pan cards
-
పాన్‌కార్డులో మార్పులు చేయాలా..? ప్రాసెస్ ఇదే..
ఫొటో ఐడెంటిటీలో భాగంగా మన వద్ద ఆదార్, ఓటర్ ఐటీ వంటి చాలా కార్డులే ఉంటాయి. అయితే నిత్యం వినియోగించే కార్డుల జాబితాలో ప్రస్తుతం పాన్ కార్డు కూడా వచ్చి చేరింది. విలువైన వస్తువులు కొనాలన్నా, అమ్మాలన్నా, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపాలన్నా పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. సామాన్యుడి నుంచి పెద్ద వ్యాపారి వరకు అందరూ ఈ కార్డును వినియోగిస్తుంటారు. ఈ కార్డులో వ్యక్తికి సంబంధించిన పేరు, ఫొటో, పుట్టినతేదీ, సంతకం వంటి వివరాలు ఉంటాయి. నగదు లావాదేవీలకు పాన్‌కార్డు కీలకంగా ఉంటుంది. అలాంటి కార్డులో తప్పులున్నా, పేరును మార్చుకోవాలన్నా పెద్ద సమస్యేం కాదు. ఇంటి వద్దనే మనం వీటిని సరిచేసుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లయిన తరవాత చాలా మంది మహిళలు పాన్ కార్డులో తమ ఇంటి పేరును మార్చాలనుకుంటారు. అయితే దాని కోసం ఎక్కడకీ వెళ్లే అవసరం లేకుండా తమ ఫోన్ ద్వారానే పేరు మార్చుకోవచ్చు. మార్పు చేసుకోండిలా.. మొబైల్/ డెస్క్‌టాప్ బ్రౌజర్లో టీఐఎన్ ఎన్ఎస్డీఎల్ (www.tin-nsdl.com) అని టైప్ చేస్తే, సంబంధిత వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో సర్వీసెస్ విభాగంలో PAN అనే ఆప్షన్ ఎంచుకోవాలి. కిందకు స్క్రోల్ చేశాక Change/Correction in PAN Data అనే సెక్షన్లో అప్లయ్పై క్లిక్ చేయాలి. అందులో ‘Application Type’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ‘Changes or Correction in existing PAN data’ని సెలక్ట్ చేయాలి. పాన్ నంబర్ సహా పేరు, పుట్టిన తేదీ, ఇ-మెయిల్, ఫోన్ నంబర్ తదితర వివరాలు అందులో ఇవ్వాలి. ఈ వివరాలన్నీ సబ్మిట్ చేశాక మీకో టోకెన్ నంబర్ జారీ చేస్తారు. తర్వాత కింద బటన్‌పై క్లిక్ చేసి తర్వాతి ప్రక్రియకు వెళ్లాలి. ఇప్పుడు పాన్ కార్డుకు సంబంధించిన కరెక్షన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ పేరు, పుట్టినరోజు, ఫోన్ నంబరు, ఇలా ఇక్కడ అన్నింటినీ మార్చుకొనే వీలుంటుంది. సబ్మిట్ చేశాక పేమెంట్ ఆప్షన్ వస్తుంది. నచ్చిన విధానంలో పేమెంట్ చేసే వెసులుబాటు ఉంటుంది. పేమెంట్ అయిన వెంటనే మీరు కార్డును అప్డేట్ చేసినట్టుగా ఓ స్లిప్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. -
పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్
ఆధార్ కార్డ్‌తో లింక్ చేయని కారణంగా పనిచేయకుండా పోయిన (ఇనాపరేటివ్) పాన్ కార్డులు, ఇతర కారణాలతో ఇన్‌యాక్టివ్‌గా మారిన పాన్ కార్డులు రెండూ ఒకటి కావు. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైలింగ్ సందర్భంగా ఇనాపరేటివ్, ఇనాక్టివ్ పాన్ కార్డుల మధ్య తేడా తెలియక తికమక పడుతున్న ప్రజలకు ఆదాయపు పన్ను శాఖ క్లారిఫికేషన్ ఇచ్చింది. ‘పనిచేయని (ఇనాపరేటివ్) పాన్ కార్డు, ఇన్‌యాక్టివ్ పాన్ కార్డు రెండూ వేరు వేరు. పాన్ కార్డు పనిచేయక పోయినా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయవచ్చు’ అని ఐటీ శాఖ ట్విటర్లో పోస్టు ద్వారా తెలియజేసింది. అయితే పనిచేయని పాన్లకు పెండింగ్‌లో ఉన్న రీఫండ్లు, వాటి మీద వడ్డీలు చెల్లింపులు సాధ్యం కావని స్పష్టం చేసింది. ఇదీ చదవండి ➤ Inoperative PAN: పాన్ కార్డ్ పనిచేయడం లేదా..? అయితే ఈ లావాదేవీలు చేయలేరు! అలాగే ఇనాపరేటివ్ పాన్ ఉన్నవారికి టీడీస్ (ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్), టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్) లను అధిక రేటుతో విధించనున్నట్లు పేర్కొంది. కాగా ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ లింక్ చేయడానికి గడువు జూన్ 30తో ముగిసింది. ఎన్ఆర్ఐ పాన్లపై స్పష్టత ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు తమ పాన్ ఇన్ఆపరేటివ్గా (పనిచేయకపోతే) మారిపోతే, నివాస ధ్రువీకరణ పత్రాలతో అసెసింగ్ అధికారులను సంప్రదించాలని ఆదాయపన్ను శాఖ సూచించింది. తమ పాన్లు పనిచేయకుండా పోవడం పట్ల కొందరు ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుల (ఓసీఐలు) నుంచి ఆందోళన వ్యక్తమైనట్టు తెలిపింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఐటీఆర్ దాఖలు చేసిన వారి స్టేటస్ వివరాలను తామే జురిస్డిక్షనల్ అసెసింగ్ ఆఫీసర్లకు పంపించినట్టు స్పష్టం చేసింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో రిటర్నులు దాఖలు చేయని లేదా తమ నివాస హోదాను అప్డేట్ చేయని వారి పాన్లు పనిచేయకుండా పోయినట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది. Dear Taxpayers, Concerns have been raised by certain NRIs/ OCIs regarding their PANs becoming inoperative, although they are exempted from linking their PAN with Aadhaar. Further, PAN holders, whose PANs have been rendered inoperative due to non-linking of PAN with Aadhaar,… — Income Tax India (@IncomeTaxIndia) July 18, 2023 -
NRI PAN Card: ఎన్ఆర్ఐ పాన్ కార్డు కోసం సింపుల్ టిప్స్!
