పాన్ కార్డుకూ ఆధార్ లింకు! | soon, pan cards have to be linked with aadahar | Sakshi
Sakshi News home page

పాన్ కార్డుకూ ఆధార్ లింకు!

Published Fri, Mar 24 2017 3:52 PM | Last Updated on Fri, May 25 2018 6:12 PM

పాన్ కార్డుకూ ఆధార్ లింకు! - Sakshi

పాన్ కార్డుకూ ఆధార్ లింకు!

మీకు పాన్ కార్డు ఉందా? దానికి ఆధార్ కార్డును లింక్ చేసుకున్నారా... లేకపోతే వెంటనే త్వరపడండి. మీరు అలా లింక్ చేయకపోతే వచ్చే సంవత్సరం జనవరి ఒకటో తేదీ తర్వాత మీ పాన్ కార్డు ఎందుకూ పనికిరాదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలే తెలిపాయి. ఇప్పటికే దాదాపు దేశవ్యాప్తంగా చాలామందికి ఆధార్ కార్డులున్నాయి. దాంతో వాటి వాడకాన్ని మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం తలపెడుతోంది. ప్రస్తుతం ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేవారందరికీ తప్పనిసరిగా పాన్ కార్డు ఉండాల్సిందే. అంతవరకు ఓకే గానీ, పన్నులతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కూడా చాలామంది పాన్ కార్డులు తీసుకుంటున్నారు. కానీ, వీటిలో చాలావరకు నకిలీ కార్డులు ఉన్నాయన్న అనుమానాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఒక్కరే రెండేసి కార్డులు తీసుకున్న సందర్భాలు సైతం అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయి.

దాంతో ఇలాంటి అక్రమాలన్నింటికీ చెక్ పెట్టేందుకు పాన్ కార్డుకు ఆధార్ లింకేజి ఏర్పాటుచేయాలని ప్రభుత్వం తలపెట్టింది. డిసెంబర్ 31వ తేదీలోగా ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని చెబుతున్నారు. దేశ జనాభాలోని పెద్దవాళ్లలో 98 శాతం మందికి ఆధార్ కార్డులు ఉన్నాయని, దాంతో.. ఈ ఏడాది చివరవరకు అంటే సమయం చాలా ఉన్నట్లేనని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో 108 కోట్ల మందికి ఆధార్ కార్డులున్నాయి. అందువల్ల ప్రభుత్వ పథకాల లబ్ధి లాంటి వాటన్నింటికీ దీన్ని అనుసంధానం చేస్తున్న విషయం తెలిసిందే.

గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ ఉపయోగాన్ని క్రమంగా విస్తరిస్తోంది. దేశంలో 25 కోట్ల పాన్ కార్డులున్నాయి. 50 వేలకు మించిన నగదు లావాదేవీలు అన్నింటికీ పాన్ కార్డు నెంబరును రాయడం తప్పనిసరి. అలాగే 2 లక్షల రూపాయలకు మించి బంగారం కొన్నా పాన్ నెంబరును రాయాల్సిందే. ఈ నేపథ్యంలో పాన్ కార్డుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ దశలో ఆధార్ లింకేజిని తప్పనిసరి చేస్తే, ఇక కొత్తగా వస్తున్న కార్డులకు కూడా ఆధార్ లింకేజి ఉంటుంది కాబట్టి.. మోసాలకు తావుండదని భావిస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ తర్వాత తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని, లేకపోతే తమకు ఆధార్ కార్డు ఉందన్న విషయాన్ని నిరూపించుకోవాలని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement