ఇప్పుడు అత్యాధునిక పరిజ్ఞానాన్ని కూడా ప్రవేశపెడుతుండటంతో, ఏమాత్రం పొరపాట్లు లేకుండా పాన్ కార్డులు జారీచేసే అవకాశం కనిపిస్తోంది.