ప్రస్తుతం ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి వాటికి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికి తెలుసు. దేశంలో ఉన్న ప్రజలందరూ దాదాపు ఆధార్ కార్డు, ఆదాయ పన్ను చెల్లించేవారు పాన్ కార్డు కలిగి ఉంటారు. అయితే కేవలం భారతదేశంలో ఉన్నవారు మాత్రమే కాకుండా ప్రవాస భారతీయులు (NRI) కూడా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. పాన్ (పర్మనెంట్ అకౌంట్ నెంబర్) అనేది నెంబర్స్, ఇంగ్లీష్ అక్షరాలతో కలిసి ఉంటుంది. మనదేశంలోని ఆదాయ పన్ను శాఖ ఈ పాన్ నెంబర్‌తో కూడిన కార్డును జారీ చేస్తుంది. ఇండియాలో పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్నవారు ఖచ్చితంగా పాన్ కార్డ్ కలిగి ఉండాలి. పాన్ కార్డు కోసం ప్రవాస భారతీయులు ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ తెలుసుకోవచ్చు.. ప్రవాస భారతీయులు ఎవరు అప్లై చేయాలి భారతదేశంలో ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్న వారు. భారతదేశంలో స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే వారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనునుకునే వారు. మ్యుచ్చువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలన్న ఆసక్తి చూపే వారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడం UTIITSL లేదా Proteanలో అప్లై ఆన్లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ టైప్ కింద ఫామ్ 49ఏ ఫర్ ఎన్ఆర్ఐ సెలెక్ట్ చేసుకోవాలి. విదేశీ పౌరసత్వం ఉన్నవారైతే ఫామ్ 49ఏఏ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో అన్ని వివరాలను నింపిన తరువాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఎన్ఆర్ఐ పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఎన్ఆర్ఐ పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ పూర్తిగా ఫిల్ చేసిన అవసరమైన డాక్యుమెంట్స్, డిజిటల్ సిగ్నేచర్ వంటివి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. తరువాత ఓపెన్ అయ్యే పేమెంట్ పేజీలో అమౌంట్ పే చేసిన తరువాత అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవడం ఆన్లైన్ విధానం గురించి అవగాహన లేనివారు, ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలనుకునేవారు సమీపంలో ఉన్న ఐటి పాన్ సర్వీస్ సెంటర్ లేదా టిఐఎన్ ఫెసిలిటేషన్ సెంటర్ సందర్శించాలి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి, ఫీజు చెల్లించి అక్కడే సబ్మిట్ చేయాలి. డీడీ ద్వారా కూడా చెల్లించాల్సిన ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన తరువాత వారు ఇచ్చే అక్నాలెడ్జ్మెంట్ స్లిప్‌ని పాన్ కార్డ్ వచ్చేవరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. -
మీ పాన్ కార్డ్‌లో తప్పులు ఉన్నాయా? ఇలా ఈజీగా మార్చుకోవచ్చు!
ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరిగా వాడేవారు. భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపే వ్యాపార వేత్తలు, కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు మాత్రమే పాన్ కార్డు వాడే వారు. కాల క్రమంలో ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి రావడంతో పాన్ కార్డు తప్పనిసరి. ఇలా పాన్ కార్డు కీలక పాత్ర పోషిస్తోంది. ఒక్కోసారి ఇంటి పేరులోనూ, అసలు పేరులోనూ, లేదా అడ్రస్ ఇలాంటి వివరాల్లో తప్పులు దొర్లవచ్చు. కొన్ని సందర్భాల్లో పెళ్లైన యువతులకు వారి ఇంటి పేరు మారుతుంది. అలాంటి సమయంలో వారు తమ పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వారు ఇంటినుంచే తమ మొబైల్ ఫోన్లోనైనా, డెస్క్‌టాప్ కంప్యూటర్లలోనైనా ఆన్లైన్లో మార్చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఇలా మార్పులు చేర్పులు మీ మొబైల్ ఫోన్ లేదా డెస్క్ టాప్ కంప్యూటర్లో పాన్ అధికారిక అని టైప్ చేస్తే పాన్ కార్డుకు సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్లాలి. అక్కడ ఉన్న సర్వీస్ విభాగంలోకి వెళ్లి పాన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. కిందకు స్క్రోల్ చేస్తే Change / Correction in PAN Data సెక్షన్లోకి వెళ్లి ఆప్లై ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అక్కడ మీ పాన్ నంబర్‌తోపాటు తదితర వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అనంతరం మీకు ఒక టోకెన్ నంబర్ వస్తుంది. ఆపై కింద బటన్ నొక్కి, తర్వాత ప్రక్రియలోకి వెళ్లాలి. ఇప్పుడు పాన్ కార్డ్ కరెక్షన్ పేజీ కనిపిస్తుంది. అక్కడ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్, ఇంటి పేరు తదితర వివరాలన్నీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ వివరాలు నమోదు చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. చెల్లింపు పూర్తి అయ్యాక పాన్ కార్డు అప్డేట్ చేసినట్లు స్లిప్ వస్తుంది. ఆ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ స్లిప్ ప్రింటవుట్ తీసుకుని, దానిపై రెండు ఫొటోలు అతికించి, సంబంధిత ఎన్ఎస్డీఎల్ కార్యాలయానికి పంపించేస్తే.. అక్కడి నుంచి అప్డేటెడ్ పాన్ కార్డు అందుకుంటారు. -
ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ పనులు తప్పక చేయండి..లేదంటే!
గత ఆర్థిక సంవత్సరాంతంలో ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఎటువంటి మార్పులు లేకుండా ఆమోదించింది. బిల్లు కాస్తా చట్టమైంది. చేర్పులో.. మార్పులో.. కూర్పులో.. వెరసి .. చట్టం అమల్లోకి వచ్చేసింది. ఈ మధ్య ప్రతి రోజూ పేపర్లలో నాలుగు ముఖ్యమైన అంశాలు, ఐదు విశేషాలు, ఆరు అమల్లోకి, ఏడు మార్పులు.. పది నిబంధనలూ అంటూ ఎన్నో వ్యాసాలు వరుసగా వచ్చాయి. నంబరుతో పని లేకుండా మీరు ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో చేయవలసింది ఏమిటంటే.. ► ఇప్పటివరకూ చేసుకోకపోతే వెంటనే పాన్‌తో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోండి. అలా చేసుకోకపోతే ముందు ముందు ఆర్థిక వ్యవహారాలను స్తంభింపచేస్తారు. పెనాల్టీ పడుతుంది. ఈసారి ఇక వాయిదా ఇవ్వరు. ► 31–3–2022తో ముగిసిన సంవత్సరానికి రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు తేదీ 31–07–2022 అని మర్చిపోకండి. గత రెండు సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో పెద్ద పెద్ద వాయిదాలిచ్చారు. ఖచ్చితంగా ఈసారి వాయిదాలుండవు. ► మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే డిపార్ట్మెంట్ ఈసారి ఏప్రిల్ మొదటి వారంలోనే అన్ని ఫారంలను నోటిఫై చేసింది. సులువైన, సరళమైన ప్యాకేజీలు అమలు చేసింది. ఏ క్షణంలోనైనా ఎనేబుల్ చేస్తుంది. అలా అయింది అంటే ఆట మొదలైందన్నమాటే. ► కొత్తగా ’రివైజ్ రిటర్ను’ పట్టుకువచ్చారు. గతంలో ఏదైనా ఖర్చు అంటే .. పన్ను, వడ్డీలు కడితే వేసుకోవచ్చు. 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో ఏదేని కారణం వల్ల ఆదాయం తక్కువగా చూపి ఉంటే .. ఇప్పుడు మర్చిపోయిన ఆదాయాన్ని చూపిస్తూ .. పన్ను, వడ్డీ అదనంగా 25 శాతం లేదా 50 శాతం చెల్లించి రివైజ్ రిటర్ను వేసుకోవచ్చు. రివైజ్ చేసినప్పుడు ఆదాయం తగ్గితే ఒప్పుకోరు. ►క్రిప్టో ఆస్తుల మీద పన్ను, భవిష్య నిధిలో జమ రూ. 2,50,000 దాటితే వచ్చే వడ్డీ మీద పన్ను, అదనపు టీడీఎస్ వసూలు.. ఇలాంటివన్నీ కొత్త బరువులు. ► కోవిడ్ ఖర్చుల నిమిత్తం వచ్చిన మొత్తం, కోవిడ్ వల్ల మృత్యువాత పడినందుకు వచ్చే పరిహారం, ఉద్యోగస్తులకు కొత్త పెన్షన్ స్కీమ్ జమలపరమైన మినహాయింపులు.. ఇవన్నీ ఉపశమనాలు. ► నోటీసులు ఎప్పుడైనా రావచ్చు. చకోర పక్షుల్లాగా రోజూ మీ ఈమెయిల్ బాక్సును గమనించండి. వెంటనే జవాబు ఇవ్వండి. అశ్రద్ధ వద్దు. కొన్ని చిన్న చిన్న వివరణల వల్ల .. సవరణల వల్ల సమస్య సమసిపోతుంది. కొన్నింటికి రుజువులు ఇవ్వాలి. స్క్రూటినీ అయితే .. బాగా ప్రిపేర్ అవ్వాలి. తగినంత సమయం ఇస్తారు. అలుసు తీసుకుని జాప్యం చేయొద్దు. ఫేస్‌లెస్ రోజులివి! ►ఈ మధ్య డాక్టర్ల విషయంలో బుక్స్ రాయలేదని పెనాల్టీలు వేశారు. ఉద్యోగస్తులు అవసరం లేదు. ఇతరులు బుక్స్ రాయండి. ఇప్పుడు ఎన్నో అకౌంటింగ్ ప్యాకేజీలు ఉన్నాయి. రుజువులు భద్రపర్చుకోండి. జీఎస్టీ చట్టప్రకారం నడుచుకోండి. ► ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్లానింగ్ ఆలోచించండి. ఆస్తి కొనాలన్నా.. అమ్మాలన్నా.. ఆస్తుల పంపకం, రిటైర్మెంట్ ప్రయోజనాలు, వ్యాపారం చేయాలన్నా.. పెద్ద పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్ చేయాలన్నా.. ఆలోచించి అడుగేయండి. -
మీ మొబైల్‌తో నకిలీ పాన్-కార్డు గుర్తించండి ఇలా..?
ఆధార్ కార్డు, రేషన్ కార్డు మాదిరిగా పాన్ కార్డ్ కూడా అతి ముఖ్యమైన పత్రాలలో ఇది ఒకటి. కొత్త బ్యాంకు అకౌంట్ తీసుకోలన్నా, పన్ను చెల్లింపుల కోసం, ఈపీఎఫ్ ఖాతా వంటి వాటికి పాన్ కార్డు తప్పనిసరి అయ్యింది. అందుకే ప్రతి ఒక్కరూ పాన్ కార్డు కలిగి ఉంటే ఎంతో మంచిది. ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డులను జారీ చేస్తుంది. మీరు ఆన్లైన్లో కూడా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కొందరు మోసాగాళ్లు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని పాన్ కార్డ్ విషయంలో మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు నకిలీ కార్డులను సృష్టిస్తున్నారు. మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఉన్న పాన్-కార్డులతో పాటు ఇతరుల పాన్-కార్డులు నిజమైనవా? నకిలీవా? అనేది సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఎన్ఎస్డీఎల్ ఈ-గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూపొందించిన PAN QR Code Reader యాప్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉండాలి. ఈ యాప్‌తో నకిలీ పాన్ కార్డును ఈజీగా గుర్తించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. నకిలీ పాన్-కార్డు గుర్తించడం ఎలా..? మొదట మీ స్మార్ట్‌ఫోన్‌లో 12 మెగాపిక్సల్ గల కెమెరా ఉండాలి. ఇప్పుడు 'ప్లే స్టోర్'కు వెళ్లి, 'PAN QR Code Reader' సర్చ్ చేయండి. కేవలం ఎన్ఎస్డీఎల్ ఈ-గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డెవలప్ చేసిన PAN QR Code Reader యాప్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు 'పాన్ క్యూఆర్ కోడ్ రీడర్' యాప్ ఓపెన్ చేయగానే కెమెరా వ్యూఫైండర్లో గ్రీన్ కలర్ ప్లస్ లాంటి గ్రాఫిక్ కనిపిస్తుంది. దానిని మీరు తనిఖీ చేయాలనుకుంటున్న పాన్ కార్డు మీద కెమెరాను పాయింట్ చేయండి. ప్లస్ లాంటి గ్రాఫిక్ పాన్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ మధ్యలో ఉండేలా చూసుకోండి. ప్లస్ లాంటి గ్రాఫిక్ గుర్తు పాన్ కార్డు మీద పెట్టగానే బీప్ లాంటి సౌండ్ రావడంతో పాటు మీ ఫోన్ వైబ్రేట్ అవుతుంది. మీరు ఇచ్చిన పాన్ కార్డు వివరాలు ఇప్పుడు కనిపిస్తాయి. మీ దగ్గర ఉన్న పాన్ కార్డు వివరాలు, మొబైల్లో చూపించిన వివరాలు ఒకే విధంగా కనిపిస్తే. మీ కార్డు ఒరిజినల్ అని అర్ధం. స్కాన్ చేసిన తర్వాత వచ్చిన వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి పాన్ కార్డ్ కరెక్షన్ కోసం దరఖాస్తు చేయాలి. (చదవండి: మొబిక్విక్ సిస్టమ్స్, స్పైస్ మనీపై ఆర్బీఐ భారీ జరిమానా) -
ఆధార్‌తో పాన్ నెంబర్‌ను లింక్ చేశారా...
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ కార్డుతో పాన్ నెంబర్‌ను నిర్దేశిత గడువులోగా లింక్ చేసుకోని వినియోగదారులు త్వరగా ఆ పని పూర్తి చేయండి. లేదంటే కార్డు పనిచేయకుండా పోతుంది. ఆధార్‌తో అనుసంధానం కాని పాన్ కార్డుల రద్దుపై ఇప్పటికే పలు హెచ్చరికలను జారీ చేసిన ఆదాయ పన్ను శాఖ భారీ సంఖ్యలో పాన్ కార్డులకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. అలాగే రెండు లేదా అంతకంటే ఎక్కువ పాన్ కార్డులతో అధిక మొత్తాల్లో లావాదేవీలు నిర్వహిస్తూ తప్పించుకుంటున్న పన్ను ఎగవేతదారులపై కూడా ఐటీ శాఖ కొరడా ఝుళిపించనుంది. దీంతోపాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్, క్రెడిట్,డెబిట్ కార్డులు ద్వారా జరిపే భారీ లావాదేవీలపై కూడా నిఘా పెట్టనుంది. పాన్‌ను ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి గడువు 2021 మార్చి 31వ తేదీ లోపు లింకింగ్ ప్రక్రియ పూర్తి చేచేయకపోతే కనీసం180 మిలియన్ల (18 కోట్ల) కార్డులు రద్దయ్యే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది. 130 కోట్ల జనాభాలో కేవలం15 మిలియన్ల మంది మాత్రమే ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేశారని ఐటీ అధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరిలో 2.5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న సంస్థలు 57 శాతం, 2.5 నుంచి 5 లక్షల రూపాయల మధ్య ఆదాయం ఉన్నవారు పద్దెనిమిది శాతం, 5 నుండి 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 17శాతం, 10 నుంచి రూ .50 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 7 శాతం, 50 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు ఒక శాతం మాత్రమే ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. కాగా 32.71 కోట్లకు పైగా పాన్ కార్డులను బయోమెట్రిక్ ఐడీ ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు ఇటీవల ప్రభుత్వం తెలిపింది. జూన్ 29 నాటికి జారీ అయిన మొత్తం పాన్ కార్డుల సంఖ్య 50.95 కోట్లుగా ఉందని మైగోవ్ఇండియా ఒక ట్వీట్లో పేర్కొంది -
ఆగస్టు 31 తర్వాత ఆ పాన్‌కార్డులు చెల్లవు..
న్యూఢిల్లీ: వచ్చే నెల 31లోగా మీ పాన్‌కార్డుతో వ్యక్తిగత ఆధార్ నంబర్‌ను లింక్ చేసుకోకపోతే.. మీ పాన్‌కార్డు రద్దు కానుంది. పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకునేందుకు ఇంకా 40 రోజుల గడువు ఉంది. ఈ లోపు వాటిని లింక్ చేసుకోకపోతే.. దాదాపు 20 కోట్ల పాన్‌కార్డులు రద్దు కానున్నాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) అధికారి తాజాగా వెల్లడించారు. దేశం మొత్తంలో 43 కోట్ల మంది పాన్ కార్డ్‌ని కలిగి ఉన్నారని, 120 కోట్ల మందికి ఆధార్ కార్డు ఉందని ఆ అధికారి తెలిపారు. ఇప్పటివరకు పాన్ కార్డుల్లో 50శాతం మాత్రమే ఆధార్‌తో లింక్ అయ్యాయని తెలిపారు. ఇక, ఆధార్ కార్డు లేని 40 రోజుల్లో దీనిని తీసుకొని.. పాన్‌తో అనుసంధానించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రుణాలు, క్రెడిట్ కార్డులు పొందటానికి చట్టవిరుద్ధంగా పాన్‌కార్డ్‌లను ఉపయోగించినట్లు వెల్లడి కావడంతో ఆధార్‌కు అనుసంధానం చేయని పాన్ కార్డులను రద్దు చేయాలని ఆదాయ పన్నుశాఖ నిర్ణయించింది. నేపాల్, భూటాన్లలో సైతం భారత పాన్‌కార్డ్‌లను గుర్తింపు కార్డుగా కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. ఆగస్టు 31లోపు ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోతే.. సెప్టెంబర్ 1 నుంచి పాన్ కార్డ్ చెల్లదు. ఇదిలావుండగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం తన బడ్జెట్ ప్రసంగంలో పాన్ కార్డు లేకపోయినా.. దాని స్థానంలో ఆధార్ కార్డును ఉపయోగించి పన్నుచెల్లించవచ్చునని తెలిపారు. -
పాతవి లింక్ చెయ్యకపోతే పెనాల్టీ అంటున్నారా?
సాక్షి, అమరావతి : ఉదయాన్నే రాష్ట్ర పౌరులు ఎవరి పనుల్లో వాళ్లున్నారు. పేపర్ చూసే పనిలో ఉన్న ఓ పౌరుడు సడన్‌గా ఉలిక్కిపడ్డాడు. ఏంటన్నట్లు చూశాడు పక్కనున్న పౌరుడు. ‘‘ఈ గవర్నమెంటు ఎప్పుడూ ఏదో ఒక తలనొప్పి తెచ్చిపెడుతూనే ఉంటుంది’’ అన్నాడు చేతిలో పేపర్ ఉన్న పౌరుడు (చే.పౌ). ‘‘అవున్నిజమే. నేనూ చూశాను పేపర్లో. ఆధార్‌కి పాన్ని లింక్ చెయ్యాలట కదా.. మార్చి 31 లోపు. ఏప్రిల్‌లో పోలింగ్ డేట్ పెట్టుకుని, మార్చిలో ఈ లింకింగ్ డేట్ ఏంటో..’’ అన్నాడు పక్కనున్న పౌరుడు (ప.పౌ.) ‘‘అదేం పెద్ద ప్రాబ్లం కాదు. లింక్ చేస్తే లింకైపోతుంది’’. ‘‘మరేంటి ప్రాబ్లమ్? పాతవి లింక్ చెయ్యకపోతే పెనాల్టీ అంటున్నారా?’’ అన్నాడు ప.పౌ. పేపర్లోకి తొంగి చూస్తూ. ‘‘పాతవేం పెండింగులో లేవు. ఎప్పటికప్పుడు అన్నీ లింక్ చేసి పడేశా. ఆధార్‌ని ఫోన్ నంబర్‌కి లింక్ చేశా. ఫోన్ నంబర్ని పాన్ నంబర్‌కి లింక్ చేశా. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్‌ని లింక్ చేశా. ఆధార్‌కి గ్యాస్ అకౌంట్ లింక్ చేశా. ఓటర్ ఐడీని ఆధార్‌కి లింక్ చేశా. ఇప్పుడు ఆధార్‌ని పాన్‌కి లింక్ చెయ్యమంటున్నారు కదా. అదీ చేసేస్తా. పాన్‌కి పాన్ని, ఆధార్‌కి ఆధార్‌ని, ఫోన్‌కి ఫోన్‌ని, ఓటర్ ఐడీకి ఓటర్ ఐడీని లింక్ చెయ్యమన్నా చేసేస్తా..’’ అన్నాడు చే.పౌ. ‘‘మరింక ప్రాబ్లమ్ ఏంటి? ఏం రాశారు పేపర్లో?’’ ‘‘ఈవీఎంల్లో అభ్యర్థుల ఫొటోలు పెడుతున్నారట!’’ ‘‘మంచిదే కదా. ఒకే పేరుతో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులుంటే కన్ఫ్యూజన్ లేకుండా మన క్యాండిడేట్ ఫొటోని చూసి గుద్దే యొచ్చు’’ అన్నాడు ప.పౌ. ‘‘పార్టీ సింబల్ ఉంటుంది కదా. మళ్లీ ఫొటో ఎందుకు? ఓటర్‌కి క్లారిటీ కోసం అని ఫొటోతో పాటు పార్టీల నినాదాలు కూడా ఈవీఎంలపై రాయించేలా ఉన్నాడు ఎలక్షన్ కమిషనర్’’ అన్నాడు చే.పౌ. ‘‘సింబల్‌ని గుర్తు పట్టలేకపోతున్నారనే కదా.. ఫొటోలు పెడుతున్నారు. మొన్న తెలంగాణ ఓటర్లు కారుకి, ట్రక్కుకు తేడా కనిపెట్టలేకపోవడంతో తనకు రెండు మూడు ఓట్లు తగ్గాయని కేసీఆర్ ఎలక్షన్ కమిషన్‌కు కంప్లయింట్ కూడా చేశాడు’’ అన్నాడు ప.పౌ. ‘‘ప్రాబ్లం నీకు అర్థం కావడం లేదు’’ అన్నాడు చే.పౌ. ‘‘ఏంటి చెప్పు..’’ అన్నాడు ప.పౌ. ‘‘చెప్తే అర్థం కాదు. ఆధార్ కార్డుందా నీ దగ్గర? ఉంటే ఇటివ్వు’’ అన్నాడు. ‘‘ఆధార్ కార్డే కాదు, అన్ని కార్డులూ ఉన్నాయి’’ అని జేబులోంచి రబ్బరు బ్యాండ్వేసి ఉన్న పెద్ద కార్డుల సెట్టు ఒకటి తీశాడు ప.పౌ.! ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఆర్.సి.కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు.. అన్నీ గవర్నమెంట్ కార్డులు. ‘‘ఈ కార్డులన్నిట్లో నీ ఫొటోలు ఉన్నాయి కదా! ఒక్క ఫొటోలో అయినా నువ్వు నువ్వులా ఉన్నావా? నీ జేబులోంచి కార్డులు తీశావు కాబట్టి కార్డుల్లో ఉన్నది నేనేనని అనుకుంటున్నావు కానీ.. నీ కార్డుని మిగతావాళ్ల కార్డుల్లో కలిపి, వాటిల్లోంచి నీ కార్డేదో తియ్యమంటే తియ్యగలవా? చిలకని పట్టుకు రావల్సిందే’’ అన్నాడు చే.పౌ. చే.పౌ. పాయింట్ అర్థమైంది ప.పౌకి. ‘‘చట్టం ముందు అంతా సమానం అన్నట్లు, గవర్నమెంట్ కార్డుల్లో ఫొటోలన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి, రేపు ఈవీఎంల్లోనూ అభ్యర్థుల ఫొటోలు కూడా ఒకేలా ఉంటాయని కదా నీ పాయింట్’’ అన్నాడు ప.పౌ. ‘‘అది కాదు నా పాయింట్’’ అన్నాడు చే.పౌ. ‘‘మరేంటి?!’’ ‘‘ఫొటోల్లో అభ్యర్థులు చక్కగా కనిపిస్తున్నా.. ఒక పార్టీ గుర్తు పక్కన వేరే పార్టీ అభ్యర్థి ఫొటో అతికించారనుకో.. అప్పుడేంటీ?!’’ అన్నాడు చేతిలో పేపర్ ఉన్న పౌరుడు. ‘పాయింటే’’ అన్నాడు పక్కనున్న పౌరుడు. – మాధవ్ -
పోయినా.. పర్వాలేదు
మంత్రాలయం రూరల్ : సాంకేతిక అభివృద్ధి పరుగెడుతోంది. ఆ క్రమంలోనే ప్రతి వ్యక్తికీ అవసరాలు పెరుగుతున్నాయి. మెరుగైన సేవలు, అక్రమాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వాలు, పలు సంస్థలు కార్డులు జారీ చేస్తున్నాయి. వ్యక్తి వివరాలు, చిరునామా తదితర అంశాలతో, బార్ కోడ్‌తో రూపొందించిన పలు కార్డులు అందరి జీవన గమనంలో భాగస్వామ్యమవుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరు జేబులు, పర్సుల్లో ఐదు నుంచి పది కార్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటిని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నారు. అయినా ఒక్కోసారి పర్సు పోయినప్పుడు, జిరాక్స్ తీసుకునే సందర్భంలో మరిచిపోయినప్పుడు.. ఇతర కారణాలతో అవి దూరమైనప్పుడు ఆందోళన అంతా.. ఇంతా కాదు. అయితే కార్డు పోయినా పర్వాలేదు.. కొంత సమయం, తక్కువ ఖర్చుతో వాటిని పొందవచ్చు. అవసరమైన కార్డులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, వాటి ఉపయోగం, అవి పోగొట్టుకుంటే ఎలా పొందాలనే వివరాలతో ప్రత్యేక కథనం. రేషన్ కార్డు దరఖాస్తు విధానం: నూతన రేషన్కారు కోసం కుటుంబసభ్యుల ఫొటోతో పాటు అందరి ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీలతో పాటు దరఖాస్తు ఫారాన్ని జతపరిచి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలి. వారు వివరాలను ఆన్లైన్ నమోదు చేసి ఉంచుతారు. ప్రభుత్వం కార్డుల జారీ సమయంలో అర్హులకు పంపిణీ చేస్తారు. ఉపయోగం: పేదలకు ఈ కార్డు చాలా కీలకం. కేవలం ప్రభుత్వం తరుపున వచ్చే సబ్సిడీ సరుకులకు మాత్రమే పరిమితం కాకుండా ఆదాయం, పలు ధ్రువపత్రాలను పొందేందుకు రేషన్‌కార్డు ఉపయోగపడుతోంది. తెల్లరేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. పేదలకు ఈ కార్డు ఎంతో ఉపయోగం. డూప్లికేట్ కార్డు పొందడం ఇలా: రేషన్ కార్డు పోతే కార్డు నంబర్‌తో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ గ్రామ రెవెన్యూ అధికారిని విచారణ నిమిత్తం ఆదేశిస్తారు. ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా తహసీల్దార్ డూప్లికేట్ రేషన్‌కార్డు జారీకి ఆదేశాలు ఇస్తారు. పాన్ కార్డు దరఖాస్తు విధానం: పాన్‌కార్డు కావాలంటే ముందుగా రెండు కలర్ ఫొటోలతో ఆదాయ పన్ను విభాగపు కార్యాలయంలో దరఖాస్తుతో పాటు ఓటరు, ఆధార్ జిరాక్స్ కాపీలను జతపరిచి అందజేయాలి. అధికారులు నిర్ణయించిన చలానా కట్టాలి. దాదాపు 30 రోజుల గడువులోగా దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు కార్డు పోస్టు ద్వారా చేరుతోంది. ఉపయోగం: ఆర్థిక లావాదేవిల్లో పాన్‌కార్డు ప్రసుత్తం చాలా కీలకం. ముఖ్యంగా బ్యాంక్ ఖాతాలకు పాన్‌కార్డును అనుసంధానం చేస్తారు. అంతే కాకుండా ఇతర ఖాతాకు రూ. 50 వేలకు మించి లావాదేవీలకు తప్పకుండా పాన్‌కార్డు నంబర్ వివరాలను తెలియజేయాల్సి వస్తుంది. డూప్లికేట్ కార్డు పొందడం ఇలా: ఈ కార్డు పోతే సంబంధిత ఏజెంట్ దగ్గర కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు పాన్‌కార్డు జిరాక్స్, రెండు కలర్ ఫొటోలు, రెసిడెన్సీ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. కొత్త కార్డు కోసం దాదాపు రూ. 90 చెల్లించాలి. దాదాపు 3 వారాల్లో సూచించిన చిరునామాకు చేరుతోంది. మరిన్ని వివరాలకు www. nsdipan. com లాగిన్ అవ్వాలి. ఏటీఎం కార్డులు దరఖాస్తు విధానం: బ్యాంక్ ఖాతా తెరిచిన ప్రతి ఒక్కరికి ఏటీఎం ఎంతో అవసరం. ఇందుకోసం సంబంధిత బ్యాంక్‌లో బ్యాంక్ ఖాతా నమోదు సమయంలో తెలియజేసిన వివరాలతో సంబంధించిన బ్రాంచ్ మేనేజర్‌కు దరఖాస్తు చేసుకుంటే వారు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. దాదాపు 10 రోజుల గడువులోగా దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు పోస్టు ద్వారా వస్తుంది. ఉపయోగం: బ్యాంకులో జమ చేసిన డబ్బులను అక్కడికి వెళ్లకుండానే ఏటీఎం కేంద్రాల్లో ఏటీఎం కార్డును ఉపయోగించి తీసుకోవచ్చు. అదే కార్డు నుంచి నగదు బదిలీ సౌకర్యం కూడా కల్పించారు. నగదు రహిత లావాదేవీలకు ఈ కార్డులు ఎంతో కీలకంగా మారాయి. తిరిగి పొందడం ఇలా..: ఈ కార్డు పోగొట్టుకున్న వారు వెంటనే బ్యాంక్ వినియోగదారుల సేవ కేంద్రంలో ఫిర్యాదు చేసి వారు అడిగిన పూర్తి సమాచారం అందించి కార్డును బ్లాక్ చేయించాలి. ఆ తర్వాత వారిచ్చే ఫిర్యాదు నెంబర్‌ను సంబంధిత బ్యాంక్ మేనేజర్‌కు తెలియజేయాలి. ఈ విషయాన్ని నిర్ధారించిన తరువాత కొత్త కార్డును జారీ చేస్తారు. పాస్‌పోర్టు దరఖాస్తు విధానం: పాస్‌పోర్టు అవసరమైన వారు ముందుగా దరఖాస్తుదారుడికి సంబంధించిన రెండు ఫొటోలు, 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు వివరాలు, బ్యాంక్ స్టేట్మొంట్ ఆధారంగా ఆన్లైన్లో www. passport. com అనే వెబ్సైట్ ఆధారంగా వివరాలను నమోదు చేసుకోవాలి. ఏపీలో మొత్తం ఐదు కేంద్రాలున్నాయి. కర్నూల్, కడప తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఆయా కార్యాలయాల వారీగా మనకు అవసరమైన చోట దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో నమోదైన వివరాలను విచారణ నిమిత్తం ఆ జిల్లా ఎస్పీ కార్యాలయానికి పంపుతారు. అక్కడి నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దరఖాస్తు దారుడి వివరాలతో ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విచారణ చేసి, ఎస్పీ నివేదిక అందజేస్తారు. వారు అక్కడి నుంచి పాస్‌పోర్టు అధికారికి పూర్తి స్థాయిలో నివేదిక పంపుతారు. దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు పోస్టు ద్వారా చేరుకుంటుంది. ఉపయోగం: పాస్‌పోర్టు ఉండటం ద్వారా మనం ఇతర దేశాలకు వెళ్లడానికి సులభతరమవుతోంది. ప్రత్యేక ప్రాంతాలకు వెళ్లాల్సిన సమయంలో పాస్పోర్టుతో పాటు వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. డూప్లికేట్ పొందడం ఇలా: పాస్‌పోర్టు పోతే ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు విచారణ చేసి లభించకపోతే నాన్ట్రేస్ ధ్రువపత్రం జారీ చేస్తారు. అనంతరం పాస్‌పోర్టు అధికారి పేరిట ఆన్లైన్ ద్వారా దాదాపు రూ.1500 చెల్లించాలి. ఈ రెండింటి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ చేసి డూప్లికేట్ పాస్‌పోర్టు జారీ చేస్తారు. ఇందుకు మూడు నెలలు సమయం పట్టవచ్చు. తాత్కాల్ పాస్‌పోర్టు కోసం నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు విధానం: డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో ప్రభుత్వం కేటాయించిన రుసుంతో పాటు ఆధార్‌కార్డు, 10వ తరగతి మార్కుల జాబితా/ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ జిరాక్స్, రెండు కలర్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించే టెస్ట్‌లో ఉత్తీర్ణత పొందితే, ఎల్ఎల్ఆర్ జారీ చేస్తారు. అనంతరం టెస్ట్ డ్రైవింగ్‌లో పాసయితే దాదాపు 15 రోజుల గడువులోగా లైసెన్స్ చేతికందుతోంది. ఉపయోగం: డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా వాహనం నడపడానికి అర్హులవుతాం. అంతే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో నకలు కాపీని అందజేయాల్సి వస్తోంది. డూప్లికేట్ పొందడం ఇలా: డ్రైవింగ్ లైసెన్స్ పోయిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు అందించే నాన్ట్రేస్ సర్టిఫికెట్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన దరఖాస్తుతో స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో అందించాలి. మరిన్ని వివరాలకు www. ap.transport.org.inవెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డు దరఖాస్తు విధానం: ఆధార్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా నివాస ధ్రువపత్రంతో పాటు రెవెన్యూ అధికారి సంతకం తప్పనిసరిగా అవసరం. దరఖాస్తుతో పాటు వీటిని జతపరిచి మీ సేవ కేంద్రంలో నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించి అక్కడ ఐరిస్ తీయించుకోవాలి. దాదాపు 30 రోజుల గడువులోగా దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు ఆధార్‌కార్డు పోస్ట్ ద్వారా వస్తుంది. ఉపయోగం: రేషన్‌కార్డు, పింఛన్ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి చేశారు. పథకాలకు ఆధార్ అనుసంధానం కాకపోతే లబ్ధిపొందలేరు. డూప్లికేట్ కార్డు పొందడం ఇలా: ఈ కార్డు పోతే టోల్‌ఫ్రీ నంబర్ 18001801947కు కాల్ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్త కార్డు మళ్లీ పోస్టులో మన చిరునామా వస్తుంది. help@uidi.gov.in.వెబ్సైట్లో పూర్తి సమాచారం పొందే అవకాశం ఉంది. ఓటరు గుర్తింపు కార్డు దరఖాస్తు విధానం: 18 సంవత్సరాలు నిండిన యువత వారి కలర్ ఫొటోలతో దరఖాస్తు ఫారాన్ని భర్తీ చేసి బూత్ లెవల్/గ్రామ రెవెన్యూ అధికారి గారికి దరఖాస్తు చేసుకోవాలి. వారు విచారణ చేపట్టి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఉంచుతారు. ఎన్నికల కమిషన్ పూర్తి వివరాలను పరిశీలించి కార్డును జారీ చేస్తారు. కార్డు బూత్ లెవల్/గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించి పొందవచ్చును. ఉపయోగం: ఓటరు కార్డు పొందిన ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వస్తుంది. కొన్ని సార్లు నివాస, పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం ఈ కార్డు అవసరమవుతోంది. డూప్లికేట్ కార్డు పొందడం ఇలా: ఈ కార్డును పోగొట్టుకుంటే పోలింగ్ బూత్ నెంబర్, కార్డు నెంబర్‌తో రూ. 10 చెల్లిస్తే మీ సేవ కేంద్రాల్లో మళ్లీ కార్డును పొందవచ్చును. నెంబర్ ఆధారంగా స్థానిక తహసీల్దార్ కార్యలయంలో దరఖాస్తు చేసుకుంటే ఈ కార్డును ఉచితంగా అందజేస్తారు. మరింత సమాచారం కోసం www. ceoap. in వెబ్సైట్లో సంప్రదించి వివరాలను తెలుసుకోవచ్చును. -
ఆధార్ లేని పాన్ కార్డులు పనికొస్తాయా?
-
ఆధార్ లేని పాన్ కార్డులు పనికొస్తాయా?
న్యూఢిల్లీ : పాన్ కార్డును ఆధార్‌తో రేపటి వరకు లింక్ చేసుకోవాలని, లేకపోతే పాన్ కార్డు పనికి రాకుండా పోతుందంటూ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు చెలరేగాయి. ఈ ఊహాగానాలన్నింటిని ఆదాయపు పన్ను శాఖ కొట్టిపారేసింది. ఆధార్‌తో లింక్ చేసుకోని పాన్ కార్డులను రద్దు చేయమని ఆదాయపు పన్ను శాఖ స్పష్టంచేసింది. బుధవారం జారీచేసిన నోటిఫికేషన్లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.'' ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిసవసరం లేదు. జూన్ 30 తర్వాత పాన్ పనికి రాకుండా పోదు'' అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశిల్ చంద్రా చెప్పారు. ఆధార్‌తో లింకులేని పాన్లు ఎప్పుడు పనికిరాకుండా పోతాయో ఆ తేదీలను బోర్డు తర్వాత నోటిఫై చేస్తుందని తెలిపారు. 2017 జూలై వరకు ఎవరైతే పాన్ కార్డును కలిగి ఉంటారో, వారందందరూ సెక్షన్ 139ఏఏ సబ్-సెక్షన్ 2 ప్రొవిజన్స్ కింద ఆధార్ నెంబర్‌ను పాన్‌కార్డులకు లింక్ చేసుకోవాలని ఈ వారంలో మొదట్లోనే ప్రభుత్వం ఓ నోటిఫికేషన్లో పేర్కొంది. పాన్‌తో ఆధార్‌ను లింక్ చేసుకునే ప్రక్రియకు చివరి తేదీగా జూన్ 30ను నిర్ణయించింది. దీంతో ఒక్కసారిగా పాన్‌తో ఆధార్‌ను లింక్ చేసుకునే ప్రక్రియలో ప్రజలందరూ నిమగ్నమై పోయారు. ఒకవేళ ఈ ప్రక్రియ జూన్ 30కి ముగియకపోతే, పాన్ కార్డులు పనికి రాకుండా పోతాయని ప్రజల్లో భయాందోళన చెలరేగింది. కానీ ఆధార్‌తో లింక్ లేకపోయినప్పటికీ పాన్ కార్డులు పనికి వస్తాయని తాజాగా సీబీడీటీ స్పష్టంచేసింది. -
‘ఆధార్’పై సుప్రీంకోర్టు సీరియస్
న్యూఢిల్లీ : ఆధార్ కార్డునే అన్నింటికీ ఆధారం చేస్తోంది కేంద్రం. సుప్రీంకోర్టు ఆధార్‌ను ఆప్షనల్‌గా పెట్టినా.. దాన్ని తప్పనిసరి నిబంధనగా చేరుస్తూ సుప్రీం ఆదేశాలకు కేంద్రం తూట్లు పొడుస్తోంది. ఈ విషయంలో కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పాన్ కార్డు పొందడానికి ఆధార్ కార్డును ఎలా తప్పనిసరి చేస్తున్నారంటూ ప్రశ్నించింది. తాము ఆప్షనల్‌గా చేయాలని ఆర్డర్ ఇచ్చినప్పుడు, తప్పనిసరి అని ఎలా ఆదేశిస్తారని మండిపడింది. అయితే ఆధార్ ను తప్పనిసరి చేయడమే ఉన్న ఒకానొక్క ఆప్షన్ అని అటార్ని జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు తెలిపారు. షెల్ కంపెనీలకు ఫండ్స్ తరలించిన వాడుతున్న చాలా పాన్ కార్డులను తాము గుర్తించామని పేర్కొన్నారు. ఈ ఫండ్స్ అక్రమ తరలింపు నిరోధించడానికి ఆధార్ ను తప్పనిసరి చేయడమే ఒకానొక్క ఆప్షన్ అని చెప్పారు. అయితే బలవంతం మీద ఆధార్ ను తీసుకురావడం ఒకటే మార్గమమా? అని సుప్రీం ప్రశ్నించింది. గత నెల సవరించిన ఆర్థికబిల్లులో బ్యాంకు అకౌంట్లకు, పాన్ కార్డుకు, ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కు ఆధార్ ను కేంద్రం తప్పనిసరి చేసింది. పాన్ కార్డుకు ఆధార్ తప్పనిసరి చేస్తూ దాఖలైన పిటిషన్ పై తదుపరి విచారణ ఏప్రిల్ 25న చేపట్టనున్నట్టు సుప్రిం చెప్పింది. సామాజిక పథకాలకు ఆధార్ తప్పనిసరి చేయొద్దంటూ అంతకమునుపే సుప్రీం తీర్పునిచ్చింది. -
పాన్ కార్డుకూ ఆధార్ లింకు!
మీకు పాన్ కార్డు ఉందా? దానికి ఆధార్ కార్డును లింక్ చేసుకున్నారా... లేకపోతే వెంటనే త్వరపడండి. మీరు అలా లింక్ చేయకపోతే వచ్చే సంవత్సరం జనవరి ఒకటో తేదీ తర్వాత మీ పాన్ కార్డు ఎందుకూ పనికిరాదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలే తెలిపాయి. ఇప్పటికే దాదాపు దేశవ్యాప్తంగా చాలామందికి ఆధార్ కార్డులున్నాయి. దాంతో వాటి వాడకాన్ని మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం తలపెడుతోంది. ప్రస్తుతం ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేవారందరికీ తప్పనిసరిగా పాన్ కార్డు ఉండాల్సిందే. అంతవరకు ఓకే గానీ, పన్నులతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కూడా చాలామంది పాన్ కార్డులు తీసుకుంటున్నారు. కానీ, వీటిలో చాలావరకు నకిలీ కార్డులు ఉన్నాయన్న అనుమానాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఒక్కరే రెండేసి కార్డులు తీసుకున్న సందర్భాలు సైతం అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయి. దాంతో ఇలాంటి అక్రమాలన్నింటికీ చెక్ పెట్టేందుకు పాన్ కార్డుకు ఆధార్ లింకేజి ఏర్పాటుచేయాలని ప్రభుత్వం తలపెట్టింది. డిసెంబర్ 31వ తేదీలోగా ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని చెబుతున్నారు. దేశ జనాభాలోని పెద్దవాళ్లలో 98 శాతం మందికి ఆధార్ కార్డులు ఉన్నాయని, దాంతో.. ఈ ఏడాది చివరవరకు అంటే సమయం చాలా ఉన్నట్లేనని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో 108 కోట్ల మందికి ఆధార్ కార్డులున్నాయి. అందువల్ల ప్రభుత్వ పథకాల లబ్ధి లాంటి వాటన్నింటికీ దీన్ని అనుసంధానం చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ ఉపయోగాన్ని క్రమంగా విస్తరిస్తోంది. దేశంలో 25 కోట్ల పాన్ కార్డులున్నాయి. 50 వేలకు మించిన నగదు లావాదేవీలు అన్నింటికీ పాన్ కార్డు నెంబరును రాయడం తప్పనిసరి. అలాగే 2 లక్షల రూపాయలకు మించి బంగారం కొన్నా పాన్ నెంబరును రాయాల్సిందే. ఈ నేపథ్యంలో పాన్ కార్డుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ దశలో ఆధార్ లింకేజిని తప్పనిసరి చేస్తే, ఇక కొత్తగా వస్తున్న కార్డులకు కూడా ఆధార్ లింకేజి ఉంటుంది కాబట్టి.. మోసాలకు తావుండదని భావిస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ తర్వాత తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని, లేకపోతే తమకు ఆధార్ కార్డు ఉందన్న విషయాన్ని నిరూపించుకోవాలని అంటున్నారు. -
24.37 కోట్ల మందికి పాన్ కార్డులు
న్యూఢిల్లీ: దేశంలో 24,37,96,693 మందికి పైగా ప్రజలు శాశ్వత అకౌంట్ నంబర్(పాన్)ను నమోదు చేసుకున్నట్లు ఆదాయ పన్ను శాఖ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగలు, రూ.2 లక్షలకు మించి కొనుగోళ్లు తదితర ఆర్థిక లావాదేవీలకు పాన్ నెంబర్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. ‘ఈ-బిజినెస్’ ప్రత్యేక పోర్టల్ ద్వారా యునిక్ కార్డు అప్లికేషన్లు తీసుకోవడంతో పాటు డిజిటల్ సంతకాన్ని నమోదు చేసే ఆలోచనల్లో ఉన్నట్లు చెప్పారు. పాన్ నమోదు కోసం ఇకపై నగరేతర ప్రాంతాలపై దృష్టి సారించనున్నట్లు వివరించారు. -
24.37 కోట్ల మందికి పాన్ కార్డులు
న్యూఢిల్లీ: దేశంలో 24,37,96,693 మందికి పైగా ప్రజలు శాశ్వత అకౌంట్ నంబర్(పాన్)ను నమోదు చేసుకున్నట్లు ఆదాయ పన్ను శాఖ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగలు, రూ.2 లక్షలకు మించి కొనుగోళ్లు తదితర ఆర్థిక లావాదేవీలకు పాన్ నెంబర్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. ‘ఈ-బిజినెస్’ ప్రత్యేక పోర్టల్ ద్వారా యునిక్ కార్డు అప్లికేషన్లు తీసుకోవడంతో పాటు డిజిటల్ సంతకాన్ని నమోదు చేసే ఆలోచనల్లో ఉన్నట్లు చెప్పారు. పాన్ నమోదు కోసం ఇకపై నగరేతర ప్రాంతాలపై దృష్టి సారించనున్నట్లు వివరించారు.